సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై మెరుపు దాడులు నిర్వహించింది. ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో ఏక కాలంలో 25 ఏసీబీ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. పక్కా వ్యూహంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు నగదు, నగలు బయటపడ్డాయి.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్‌రావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గంధం వెంకట పల్లంరాజు, తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) లంకె రఘుబాబు, విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామ పీఏసీఎస్ స్టాఫ్ అసిస్టెంట్ సీరంరెడ్డి గోవిందు, కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ (పీఏ టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్) సాకే సత్యం ఇళ్లతోపాటు వారి బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ఐదుగురుకి చెందిన ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.11 కోట్లు పైబడి ఉంటాయని, బయట మార్కెట్‌లో ఇంకా ఎక్కువగా ఉంటాయని ఏసీబీ డీజీ తెలిపారు. వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
భారీగా ఆస్తులు, బంగారం, నగదు గుర్తింపు
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) సీఈవో లంకె రఘుబాబు ఇంటిపైన, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంధం వెంకట పల్లంరాజు ఉంటున్న లాడ్జిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాకినాడలో పల్లంరాజుకు సంబంధించిన ఆదాయ వివరాలు ఏమీ లభించకపోవడంతో ఆయనను విశాఖపట్నం తీసుకెళ్లారు. కాగా లంకె రఘుబాబు నివాసంలోని సోదాల్లో దాదాపు రూ.15 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. రఘుబాబు ఇంటితోపాటు విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంలోని ప్రాంతాల్లో ఉంటున్న ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ పీఏ ఆస్తుల విలువ రూ.5 కోట్లు
విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయనకు ఆదాయానికి మించి 1.75 కోట్ల అక్రమాస్తులున్నట్టు గుర్తించారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ సాకే సత్యం ఇంటితోపాటు ఆయన తమ్ముడు నారాయణస్వామి ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురంలో నిర్వహించిన సోదాల్లో పలు ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలతోపాటు బంగారు నగలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.5 కోట్లకుపైగానే ఉంటుందని నిర్ధారించారు. గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ) పార్వతీపురంలో ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తూతిక మోహనరావుకు సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురంలో ఉన్న ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి మార్కెట్ విలువ ప్రకారం మొత్తం రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment