సాక్షి, అమరావతి: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయా వర్గాలకు మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఇచ్చి గౌరవించామని, ఏలూరు బీసీ డిక్లరేషన్ ప్రకారం హామీలను ఎన్నికల ప్రణాళికలో చేర్చి పలు పథకాలు ప్రకటించామని చెప్పారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పూలే 129వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అధ్యక్షత వహించారు.
సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఆ పోరాటం స్ఫూర్తిదాయకం.. ‘‘మహాత్మా పూలే సత్యశోధన సమాజాన్ని స్థాపించి సమానత్వం కోసం, మహిళలు చదువుకోవాలని ఆరాటపడ్డారు. అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించారు. ఆ పోరాటం స్ఫూర్తిదాయకం. కట్టుబాట్లను వ్యతిరేకించి తన భార్యను చదివించడమే కాకుండా టీచర్‌గా కూడా చేశారు. పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషిని నేటికీ గుర్తుంచుకుంటాం. అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని మంచి చేయాలని తపించిన వారిలో దివంగత వైఎస్సార్ కనిపిస్తారు. పేదలు పేదరికం నుంచి బయపడాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కరన్నా ఇంజనీరో, డాక్టరో కావాలి. ఇంతియాజ్ (కృష్ణా జిల్లా కలెక్టర్) అన్న లాంటి వారి స్థానాల్లో పేదలు కూర్చోవాలని వైఎస్సార్ ఆరాటపడ్డారు. అలా మార్పు తేవాలని తపించిన వారు ఎప్పటికీ గుర్తుంటారు.
మీ అందరికీ కనిపిస్తోంది..
చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలనే తాపత్రయంతో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను తయారు చేశాం. అందులో చెప్పిన అంశాలు అడుగు ముందుకు పడ్డాయా లేదా అనేది మీ అందరికీ కనిపిస్తోంది. దాదాపు 60 శాతం మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను మంత్రివర్గంలోకి తీసుకున్నాం.
మాట నిలబెట్టుకున్నాం..
ఇవాళ పొద్దునే వ్యాయామం చేస్తూ టీవీ చూశా. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి స్పీకర్, ఎన్సీపీకి ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులట. మన మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌లున్నారు. ఇందులో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. వెన్నెముక లాంటి వారు. మాట ప్రకారం బీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించాం. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్‌ల్లో 50 శాతం కచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇవ్వాలని చట్టాన్ని తెచ్చాం. కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ యార్డులకుగాను 10 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కేలా చట్టం చేశాం. గుడులు, గోపురాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు తెస్తూ చట్టాలు చేశాం.
గర్వంగా చెబుతున్నా..
ఇవాళ ఆర్థిక మాంద్యంతో దేశమంతా ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్నంగా ఉంది. రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర మన రాష్ట్రంలో కనిపిస్తోంది. నాలుగు లక్షల ఉద్యోగాల్లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగు నెలలు తిరగకముందే ఇవ్వగలిగాం. వీరిలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు 70 శాతం వరకు ఉన్నారని గర్వంగా చెబుతున్నా.
ఆర్థిక ఇబ్బందులున్నా వెనుకంజ లేదు..
చంద్రబాబు ప్రతి చోటా అప్పులు మిగిల్చి దిగిపోయారు. అయితే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని సంక్షేమ పథకాలు ఎగొట్టే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. దాదాపు 46 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వగలిగాం. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా దాదాపు 2.36 లక్షల మందికి ఆర్థిక సాయం చేయగలిగామంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే కారణం. మత్స్యకారులకు కూడా సాయం చేశాం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కింద సగటున నెలకు రూ. 500 కోట్లు ఇచ్చేవారు. ఈరోజు పెన్షన్ల కింద సగటున నెలకు రూ.1,400 కోట్లు ఇస్తున్నాం.
వారి పిల్లలు చదివేది ఎక్కడ?
ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకులు, పత్రికాధిపతులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమం స్కూళ్లలోనే చదివిస్తున్నారు.మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలట. అదేమంటే సంస్కృతి పోతుందంటున్నారు. మరి వాళ్ల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవడం లేదా? పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదివితేనే సంస్కృతి పోతుందా? ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నప్పుడు బాధనిపిస్తుంది.
మరో నాలుగు అడుగులు ముందుకు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ అరకొరగా ఇస్తున్న పరిస్థితులను పూర్తిగా మార్చి ప్రతి పేద విద్యార్థికి తోడుగా ఉంటాం. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు నువ్వు చదువు, నేను తోడుగా ఉంటానని గతంలో వైఎస్సార్ స్వరం వినిపించేంది. మళ్లీ అలాంటి స్వరమే ఈరోజు నాలుగు అడుగులు ముందుకు వేసి వినిపిస్తోంది. పిల్లలను చదివించడమే కాదు ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ప్రతి పిల్లాడికి రూ. 20 వేలు చొప్పున అందిస్తాం.
నా పుట్టినరోజు చేనేతలకు సాయం
డిసెంబరు 21న నా పుట్టిన రోజు సందర్భంగా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఉగాది నాటికి పేదలకు 24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతాం. దేవుడి దయతో రాబోయే రోజుల్లో మీ బిడ్డ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ముందడుగు వేస్తున్నాడు’. పూలే వర్థంతి సభలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, గుమ్మనూరు జయరాం, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, మల్లాది విష్ణు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రామారావు, బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం.రామారావు, కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రతిచోటా అప్పులు మిగిల్చి దిగిపోయారు. అయితే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని సంక్షేమ పథకాలు ఎగ్గొట్టే ఆలోచన ఎప్పుడూ చేయలేదు.
– సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment