సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని.. స్కూల్స్‌లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడద్దు, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలన్నారు. ఇది ప్రాథమిక సమావేశమని, మళ్లీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
రేపటి నుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరపనున్నారు. జూన్ 3న విద్యా, జలవనరుల శాఖలపై సమీక్ష జరుపుతారు. 4న వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 8న సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8.39 గంటలకు ముఖ్యమంత్రి చాంబర్‌లోకి ప్రవేశించనున్నారు.
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. 42 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయ అధికారులనూ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment