
కొత్త రుణాలు, పంట బీమా, రుణమాఫీ ఎక్కడ?
బాబు సర్కారుపై జగన్ ధ్వజం
అక్టోబర్ 16న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రైతులకు పంట రుణాల్లేవు. కొత్తగా రుణాలు కావాలని బ్యాంకర్ల వద్దకు వెళ్తే రెన్యువల్స్ చేయమంటున్నారు. అందుకు 14 శాతం వడ్డీ చెల్లించాల్సిందేనంటున్నారు. కొత్తగా రుణాలు లేవు, ఇన్సూరెన్సు లేదు, రుణమాఫీ ఊసే లేదు’’ అని చంద్రబాబు సర్కారుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం సాయంత్రం పులివెందుల నియోజకవర్గంలోని లింగాలలో నాగేశ్వరరెడ్డి అనే రైతుకు చెందిన వేరుసెనగ పంట పొలాన్ని పరిశీలించారు. 90 రోజుల క్రితం సాగైన వేరుశనగ పంట ఎదుగు బొదుగు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. వేరుశనగ మొక్కలను పీకి పరిశీలిస్తే కనీసం ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడాన్ని చూసి ఆయన చలించిపోయారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులవల్లే వేరుశనగ ఊడలు సైతం దిగలేదని చెప్పారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని, పశువుల మేతగా మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాలు అరకొరగా పడిన నేపథ్యంలో పెట్టుబడి సైతం చేతికందని రైతన్నలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం పంటల పెట్టుబడి అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రూ.72కోట్లు కేటాయిస్తే లక్ష ఎకరాలకు నీరు
గండికోట ప్రాజెక్టు క్రింద 22 ముంపు గ్రామాలకు రూ.72కోట్లు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి క్రింద మంజూరుచేస్తే లక్ష ఎకరాలకు నీరు అందించే వెసులుబాటున్నా ప్రభుత్వం పట్టించుకొవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకుండా రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో అక్టోబర్ 16న చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ సమాఖ్య అసిస్టెంట్లకు గౌరవ వేతనం అందించండి
ఇందిరా క్రాంతిపథంలో సుమారు 12ఏళ్లుగా పనిచేస్తున్న గ్రామ సమాఖ్య సహాయకుల (వీవోఏలు)కు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.