చిత్తూరు: సమైక్య ఉద్యమాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీరుగారుస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సమైక్యం మాటెత్తని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆదివారం జిల్లాలోని అంగళ్లులో వైఎస్ జగన్ ప్రసంగించారు. అసెంబ్లీలో అవిశ్వాసంపై కాంగ్రెస్ సర్కారుకు అండగా నిలిచింది బాబు కాదా? అని నిలదీశారు. ఆ రోజు కాంగ్రెస్ సర్కారును బాబు కాపాడకపోయుంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను కూడా తెప్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
అధికారంకోసం రూ.2కు కిలో బియ్యం అన్న బాబు తర్వాత రూ.5లు చేశారని, ఉచిత కరెంట్ ఇవ్వమని ప్రతిపక్షాలు అడిగితే తుపాకులతో కాలిపించారన్నారు. రూ.50 హార్స్ పవర్ ఉన్న విద్యుత్‌ను రూ.600కు పెంచారని జగన్ తెలిపారు. కాంగ్రెస్-టీడీపీలను ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజు అతి త్వరలోనే వస్తుందన్నారు. చంద్రబాబులో లేనిది, జగన్‌లో ఉన్నది విశ్వసనీయత ఒక్కటేనని స్పష్టం చేశారు. తాను జైలులో ఉండి కూడా కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాలేదని, చంద్రబాబు బయట ఉండి కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ఏముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళుతుందని జగన్ నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అనుక్షణం ప్రజల గురించే ఆలోచించే వారని, .ప్రతీ పేదవాడి గుండెల్లోఆయన ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.