డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి అరాచకం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థలో డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి ప్రభుత్వం తిరుపతిలో అరాచకం సృష్టిస్తోంది. ఏడాది మాత్రమే ఉండే ఈ పదవిని బలం లేకపోయినా సరే దక్కించుకోవాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డి, మరి కొందరు కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసానికి తెగబడింది. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేయించింది. తిరుపతి డిప్యూటీ మేయర్‌గా ఉన్న భూమన అభినయ్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి, సాధారణ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగారు.
కొత్త డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 3న జరగనున్న ఎన్నిక కోసం వైఎస్సార్‌సీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డిని పోటీలోకి దింపింది. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 48 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఉన్నారు. టీడీపీ కేవలం ఒక డివిజన్‌లో మాత్రమే గెలిపొందింది. మరో డివిజన్ ఎన్నికపై కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక.. 9 మంది కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీ, జనసేన వైపు తిప్పుకుంది. అయినా వైఎస్సార్‌సీపీకి 39 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఈ లెక్కన న్యాయంగా డిప్యూటీ మేయర్ పదవి వైఎస్సార్‌సీపీదే.
బలం లేదని తెలిసినా బలవంతం
డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన బలం లేకున్నా, అరాచకానికి పాల్పడి అయినా దక్కించుకునేందుకు కూటమి పార్టీల నేతలు అరాచకాలకు తెరలేపారు. 2 రోజుల క్రితం కార్పొరేçÙన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తుల వివరాలు, పాత కేసుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలని వారి కుటుంబీకులకు ఫోన్లు చేసి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేశారు.
మిగిలిన కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ‘అంతు చూస్తాం.. ఆస్తులను ధ్వంసం చేస్తాం. కేసులు బనాయిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. మరో వైపు పోలీసులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి కుటుంబ సభ్యుల వివరాలు చెప్పండని అడిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరూ వారి డిమాండ్లకు ససేమిరా అనటంతో విధ్వంసానికి దిగారు. రెవిన్యూ, కార్పొరేషన్ అధికారులు శనివారం ఉదయం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలు అంటూ శేఖర్‌రెడ్డి, మరికొందరు కార్పొరేటర్లకు చెందిన భవనాలు కూల్చేందుకు జేసీబీలను మోహరించారు.
అలిపిరి పోలీస్టేషన్ సమీపంలోని శాంతినగర్‌లోని భవనం కూల్చేస్తామని పుకార్లకు తెరతీశారు. వందలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో.. శ్రీనివాసం సముదాయం వెనుక డీబీఆర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనంలో రెండు గదుల గోడలను కూల్చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుని నిరసనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు శాంతినగర్‌లోని భవనం ప్రహరీ గోడను కూల్చివేశారు.
నిర్బంధం.. ఆపై అరెస్ట్‌లు
అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు నగర మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, వందలాది మంది పార్టీ శ్రేణులతో కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. దౌర్జన్యానికి దిగి తిట్ల పురాణం అందుకున్నారు. ఇద్దరు కార్యకర్తలను గొంతు నులిమి దాష్టీకాన్ని ప్రదర్శించారు. మేయర్‌ను సైతం నెట్టుకుంటూ అరెస్ట్ చేశారు. భూమన అభినయ్‌రెడ్డిని నిర్భందించి భవనంలోనికి వెళ్లకుండా కట్టడి చేశారు.
బయటకు లాగి పడేసి అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలను బూతులు తిడుతూ చొక్కాలు పట్టుకుని లాక్కెళ్లారు. మహిళల పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో మహిళా పోలీసులను రప్పించి అరెస్ట్ చేయించారు. అరుపులు, కేకలు, పోలీసు వాహనాల సైరన్ మోతలు, డ్రోన్ల కదలికలు, పోలీసుల కవాతుతో ప్రజలు హడిలిపోయారు. పార్టీ శ్రేణులను కట్టడి చేసే క్రమంలో స్థానిక ద్విచక్రవాహన దారులపైనా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు.
బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ ఎన్నిక పర్యవేక్షణ కోసం నేరుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగడం విస్తుగొలిపింది. ఈ నేపథ్యంలో విధ్వంసకాండతో తీవ్ర ఒత్తిడికి గురైన వైఎస్సార్‌సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డి.. మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రాంనారాయణరెడ్డి సమక్షంలో రాత్రికి రాత్రి కూటమిలో చేరిపోయారు. దీంతో తమ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ లడ్డూ భాస్కర్‌రెడ్డిని ప్రకటించింది.
ప్రజాస్వామ్యం ఖూనీకి కూటమి సై
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి అధికార టీడీపీ వెనకాడటం లేదు. టీడీపీ చేస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకొని దీటుగా సమాధానం ఇవ్వడానికి వైఎస్సార్సీపీ సమాయాత్తమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్/డిప్యూటీ చైర్మన్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది.
అయినా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి ఆ స్థానాలను దక్కించుకోవాలని అధికార టీడీపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ స్థానాలతో పాటు మరో 7 మున్సిపాలిటీల్లో 3 చైర్మన్లు, 5 వైస్ చైర్మన్ స్థానాలు ఖాళీ కావడంతో వాటిని భర్తీ చేస్తున్న విషయం విదితమే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆ స్థానాలను దక్కించుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగా విప్ జారీ చేయడంతో పాటు అవసరమైతే పోటీ క్యాంపులు నడపడానికీ సమాయాత్తమవుతోంది. టీడీపీ ప్రలోభాలకు లొంగి, గెలిచిన పార్టీని కాదని కూటమి పార్టీలకు ఓటేస్తే.. అనర్హత వేటు పడుతుందని వైఎస్సార్సీపీ చెబుతోంది. విప్ ధిక్కరించిన వారి మీద అనర్హత వేటు వేయించడానికి న్యాయ పోరాటం కూడా చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment