‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ | YS Jaganmohan Reddy in The Election Campaign Took Place in The First Session of The District. | Sakshi
Sakshi News home page

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’

Published Mon, Mar 18 2019 7:55 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 AM

YS Jaganmohan Reddy in The Election Campaign Took Place in The First Session of The District. - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని అంబాజీపేటలో చేపట్టిన తొలి సభ జనప్రభంజనంలా సాగింది. యువకులు, మహిళలు, వృద్ధులు, రైతులు, కర్షకులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలవారూ హాజరై జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. అంబాజీపేటలో మునుపెన్నడూ లేనివిధంగా వేలాది మంది జనాలతో సభ జరగడం చర్చనీయాంశమైంది. పి.గన్నవరం నుంచి అంబాజీపేట వరకూ జనప్రవాహం వెల్లువెత్తింది. కనుచూపు మేరంతా ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపించారు. ‘జైజగన్‌.. సీఎం సీఎం..’ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.

పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని తొలుత షెడ్యూల్‌ ప్రకటించారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచే భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. పి.గన్నవరం నుంచి అంబాజీపేట వరకూ జనగోదారి పోటెత్తింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పర్యటనలో చోటు చేసుకున్న జాప్యం కారణంగా జగన్‌ సుమారు రెండున్నర గంటలు ఆలస్యంగా అంబాజీపేట చేరుకున్నారు. అయినప్పటికీ జనాలు చెక్కు చెదరలేదు. అటు హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసిన పి.గన్నవరం నుంచి ప్రచార సభ జరిగే అంబాజీపేట వరకూ ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా వేచి ఉన్నారు. దీంతో పి.గన్నవరం నుంచి అంబాజీపేట వరకూ రహదారి జనంతో నిండిపోయింది. అంబాజీపేటకు కిలోమీటరు దూరంలోనైతే అడుగు తీసి అడుగు వేయలేనంత రద్దీ కనిపించింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం అంబాజీపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రజల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది. ఆలోచింపజేసింది. ‘‘పాదయాత్రలో మీ కష్టాలు చూశా. మీ సమస్యలు విన్నా. ప్రతి కుటుంబం ఏమనుకుంటోందో దగ్గర నుంచి విన్నాను. సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆశతో ఎదురు చూస్తూ.. ఆ సహాయం ఎండమావై.. అన్యాయమైన పరిస్థితుల్లో.. సమస్యల సుడిగుండంలో ఉన్న ఆ ప్రతి కుటుంబ సభ్యునికి, ఆ ప్రతి కుటుంబానికి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా’’ అంటూ జగన్‌ ప్రసంగం ప్రారంభించగానే అంబాజీపేట ఎన్నికల ప్రచార సభ ఒక్కసారిగా హర్షధ్వానాలతో మార్మోగిపోయింది.

జగన్‌ మాట్లాడుతూ, కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలను స్మార్ట్‌సిటీలుగా చేస్తానంటూ చంద్రబాబునాయుడు గతంలో హామీ ఇచ్చారని, ఆయన సీఎం అయిన తరువాత ఆ మాటలు అమలుకు నోచుకోలేదని అన్నారు. చివరకు కాకినాడ స్మార్ట్‌సిటీకి ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘‘పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రో కారిడార్‌ అన్నారు. కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ అన్నారు. తునిలో నౌకానిర్మాణ కేంద్రమన్నారు. కొత్తగా ఇంకో పోర్టు అన్నారు. ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు అన్నారు.

ఎక్కడైనా మీకు కనిపించాయా? తెలుగు విశ్వవిద్యాలయం, కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, ఫుడ్‌పార్కు, ప్రాసెసింగ్‌ యూనిట్‌.. ఇలా చంద్రబాబు చాలా కథలు చెప్పారు. మనందరికీ గొప్పగొప్ప సినిమాలు చూపించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన హామీలకు కూడా దిక్కు లేదంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఈయనగారి చిత్తశుద్ధి ఏమిటో’’ అని అన్నారు. ఆయన చంద్రబాబు హామీల గురించి ప్రశ్నించిన ప్రతిసారీ ‘లేదు లేదు’ అంటూ ప్రజల సమాధానాలతో సభ దద్దరిల్లింది. చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్ని మోసగించిన ముఖ్యమంత్రి తీరుపై ధ్వజమెత్తుతూ, అధికారంలోకి వస్తే తానేం చేస్తానో స్పష్టంగా చెబుతూ సాగిన జగన్‌ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.


‘‘మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి చిట్టిబాబు. మీ పార్లమెంట్‌ అభ్యర్థి చింతా అనురాధ’’ అని చెబుతూ, వారి చేతులెత్తి జగన్‌ ప్రకటించగానే ఆ ప్రాంతం చప్పట్లతో మార్మోగింది. చివరిగా ఎంపీ పండుల రవీంద్రబాబును పరిచయం చేశారు. రవీంద్రబాబును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని.. జిల్లాలో తొలి ఎమ్మెల్సీ సీటును ఆయనకే ఇస్తానని ప్రకటించడంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇదే వేదికపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఆయన అనుచరులు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరడం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రచార సభలో అభ్యర్థులు చింతా అనురాధ (అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం), ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (మండపేట), కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్‌), పినిపే విశ్వరూప్‌ (అమలాపురం), బొంతు రాజేశ్వరరావు (రాజోలు), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (రామచంద్రపురం), పీఏసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎయిర్‌పోర్టులో జగన్‌కు వీడ్కోలు
మధురపూడి (రాజానగరం): ఎన్నికల ప్రచారం నిమిత్తం జిల్లాకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి 9 గంటలకు విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయనకు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రంబోస్, నేతలు కురసాల కన్నబాబు, మార్గాని భరత్, పినిపే విశ్వరూప్, రౌతు సూర్యప్రకాశరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెండెం దొరబాబు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, నాయకుడు బొమ్మన రాజుకుమార్‌ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement