
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్ సీపీ బీసీ సెల్ సమావేశం సోమవారం విజయవాడలో జరగనుంది. దీంతోపాటు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నెలరోజులకు పైగా దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ మంగళవారం ధర్మవరం వెళ్లనున్నారు. అకుంఠిత దీక్ష, పట్టుదల, దృఢసంకల్పంతో రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేలా చూసేందుకు వైఎస్ జగన్ పోరాటం కొనసాగించనున్నారు.
తాను అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తానంటూ ఇచ్చిన హామీని తుంగలోతొక్కి సీఎం చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ బీసీ విభాగం నేతలు మండిపడుతున్నారు. ఏపీలో బీసీలను టీడీపీ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకే వాడుకుంటుంది తప్ప, వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. దీనికి వైఎస్ జగన్ అధ్యక్షత వహించనున్నట్లు వైఎస్‌ఆర్ సీపీ బీసీ విభాగం ఏపీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై జరగనున్న ఈ సమావేశానికి ఏపీ వైఎస్ఆర్‌సీపీ బీసీ విభాగం నేతలు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment