సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రకృతి ప్రకోపించిన ప్రాంతాల్లో పాదయాత్రికుడు పాదం మోపాడు. బాధితులందరికీ తా ను అండగా ఉంటానని ప్రజాసంకల్పయాత్రలో భరోసా కల్పించడంతో బాధితుల కళ్లల్లో ఆనందం వ్యక్తమైంది. సోమవారం పలాస నియోజకవర్గంలో వజ్రపుకొత్తూరు మండలంలో వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతి పక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తిత్లీ తుఫాన్ ప్రభావిత పరిసరాల్లో, కిడ్నీ వ్యాధిగ్రస్తుల గ్రామాల్లో యాత్ర దిగ్విజయంగా సాగింది.
అడుగడుగునా జగన్‌కు మహిళలు హారతులు పట్టారు. అలాగే తాము పడుతున్న కష్టాలను జగన్‌కు వివరించారు. తిత్లీ తుఫాన్ బీభత్సంతో ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు పూర్తిగా నేలకొరిగిపోగా, జీడి చెట్లన్నీ ధ్వంసమైన పరిస్థితులను పలువురు రైతులు జగన్‌కు చూపించారు. ఈ సందర్భంగా ధ్వంసమైన పలు కొబ్బరి తోటలను జగన్ నేరుగా పరిశీలించారు. అలాగే కిడ్నీ వ్యాధి గ్రస్తులను జగన్ నేరుగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం రాజం కాలనీ నుంచి యాత్రను ప్రారంభించి, ధర్మాపురం, గరుడభద్ర, తర్లగాదురు క్రాస్, అక్కుపల్లి మీదుగా గాదురు, చీపురుపల్లి కూడలి, డెప్పూరు కూడలి వద్ద వరకు యాత్ర సాగింది.
కిడ్నీ రోగులకు నెల పింఛన్ రూ.10 వేలు
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిడ్నీ రోగులకు నెల పింఛన్‌గా రూ.10 వేలు ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వజ్రపుకొత్తూరు మండలం డెప్పూరు గ్రామానికి చేరుకున్న జగ న్‌కు అక్కడ వరుస ఇళ్లల్లో ఉన్న కిడ్నీ రోగులు కలుసుకుని వారి కష్టాలు తెలుసుకున్నారు. జిల్లాలో కిడ్నీ రోగులకు తగినంతగా డయాలసిస్ కేంద్రాలు పనిచేయడం లేదని బాధితులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చలించిపోయిన జగన్, తమ పార్టీ అధికారంలోకి రాగానే రూ.10 వేల పింఛన్‌ను ఇస్తానని చెప్తూనే కిడ్నీ రోగులు అధికంగా ఉన్న ఉద్దానం ప్రాంతంలోనే కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే యాత్రలో భాగంగా పలు చోట్ల కొబ్బరి, జీడి పంటల బాధితులు జగన్‌ను కలిసి తమ పంట నష్టాలకు తగిన పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని వివరించారు. దీనిపై జగన్ స్పంది స్తూ పలు కొబ్బరి తోటలను పరిశీలించి బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటానని, కొబ్బరిచెట్టుకు రూ.3 వేలు వరకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీడి పంట హెక్టార్‌కు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
మత్స్యకార ప్రాంతంలో పాదయాత్ర
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 334వ రోజున వైఎస్ జగన్ వజ్రపుకొత్తూరు మండలంలో మత్స్యకార గ్రామాల్లోనే యాత్ర సాగింది. సోమవారం ఉదయం రాజాం కాలనీ నుంచి ప్రారంభమైన యాత్ర సాయంత్రానికి సాగర తీరాన డెప్పూరు గ్రామ పరిధిలోకి వెళ్లి యాత్ర ముగిసింది. దారిపొడవునా మహిళలు, తిత్లీ బాధిత రైతులు, జీడి కార్మికులు జగన్‌ను కలిసి తమ గోడును వివరించారు. యాత్ర పొడవునా భారీ సంఖ్యలో జనాలు, మత్స్యకారులు జగన్‌తో అడుగులు కలిపారు. దీంతో రోజంతా 11.1 కిలోమీటర్ల వరకు యాత్రను సాగించారు.
పాదయాత్రలో పాల్గొన్న నేతలు
ప్రజాసంకల్పయాత్రలో సోమవారం పలువురు నేతలు జగన్‌ను కలిసి సంఘీబావం ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పలాస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, పిరియా సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment