సాక్షి, విజయవాడ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కలిసి ముందుకు సాగి అన్నింటినీ అధిగమించి అభివృద్ధిని సాధిద్దామని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అవరతణ దినోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగువారికి వందనాలు తెలియజేశారు.
తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్షకు దిగారని.. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడిన అందరినీ స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. సంఘ సంస్కర్తలు, కవులు, కళాకారులు మన సమాజానికి పునాదులని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన శ్రమ, పరిశ్రమ హైదరాబాద్‌లోనే మిగిలిపోయిందని అన్నారు. ప్రస్తుతం దగాబడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెనకడగు వేయకుండా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని తెలిపారు. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలిస్తేనే అభివృద్ధిలో ముందుకెళ్తామని తెలిపారు. పాలనలో నవరత్నాలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. కలిసికట్టుగా ఇప్పుడు కష్టపడితే.. భవిష్యత్‌కు బంగారుబాటలు వేయగలమని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీకి గవర్నర్‌గా రావడం నా అదృష్టం : బిశ్వభూషణ్
ఏపీకి గవర్నర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యం ఉన్న రాష్ట్రం. పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్పనేల. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన నేతలు గొప్ప పోరాటం చేశారు. సాతంత్ర్య పోరాటంలో చీరాల-పేరాల ఉద్యమం ఎప్పటికీ మరువలేనిది. విజయవాడ నగరాన్ని మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. భాషాప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉంది. విజయవాడ వాసి పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపొందించి గర్వకారణంగా నిలిచార’ని తెలిపారు.
ఈ వేడుకల సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ ఘనంగా సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతల్లో పొట్టి శ్రీరాములు మనవరాలు, పింగళి వెంకయ్య మనవరాలు, టంగుటూరి ప్రకాశం పంతులు మనువడు, మన్నెం దొర అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులు, వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబసభ్యులు, కడప కోటిరెడ్డి కుటుంబసభ్యులు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు కుటుంబసభ్యులు, పల్నాటి సింహం కన్నెగంటి హనుమంతు కుటుంబసభ్యులు, ఆచార్య ఎంజి రంగా కుటుంబసభ్యులు, ఏపీ తొలిదళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులు ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మూడు రోజులపాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment