
తండ్రి సమాధి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వాన్నే ధిక్కరించారు..కేసులు పెట్టి కష్టాల పాల్జేసినా లెక్కచేయలేదు.. పదవిని తృణప్రాయంగా త్యజించి పార్టీ పెట్టారు.. ప్రజాక్షేత్రంలోకి దూకారు..నేనున్నానంటూ అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచారు.. వారితో మమేకమయ్యారు.. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం తృటిలో చేజారినా జావగారిపోలేదు..ప్రజలే నా కుటుంబం.. వారి లోగిళ్లే నా ఇల్లు.. అంటూ నిత్యం వారిలోనే, వారితోనే గడిపారు..మహానేత మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చినా.. హుద్‌హుద్ దాటికి కకావికలమైన విశాఖను ఆర్తిగా అక్కున చేర్చుకున్నా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే లక్ష్యమంటూ తొలిసారి విశాఖలో యువభేరి మోగించినా.. భూబకాసురుల నుంచి విశాఖను రక్షించేందుకు సేవ్ విశాఖ అని గర్జించినా.. అవినీతి పాలకుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినదించినా.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మహాసంకల్పం పూనినా.. ఆ కష్టాల నుంచి వారిని గట్టెక్కించేందుకు నవరత్నాలను సిద్ధం చేసినా.. ఆ ఒక్కడికే చెల్లింది. అవే అతడిని మేరునగధీరుడిగా నిలిపాయి. అఖండ విజయంతో సీఎం సింహాసనంపై కూర్చుండబెట్టాయి.
ఆటంకాలను, కుట్రలను, దాడులను ఎదుర్కొంటూ.. మొక్కవోని దీక్షతో లక్ష్యం సాధించిన జగన్మోహనుడు.. సంక్షేమ పాలనతో ఆంధ్రభోజుడుగా ఖ్యాతి గడించాలని..అంగళ్ల రతనాలు అమ్మినారట అచట.. అని నాటి కృష్ణదేవరాయల పాలనన జ్ఞప్తికి తెచ్చేలా.. రాష్ట్ర ప్రజలందరి ఇళ్లలో నవరత్నాల వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. నింపుతారని మనసారా విశ్వసిస్తూ.. జిల్లాలో ఆ పోరాట యోథుడి తొమ్మిదేళ్ల జ్ఞాపకాల ముద్రలు...
మన్యం.. మైదానం.. సేవాపథికుడ్ని చూసి జయహో అంటోంది.కష్టాలకు వెరవని ధీరత్వానికి ఊరూ, వాడా సలాం చేస్తోంది.ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎందాకైనా వెళ్లే గుణాన్ని విశాఖ జనం మెచ్చుకుంటోంది.ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవే మిన్నగా భావించి నూతన చరిత్రను లిఖించిన జగన్మోహనుడిని మనసారా ఆశీర్వదిస్తోంది.ప్రజాసేవలో తరించి.. ప్రజల కష్టాల్ని తన కష్టంగా భావించి.. ప్రజాతీర్పుతో సంక్షేమ ప్రదాతగా నిలవబోతోన్న రాజన్న తనయుడి ప్రమాణస్వీకార మహోత్సవ వేళ నాటి జ్ఞాపకాల్ని తలచుకుంటోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జై కొడుతోంది.
కొయ్యూరు(పాడేరు): మహానేత మరణాన్ని తట్టుకోలేక మండలంలోని నల్లగొండకు చెందిన వాకపల్లి లక్ష్మి(50) మరణించింది. ఓదార్పు యాత్రలో భాగంగా రాజన్న తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి 2010 ఏప్రిల్‌లో ఈ మారుమూల గిరిజన గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. దీనికి గుర్తుగా వైఎస్సార్ అభిమానులు గ్రామంలో మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతి, జయంతికి ఇక్కడ పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ‘జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తమ గ్రామం పుణ్యం చేసుకుందని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతారనే విశ్వాసం తమకుందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని’ చెప్పారు మాజీ సర్పంచ్ పల్లి చిన్నభాయి.
అన్నదాతకు అండగా...
♦ అనకాపల్లి: తమ ప్రాంతం కష్టసుఖాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భాగస్వాములయ్యారని, పలుమార్లు తమ ప్రాంతాన్ని సందర్శించారని ఆయన ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందాన్నిస్తోందని చెబుతున్నారు అనకాపల్లి వాసులు.
♦ ఓదార్పుయాత్రలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు.
♦ పైలిన్ తుపాన్ ప్రభావంతో పంట నీటమునిగింది. అన్నదాతను పరామర్శించేందుకు ఆవఖండంను సందర్శించారు.
♦ హుదూద్ తుపాన్ కారణంగా ధ్వంసమైన తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని పరిశీలించేందుకు వచ్చారు. తుమ్మపాల మీదుగా వెంకుపాలెం చేరుకుని దారిపొడవునా రైతులతో మాట్లాడారు. వారికి భరోసానిచ్చారు.
♦ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 2018 ఆగస్ట్ 29న అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
♦ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 7న అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరై ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించారు.
పదిలమైన జ్ఞాపకం
కోటవురట్ల(పాయకరావుపేట): ‘ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర కోటవురట్ల మీదుగా గొట్టివాడ చేరుకుంది. గ్రామస్తులందరం తలుపులమ్మతల్లి పండుగను చేసుకుంటున్నాం. ఒక్కసారిగా గ్రామంలోకి వచ్చిన జగనన్న చూసి ఉబ్బితబ్బిబయ్యాం. అందరినీ పలకరించి కష్టసుఖాలను తెలుసుకున్నారు. చిన్నారులతో సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఆ క్షణాలు మరిచిపోలేనవి.’ అని చెబుతున్నారు గొట్టివాడ గ్రామ ప్రజలు.
దోస్త్ మేరా దోస్త్...
పాడేరు : తమ స్నేహితుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణం తమకు ఆనందదాయక సందర్భమని చెబుతున్నారు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి స్నేహితులు. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌లో పదేళ్ల(1979–89)పాటు జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి చదువుకున్నామని నాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు పాడేరుకు చెందిన కిముడు వెంకటలింగం, కిల్లు సుధాకర్ నాయుడు. జిల్లాలో ప్రజా సంకల్పయాత్రకు వచ్చినప్పుడు తమను పేరుపేరునా పలకరించి ఎంతో అభిమానం చూపారని వారు చెప్పారు.
పేరులో అభిమానం
జ్ఞానాపురం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నా..ఆయన కుటుంబం అన్నా ప్రజానీకంలో అభిమానం ఎప్పుడూ తొణికిసలాడుతుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటారు. జ్ఞానాపురానికి చెందిన ఉపాధ్యాయుడు పాత్రపల్లి సునీల్‌కి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానం. ఆయన తనయుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నా వల్లమాలిన ప్రేమ. గురువారం ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో సునీల్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. సునీల్ తన కుమారుడుకు వైఎస్సార్ అని.. కుమార్తెకు షైనీ వర్ష (వైఎస్ జగన్ కుమారై పేరు) అని నామకరణం చేసుకుని వారిని తమ పిల్లల్లో చూసుకుంటున్నారు. అంతేకాదు సునీల్ రాజశేఖరరెడ్డితో పాదయాత్రలో నడిచారు. అలాగే 2018లో వైఎస్ జగన్‌తోనూ పాదయాత్రలో పాల్గొన్నారు. కుటుంబంతో కలసి దొండపర్తిలో జగన్‌ను కలసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్ సీఎం కాబోతుండడంతో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆ కుటుంబం ఆనందం వ్యక్త పరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment