
'రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదు'
చిత్తూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వారివురూ కుమ్మక్క రాజకీయాలకు పాల్పడుతూ విభజనకు సహకరిస్తున్నారన్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాళహస్తి సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించడం మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం దేశంలో ఎక్కడా జరగడంలేదని జగన్ తెలిపారు.
అసలు మనస్సాక్షే లేకుండా సభ జరుగుతుందని జగన్ విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు ఏ రోజూ విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఉచితంగా కరెంట్ ఇస్తామంటే తీగలపై బట్టలారేసుకోవాలని బాబు వ్యంగ్యంగా మాట్లాడిన సంగతిని జగన్ గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ కాదు..అసలు వడ్డీనే మాఫీ చేయలేదన్నారు. అక్కా చెల్లెళ్లను లక్షాధికారులను చేయాలని వైఎస్‌ఆర్ పావలా వడ్డీ ఇస్తే చంద్రబాబు వడ్డీతో సహా వసూలు చేశారని జగన్ తెలిపారు.
ఆనాడు పేదవారికి వైఎస్ఆర్ దిక్కుగా నిలిచారని అన్నారు. ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచన చెయ్యడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయమంటే చనిపోయాక కూడా బతకడానికి ఆరాటపడడమేనని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే కుట్రలు, కుతంత్రాలతో తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు. త్వరలో రాజకీయవ్యవస్థలో మార్పులొస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు.