
ఉండవల్లి నుంచి నేడు జగన్ పర్యటన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించి రైతులు, రైతు కూలీలతో మాట్లాడతారని చెప్పారు. ఉదయం 8 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గ్రామం నుంచి జగన్ పర్యటన మొదలవుతుందన్నారు. పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. రాజధాని గ్రామాల్లో పర్యటన తర్వాత గుంటూరు చేరుకుని పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడతారని, అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారని వివరించారు.
తమ పార్టీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని ముందు నుంచీ చెబుతున్నామని, తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణ క్రమంలో అక్కడి రైతులు, రైతు కూలీల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా, వారికి ఎలాంటి ఇబ్బందు లు సృష్టించకుండా చూడాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతుల్లో మనోధైర్యం నింపటానికి, అన్ని విధాలా వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికే జగన్ పర్యటిస్తున్నారని వివరించారు.