వైఎస్ జగన్ కాకినాడ పర్యటన ఖరారు
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నఅనంతరం ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ కాకినాడ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన 26న (శనివారం) కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అస్వస్థత కారణంగా వైఎస్ జగన్ పర్యటనను ఆదివారానికి పోస్ట్ పోన్ చేశారు.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రెండు చోట్ల బహిరంగసభలు, రోడ్డు షో నిర్వహించనున్నారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వెల్లడించారు. శనివారం సాయంత్రం కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి కారులో కాకినాడ వస్తారని, ఉదయం 10.30 గంటలకు అన్నమ్మ ఘాటి వద్ద జరిగే బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డులో రోడ్డు షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డెయిరీ ఫారం సెంటర్ చేరుకున్న తర్వాత అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమవుతారని తెలిపారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కాకినాడ పౌరులు జగన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.