కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన 17వ వార్డు కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టార్) అత్యధిక మెజారీ్టతో విజయకేతనం ఎగురవేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యులు మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు 35 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు.
చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా వైఎస్సార్ సీపీ బలపరిచిన చోడిపల్లి సత్యప్రసాద్‌కు 25 మంది కార్పొరేటర్లు అనుకూలంగా ఓటు వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వాసిరెడ్డి రామచంద్రరావు ప్రతిపాదించగా ఎంజీకే కిషోర్ బలపరిచారు. టీడీపీ తరఫున పలివెల రవి అనంతకుమార్‌ను ఆ పార్టీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ ప్రతిపాదించగా మేయర్ సుంకరపావని బలపరిచారు. పలివెల రవికి మద్దతుగా 10 మంది చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో 25 ఓట్లు దక్కించుకున్న చోడిపల్లి ప్రసాద్ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు జేసీ లక్ష్మీశ ప్రకటించారు.
ఫారమ్ ఏ, బీలలోనూ టీడీపీ వైఫల్యం
టీడీపీలో అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది. 24 గంటల ముందు విప్‌జారీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో లేఖను ఎన్నికల అధికారికి అందజేశారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ నిబంధనల ప్రకారం 24 గంటల ముందుగా లేఖ ఇవ్వనందున విప్ చెల్లదని స్పష్టం చేశారు. పార్టీ అభ్యరి్థకి సంబంధించిన ఇతర వివరాలతో కూడిన లేఖ ఒరిజనల్ ఇవ్వకుండా నకలు ఇచ్చినందున తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉదయాన్నే పోటీలో నిలవడం, పత్రాలన్నీ గందరగోళంగా ఉండడం, పార్టీ తీరుతో వ్యతిరేకించి మరో అభ్యరి్థకి మద్దతుగా నిలవడం వంటి సంఘటనలు టీడీపీ అనైక్యతను బయటపెట్టాయి.
మేయర్ అవగాహనా రాహిత్యం
డిప్యూటీమేయర్ ఎన్నికలో మేయర్ సుంకరపావని ఆవగాహన రాహిత్యం బయటపడింది. నాలుగేళ్లపాటు మేయర్‌గా ఉన్నా కౌన్సిల్ నిబంధనలు, ఎన్నికల ప్రక్రియపై ఆమెకు అవగాహన కొరవడిన తీరుచూసి కార్పొరేటర్లు ముక్కున వేలేసుకున్నారు. ఎన్నిక సందర్భంలో మేయర్‌గా తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని ఎన్నిక అధికారిని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి అధ్యక్షత వహిస్తారని, మిగిలినవారంతా కింద వరుస క్రమంలో కూర్చోవాలని ఆయన నిబంధనలను వివరించాల్సి వచ్చింది. అలాగైతే తాను నిలబడే ఉంటానంటూ చేసిన వ్యాఖ్యానం కార్పొరేటర్లను, అధికారులను విస్మయపరిచింది.
సమర్థతకు దక్కిన ‘డిప్యూటీ’ పీఠం
కాకినాడ: ప్రజా సమస్యలపై, కార్పొరేషన్ చట్టాలపైన సంపూర్ణ అవగాహన కలిగిన సమర్థుడైన వ్యక్తికి ఉప మేయర్ పదవి దక్కడం జిల్లా ప్రగతికి శుభపరిణామమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా ఐక్యతతో ఉండి అభివృద్ధి కోసం ఒక అవగాహన కలిగిన ప్రసాద్‌మాస్టార్ వంటి వ్యక్తిని ఎన్నుకున్న తీరు భవిష్యత్‌కు శుభసూచికమని పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బీసీ వాడబలిజ వర్గానికి చెందిన వ్యక్తికి రాజకీయంగా మంచి ప్రాధాన్యత లభించిందని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. 35 మంది కార్పొరేటర్లతో గతంలో అధికారంలో ఉన్న పార్టీ చోడిపల్లిని గుర్తించకపోయినా సీఎం గుర్తించి డిప్యూటీమేయర్‌గా చేశారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మేయర్ సుంకర పావని తీరును వ్యతిరేకిస్తూ అంతా ఒక్కటై ఐక్యత కనబరిచారని ద్వారంపూడి పేర్కొన్నారు. ఉప మేయర్‌గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ మాట్లాడారు.
ఉప మేయర్ జీవిత వివరాలు
పేరు : చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టారు)
వయసు : 56
చదువు : బీఏ, బీఈడీ
నేపథ్యం : 1995 నుంచి రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా నాలుగుసార్లు వరుస విజయాలు. తండ్రి చోడిపల్లి రామం 1982లో కౌన్సిలర్‌గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి. చిన్నాన్న హనుమంతరావు స్వాతంత్య్ర సమరయోధులు. నాలుగుసార్లు గెలిచినా వనమాడి అవకాశం దక్కనీయలేదు.
వాడబలిజలకు దక్కిన అవకాశం
డిప్యూటీ మేయర్ ఎన్నికలో వాడబలిజలకు సముచిత గౌరవం దక్కింది. కాకినాడ చరిత్రలో ఇదొక మంచి పరిణామమంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. దాదాపు 40వేల మంది మత్స్యకారులు ఉన్న కాకినాడలో 50శాతం వాడబలిజలు ఉన్నారు. ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఈ వర్గానికి గుర్తింపు దక్కిన దాఖలా లేదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దినెలల క్రితమే అగి్నకుల క్షత్రియ వర్గానికి చెందిన బంధన హరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు వాడబలిజలకు డిప్యూటీమేయర్ దక్కింది. మత్స్యకార వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన హయాంలో ఈ వర్గాలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయతి్నంచారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో వాడబలిజకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డిప్యూటీమేయర్ కట్టబెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి వైఎస్సార్ సీపీ ఎలాంటి ప్రాధాన్యతనిస్తోందో చెప్పకనే చెప్పింది.
బెడిసికొట్టిన చివరి క్షణ నిర్ణయం
కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని తొలుత ప్రకటించిన టీడీపీ చివరి నిముషంలో తన వైఖరిని మార్చుకుని పోటీలో నిలబడింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు పార్టీ అధినేత నుంచి గట్టిగా మందలింపురావడతో పోటీ చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. వనమాడి వ్యవహారశైలి, నియంతృత్వ పోకడలపై అసంతృప్తిగా ఉన్న అనేక మంది టీడీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు చేయడంతోపాటు మరికొంత మంది సమావేశానికి హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment