అన్నొచ్చాడు.. | YS Jagan Mohan reddy Unbelievable Victory In 2019 Elections | Sakshi
Sakshi News home page

ఏపీలో వైఎస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయం

Published Fri, May 24 2019 3:14 AM | Last Updated on Fri, May 24 2019 11:11 AM

YS Jagan Mohan reddy Unbelievable Victory In 2019 Elections - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్‌ లో సరికొత్త రాజకీయ విప్లవాన్ని సృష్టించింది. రికార్డు స్థాయి విజయంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నవ శకానికి నాంది పలికింది. నిజాయితీ, నిబద్ధతతో పదేళ్లుగా ప్రజల పక్షాన నిలిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ పట్టాభిషేకం చేసింది. నిండు మనసుతో దీవిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అద్భుతమే చేసింది. మొ త్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 151 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో విజయ దుందుభి మోగించి సరికొత్త చరిత్రను లిఖిం చింది. ఏపీ ప్రజలు వైఎస్సార్‌సీపీకి మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ పా ర్టీ చరిత్రలో ఇదే దారుణ ఓటమి అని చెబుతున్నారు.

టీడీపీ దిగ్గజాల ఓటమి  
మాట తప్పని, మడమ తిప్పని వైఎస్‌ జగన్‌ నాయకత్వానికి ఏపీ ప్రజలు ముక్తకంఠంతో జేజేలు పలికారు. కుట్రలు, కుతంత్రాలను ఎదురొడ్డుతూ ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పాదయాత్రికునికి పట్టం కట్టారు. దేవుడి ఆశీస్సులు కోరుతూ... రాజన్న రాజ్యం స్థాపన కోసం అలుపెరుగక శ్రమిస్తున్న జగన్‌ను మనసారా దీవించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2014లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఐదేళ్లపాటు ప్రజావ్యతిరేక పాలన సాగించిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రజల ఓటుదెబ్బకు కుదేలైపోయింది. ఆవిర్భావం అనంతరం ఎన్నడూ లేని రీతిలో కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. 19 మంది మంత్రులు, స్పీకర్, చీఫ్‌ విప్, విప్‌లతోసహా ఆ పార్టీ అతిరథ మహారథులు ఓటమి పాలయ్యారు. ఇక తృతీయ ప్రత్యామ్నాయంగా అవతరిస్తామని చెప్పుకున్న పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. వెరసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. రాష్ట్ర చరిత్రలో అరుదైన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.  

రాష్ట్రమంతటా జగన్‌కు జేజేలు  
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఏపీ ప్రజలంతా తాము వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉన్నామని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును గురువారం చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఇక ఈవీఎంలు తెరిచినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం మొదలైంది. మొదటి రౌండ్‌ నుంచే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా–గుంటూరు, నెల్లూరు– ప్రకాశం, రాయలసీమ... ఇలా ప్రాంతం ఏదైనా ఫలితం ఒక్కటే. అసెంబ్లీ నియోజకవర్గమైనా, లోక్‌సభ నియోజకవర్గమైనా ఫలితంలో తేడా లేదు. రాష్ట్ర మంతటా జగన్‌ నాయకత్వానికే ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు. గురువారం ఉదయం 9 గంటలకల్లా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రానుందని తేటతెల్లమైంది. వైఎస్సార్‌సీపీ ఏపీలో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.  

ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా..  
ఎన్నికల ఫలితాల్లో ఏపీ అంతటా జగన్‌ ప్రభంజనం విస్పష్టంగా కనిపించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ వైఎస్సార్‌సీపీ జైత్రయా త్ర కొనసాగించింది. ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా యావత్‌ రాష్ట్రం జగన్‌కు నీరాజనాలు పలికింది. ఏ జిల్లాలో చూసినా వైఎస్సార్‌సీపీ తిరుగులేని రీతిలో విజయం సాధిస్తూ వచ్చింది. అన్ని జిల్లాల్లోనూ 2014 ఎన్నికల్లో గెలిచిన దాని కంటే రెండు రెట్లకు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచి వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసి పెను సంచలనం సృష్టించింది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 28 స్థానాల్లో విజయఢంకా మోగించింది.

ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలకు గాను 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లో 29 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. రాయలసీమలో వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర కొనసాగించింది. సీమ పరిధిలోని నాలుగు జిల్లాల్లోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 49 సీట్లలో అఖండ విజయం సాధించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్‌ తోపాటు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని స్థానాలను స్వీప్‌ చేసింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ఒక్క కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ బలంగా ఉందని భావించే అనంతపురం జిల్లా లోని 14 స్థానాలకు గాను 12 సీట్ల ను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.

జగన్‌ సునామీలో కొట్టుకుపోయిన టీడీపీ   
వైఎస్‌ జగన్‌ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు టీడీ పీనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. జగన్‌ ప్రభం జనంలో టీడీపీలోని అతిరథ మహారథులు కూడా కొట్టుకుపోయారు. టీడీపీ కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాలు కూడా జగన్‌ ప్రభంజనం ధాటికి తునాతునకలైపోయాయి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24 మంది మంత్రుల్లో 21 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఘోరపరాజయం పాలయ్యారు.

మంత్రులు కళా వెంకట్రావు, సుజయ్‌కృష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు చిత్తుగా ఓడిపోయారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మంత్రి శిద్ధా రాఘవరావు ఘోర పరాజయం పాలయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరాజయం చవిచూశారు. 2014లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి, తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన 23 మందికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వాళ్లలో ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో గొట్టిపాటి రవికుమార్‌(అద్దంకి) తప్ప మిగిలిన వారంతా ఘోరంగా ఓడిపోయారు. చంద్రబాబు తాను పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో మొదటి రెండు రౌండ్లలో వెనుకబడటంతో టీడీపీ షాక్‌కు గురై కొంతసేపు బెంబేలెత్తిపోవడం ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది. 

పత్తాలేని జనసేన పార్టీ
ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్‌గా వ్యవహరించిన పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. జగన్‌ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ అతి కష్టంపై విజయం సాధించారు. దాదాపు 40 శాతం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఓటర్లు ఆ పార్టీని ఎంతగా తిరస్కరించారన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇక జనసేనతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలు అడ్రస్‌ లేకుండా పోయాయి. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు.

22 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్‌ గాలి  
ఏపీలో లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ రికార్డు విజయంతో చరిత్రను తిరగ రాసింది. కడపటి వార్తలు అందే సమయానికి మొత్తం 22 ఎంపీ సీట్లల్లో ఫ్యాన్‌ గాలి బలంగా వీచింది. ఇంకా శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఫలితాలు ప్రకటించిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం, నరసారావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, అనంతపురం, హిందూపూర్, కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించడం వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల ఆదరణకు ప్రతీకగా నిలిచింది.  

ఆ స్థానాల్లో ఫలితంపై ఉత్కంఠ  
శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు లోక్‌సభ స్థానాల ఫలితం ఇంకా తేలలేదు. అలాగే విశాఖ నార్తు, పర్చూరు, ఉరవకొండ అసెంబ్లీ స్థానాల్లోనూ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో ఎవరు నెగ్గుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  అధికార టీడీపీని ప్రజలు ఎంత చిత్తు చిత్తుగా ఓడించారంటే ఏకంగా నాలుగు జిల్లాల్లో ఆ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ధాటికి కడప, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనుమరుగైపోయింది. కనీసం ఒక్క సీటులో కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement