వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి.. ఏర్పాట్లు చకచకా  | YS Jagan swearing-in ceremony Preparations Is Going as Fast | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి.. ఏర్పాట్లు చకచకా 

Published Tue, May 28 2019 3:50 AM | Last Updated on Tue, May 28 2019 7:10 AM

YS Jagan swearing-in ceremony Preparations Is Going as Fast - Sakshi

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీజీపీ ఠాకూర్, నగర కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, డీసీపీలు అప్పలనాయుడు, రాజకుమారి తదితరులు

విజయవాడ/సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జరగనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వచ్చే గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు జరిగే ఈ కార్యక్రమం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. స్టేడియంను సోమవారం లెవలింగ్‌ చేసి వాటరింగ్‌ చేశారు. భారీ వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. గ్యాలరీలు, బారికేడింగ్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. స్టేడియంతోపాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియంకు వచ్చే రహదారులకు మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. సిటీ కేబుల్‌తోపాటు అన్ని లోకల్‌ చానల్స్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్టేడియంలో ఏఏ, ఏ1, ఏ2.. ఇలా వివిధ కేటగిరీల కింద మొత్తం 18రకాల గ్యాలరీలు, మీడియాకు ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో గ్యాలరీకి ఇద్దరు అధికారులను నియమించారు. గవర్నర్, జ్యుడీషియరీ, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటుచేస్తున్నారు. వీరందరికీ కలిపి సాధారణ పరిపాలనా విభాగం నుంచి 11,500ల పాస్‌లు జారీచేయనున్నారు. స్టేడియంలో మిగిలిన గ్యాలరీల్లోకి సామాన్య ప్రజలను వేరే గేట్‌ ద్వారా అనుమతిస్తారు. ఈ 11,500 పాస్‌లు పోను.. సుమారు 15వేల నుంచి 20వేల మంది సామాన్య ప్రజలను సాధారణ గ్యాలరీలలోకి అనుమతిస్తారు.  

డీజీపీ, సీపీ ఏర్పాట్ల పరిశీలన 
కాగా, డీజీపీ ఆర్పీ ఠాకుర్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావులు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను సోమవారం స్వయంగా పరిశీలించారు. పలు అంశాలపై డీజీపీ కొన్ని సూచనలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి తదితర నేతలు కూడా ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.  

ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటుచేసే ప్రాంతాలివే..  
ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలోని ఫుట్‌బాల్‌ గ్రౌండ్, బెంజిసర్కిల్, ఎన్టీఆర్‌ సర్కిల్, స్వరాజ్య మైదానం, ఆర్టీసీ బస్టాండ్, బీఆర్టీఎస్‌ రోడ్డు, కేదారేశ్వరపేట, పంజా సెంటర్, స్వాతి రోడ్డు జంక్షన్, కాళేశ్వరరావు మార్కెట్, పైపులరోడ్డు, సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్, డాబాకొట్లు సెంటర్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, రైల్వేస్టేషన్, పాత గవర్నమెంట్‌ ఆస్పత్రి రోడ్డు, బెరంపార్కు, రామవరప్పాడు సెంటర్, సిద్దార్థ కాలేజి, కానూరు రోడ్డులలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.  

పార్కింగ్‌ ప్రదేశాలు ఇవే.. 
రాత్రి 8 గంటలకు డీజీ గౌతం సవాంగ్‌ వచ్చి ఏర్పాట్ల గురించి నగర సీపీ ద్వారకా తిరుమలరావును అడిగి తెలుసుకున్నారు. సవాంగ్‌తో పాటు కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్, ఏడీజీ కుమార విశ్వజిత్‌ వచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సవాంగ్‌ సూచించారు. స్టేడియంలో భద్రతా, పార్కింగ్‌ ఏర్పాట్లపై డీసీపీలు రాజకుమారి, హర్షవర్ధన్‌రాజు. రవిశంకర్‌రెడ్డిలకు పలు సూచనలు చేశారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే నాయకులకు సంబంధించిన వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాలను గుర్తించామని సీపీ తెలిపారు. అవి.. 
- హైదరాబాద్, చెన్నై, విశాఖ మార్గాల్లో వచ్చే వాహనాలు.. ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లోనే ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటుచేస్తున్నారు.  
సీఎం కుటుంబ సభ్యులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీఎంలు, అపాట్, ఆర్టీఐ కమిషనర్ల వాహనాలకు మాత్రమే ఇందిరాగాంధీ మైదానంలో పార్కింగ్‌ ఉంటుంది. 
మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లతోపాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖుల వాహనాలకు మాత్రం ఏఆర్‌ గ్రౌండ్‌లోనూ.. ఇతర ముఖ్య అధికారులు, పోలీసు, ఇతర అధికారుల వాహనాలను బిషప్‌ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ను కేటాయించనున్నామన్నారు.  
మాజీ ఉన్నతాధికారుల వాహనాలకు ఆర్‌టీఏ ఆఫీస్‌ ప్రాంగణం కేటాయించారు.  
ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రామవరప్పాడు సమీపంలో.. హైదరాబాదు వైపు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి సమీపంలో, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కానూరు సమీపంలో, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజ టోల్‌గేటు సమీపంలో పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లుచేస్తామని తెలిపారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడండి : కలెక్టర్‌ 
మరోవైపు.. సీఎం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లకు సంబంధించి కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ఆహ్వానితులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయా శాఖల అధికారులు పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వీఐపీల ప్రొటోకాల్‌ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. దాదాపు రెండు లక్షల మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు పంపిణీ చేయాలని.. మంచినీరు సరఫరాలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పార్కింగ్‌ ప్రదేశాలు అందరికీ తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో జేసీ కృతికా శుక్లా, విజయవాడ సబ్‌కలెక్టర్‌ మిషాసింగ్, ప్రొటోకాల్‌ జేడీ అశోక్, జేసీ–2 పి.బాబూరావు, ప్రమాణ స్వీకారోత్సవ కో–ఆర్డినేషన్‌ కమిటీ ప్రతినిధి తలశిల రఘురాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement