
నెల్లిమర్ల బహిరంగ సభలో అశేషజనవాహిని నడుమ ప్రసంగిస్తున్న జననేత (ఫైల్)
నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర నెల్లిమర్లలో దిగ్విజయంగా సాగింది. కొండవెలగాడ, నెల్లిమర్ల మీదుగా సాగిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పట్టారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో ఎంతో మంది ప్రజలు తమ కష్టాలను జగన్ మోహన్‌రెడ్డికి చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడు ఏకపక్ష ధోరణితో విసుగు చెందుతున్నామని.. మీరే మాకు ముఖ్యమంత్రిగా రావాలని ఆశీర్వదించారు. ఉద్యోగ సంఘాల నాయకులు, చేతి వృత్తుల వారు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ప్రజాశీస్సులు ఫలించడంతో జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆనాటి పాదయాత్ర విశేషాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద బహిరంగ సభ జరుగుతోంది.. కిక్కిరిసిన జనం.. అడుగు వేయడం కూడా కష్టమే.. అదే సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన గర్భిణి యాల రాజేశ్వరి ఆటోలో ఆ దారి గుండా వెళ్లాల్సి వచ్చింది. జనం మధ్యలోంచి ఆటో వెళ్లలేకపోవడాన్ని వేదిక నుంచే గమనించారు జగన్‌ర మోహన్‌రెడ్డి. వెంటనే ప్రసంగాన్ని ఆపేశారు. నిండు చూలాలి బాధ చూసి చలించిపోయారు. వెంటనే అన్నా.. ఆటోకు దారివ్వండన్నా..అంటూ పదే పదే మైక్‌లో చెప్పారు. జననేత అభ్యర్థనతో అభిమానులంతా క్రమశిక్షణతో పక్కకు జరిగారు. కొందరు రక్షణ వలయంగా ఏర్పడి ఆటోను ముందుకు నడిపించారు..108 అంబులెన్స్‌ల దుస్థితి నేడు ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజేశారు.
జననేతను చూసేందుకు పోటెత్తిన మహిళలు...
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మండలంలో కొండవెలగాడ గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. కొండవెలగాడలోనే రాత్రి బస కావడంతో మరుచటి రోజు ఉదయం 6 గంటల నుంచే జననేతను చూసేందుకు మహిళలు బారులు తీరారు. దీంతో రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. జగన్‌మోహన్ రెడ్డి బయటకు రాగానే కేరింతలు కొడుతూ ఘనంగా ఆహ్వానించారు. మా గ్రామానికి ముఖ్యమంత్రి వచ్చారంటూ గతంలో జరిగిన సంఘటనను ఎంతో ఆనందంగా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు..
Comments
Please login to add a commentAdd a comment