Tirupati Municipal Corporation
-
చెత్తే బంగారమాయనె!
చెత్తే కదా అని నిర్లక్ష్యం చేయలేదు.. ఆ చెత్త నుంచే ఆదాయం గడించడంపై దృష్టిసారించారు. రోజూ వెలువడే వ్యర్థాల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. కిలో పొడి చెత్త రూ.2 చొప్పున విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ గత ఏడాది డిసెంబర్ నుంచి డ్రై వేస్ట్ ప్లాంట్‌ను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దశాబ్దాల నుంచి గత యంత్రాంగం చెత్తను నిర్లక్ష్యం చేసింది. తాజా నిర్ణయంతో పొడిచెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరం జనాభా సుమారు 4 లక్షలకు పైమాటే. రోజూ 60 నుంచి 80 వేల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రముఖ యాత్రాస్థలం కావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు వెలిశాయి. ఈ క్రమంలో తిరుపతి నగరంలో ప్రతిరోజూ 197 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 123 టన్నుల తడిచెత్త(కూరగాయల వ్యర్థాలు, హోటల్ వేస్ట్‌తో కలపి) కాగా పొడి చెత్త 50 టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు ప్రతిరోజు 25 టన్నుల వరకు ఉంటున్నాయి. ఈ చెత్త నిర్వహణకు రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్‌సిటీలో అనేక ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. తడిచెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇటీవల భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్లో పొడిచెత్త నిర్వహణ ప్లాంట్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించగా.. అనతికాలంలోనే ఈ ప్లాంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. చెత్తనిర్వహణలో అగ్రస్థానం కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కల్పించేందుకు 2016లో స్వచ్ఛభారత్ మిషన్‌ను ప్రారంభించింది. 2017 నుంచి నగరాల మధ్య స్వచ్ఛపోటీలను నిర్వహిస్తూ వివిధ అంశాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సాహకం అందిస్తోంది. స్వచ్ఛతలో టాప్–3లో మెరవగా చెత్తనిర్వహణలో తిరుపతి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గడిచిన మూడేళ్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తిరుపతి తన పరపతిని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలతో తిరుపతికి జాతీయ స్థాయిలో కీర్తికిరీటాన్ని తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యం తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. పురపాలక సంఘంగా ఏర్పాటై 136 ఏళ్లు పూర్తిచేసుకుంది. గడిచిన దశాబ్దాల నుంచి తిరుపతిలో ఉత్పత్తి అయ్యే చెత్తను పూడ్చిపెట్టడం, కాల్చడం, ఆపై రామాపురం డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల మేరకు స్వచ్ఛభారత్ మిషన్ చెత్తను పూడ్చిపెట్టడం, తగలపెట్టడాన్ని నిషేధించింది.ఈ క్రమంలో చెత్త నిర్వహణపై అడుగులు పడ్డాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్తగా ఆలోచించి చెత్త నుంచి సంపదను సృష్టించడంపై దృష్టిసారించింది. కిలో 2 రూపాయలు తిరుపతి నగరంలో ఉత్పత్తి అయిన చెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి 50 టన్నుల మేర పొడి చెత్త వేరుచేస్తున్నారు. ఈ చెత్తను డ్రైవేస్ట్ ప్లాంట్‌కు తరలించి సెగ్రిగేషన్ చేస్తున్నారు. ఈచెత్తను కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు రాగా బెంగళూరుకు చెందిన ఎంఎం ట్రేడర్స్ కిలో చెత్తను రూ.2కు కొనేందుకు ముందుకొచ్చింది. రోజూ 50 టన్నుల చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ ఆ సంస్థకు విక్రయించి తద్వారా రోజుకు లక్ష రూపాయలు, నెలకు రూ.30 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. ఏడాదికి రూ.3.6 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ప్లాంట్ నిర్వహణకు ఖర్చుచేసిన రూ. 8 కోట్లను కేవలం రెండు సంవత్సరాల, రెండు నెలల్లోనే ఆర్జించనుంది. ఆపై పూర్తిగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. తొలిసారిగా ఆదాయం గడిచిన మూడు నెలలుగా పొడి చెత్త నుంచి రోజూ లక్ష ఆదాయం అందుతోంది. చెత్తను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని చెత్తనిర్వహణ ఒక్క తిరుపతిలోనే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. చెత్తను అనేక రకాలుగా రెడ్యూజ్, రీ యూజ్, రీసైకిల్ చేస్తూ తద్వారా రోజూ లక్షల్లో ఆదాయం సమకూరుస్తున్నాం. – పీఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ వందశాతం నిర్వహణ టిప్పర్ల ద్వారా తరలించే ఈ చెత్తను కాటా వేసి విక్రయిస్తాం. కొనుగోలు చేసిన ట్రేడర్స్ అందులో నుంచి ప్లాస్టిక్, ఐరన్, గాజు,వుడ్,టైర్, స్టోన్ వంటి వాటిని వేరుచేసి బయట ప్రాంతాల్లో విక్రయిస్తోంది. కార్పొరేషన్‌కు ప్రతి కిలో చెత్తకు 2రూపాయలు జమ చేస్తోంది. ప్లాంట్ నిర్వహణలో 100 మందికి ఉపాధి దొరికింది. – ఎ.విజయ్‌కుమార్‌రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ -
Tirupati Municipal Corporation: వ్యర్థం.. పరమార్థం
తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. ఇటీవల స్మార్ట్‌సిటీ పోటీల్లో వరుసగా 5 జాతీయ స్థాయి ర్యాంకులు సొంతం చేసుకుని తిరుపతి ప్రత్యేకతను చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తొలిసారిగా వాటర్ ప్లస్ (వ్యర్థపునీటి నిర్వహణ, పునర్వినియోగం) విభాగంలో నిర్వహించిన పోటీల్లో తిరుపతి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. దక్షిణాది నుంచి నాలుగు నగరాలు మైసూర్, విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు పోటీపడ్డాయి. ఈ పోటీల్లో తిరుపతి వాటర్ ప్లస్ డిక్లరేషన్ పొందిన ఏకైక నగరంగా నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వహించిన పోటీల్లో తిరుపతి ఈసారి తొలి ఈవెంట్లోనూ సత్తా చాటింది. వచ్చే ఏడాది నిర్వహించే ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం పోటీ పడనుంది. వ్యర్థపు నీటిశుద్ధి ఇలా.. తిరుపతిలో బాత్రూమ్స్, టాయిలెట్ల నుంచి రోజుకు 34.5 ఎంఎల్డి వ్యర్థపు నీరు (3కోట్ల 45 లక్షల లీటర్ల నీరు) వెలువడుతోంది. ఈ నీటిని పునర్వినియోగం దిశగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్ సిటీలో ఎస్టీపీ (సివర్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను నిర్వహిస్తోంది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను వివిధ కేటగిరీల వారీగా శుద్ధి చేస్తోంది. టాయిలెట్ల నీటిని ప్రత్యేక యాంత్రీకరణ పద్ధతిలో, బాత్ రూమ్‌ల నీటిని మూడు చెరువుల ద్వారా ఫిల్టర్ చేస్తూ శుద్ధి చేస్తోంది. ఇలా రోజుకు 22 ఎంఎల్డీ నీటిని పునర్వినియోగంలోకి తీసుకువస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వినియోగానికి పైపులైన్ల ద్వారా రోజుకు 5 ఎంఎల్డీ సరఫరా చేస్తున్నారు. తద్వారా నెలకు రూ.5లక్షల వరకు కార్పొరేషన్‌కు ఆదాయం లభిస్తోంది. అలానే తూకివాకం పంచాయతీ పరిసర ప్రాంతాల రైతులకు ఈ శుద్ధి నీటిని రోజుకు 12 ఎంఎల్‌డీని ఉచితంగా సరఫరా చేయడంతోపాటు నీటి శుద్ధి అనంతరం అడుగున నిలిచే సారవంతమైన బురదను సైతం పొలాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. పార్కుల నిర్వహణకు.. తిరుపతిలో పార్కుల నిర్వహణ, డివైడర్లలో మొక్కల పెంపకాలకు శుద్ధి చేసిన ఈ నీటిని వినియోగిస్తున్నారు. 4 పార్కులు, మొక్కల పెంపకం, డివైడర్లలో పచ్చదనం కోసం రోజూ 3 ఎంఎల్డీలకు పైగా నీటిని వినియోగిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు ఈ నీటి కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. లీటరు నీటికి రూ.4–5లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా వ్యర్థపు నీటి పునర్వినియోగంతో లాభపడుతూనే రైతులకు ఉచితంగా నీటిని ఇస్తోంది. ఈ ప్రక్రియ కోసం నెలకు రూ.5లక్షల వరకు ఖర్చు చేస్తోంది. ఎస్టీపీలో 26 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వాటర్ ప్లస్ పోటీలకు డాక్యుమెంటేషన్‌ను డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వరరెడ్డి సిద్ధం చేయగా, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ విజయకుమార్‌రెడ్డి ప్లాంట్ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. నగర ప్రజల విజయం ఈ ఏడాది తిరుపతికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు రావడం నగర ప్రజల విజయం. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రతి అంశంలోనూ తిరుపతి ముందడుగు వేస్తోంది. అధికారుల పనితీరు అవార్డులను తెచ్చిపెడుతోంది. అందరూ సమన్వయంతో ఇదే స్థాయిలో ముందుకెళ్లి తిరుపతి కీర్తిని మరింత ఇనుమడింప చేస్తాం. –భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే తిరుపతి మరింత విస్తరిస్తాం ఎస్టీపీ ప్లాంట్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎస్డీఆర్ టెక్నాలజీ ద్వారా రోజుకు 5ఎంఎల్డీ వాటర్‌ను మరింతగా శుద్ధి చేసి టాయిలెట్లు, ఇతర అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాం. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. వచ్చే ఏడాది ఫైవ్‌స్టార్ నగరంగా తిరుపతిని జాతీయ స్థాయిలో నిలుపుతాం. –పిఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ శుభ పరిణామం ప్రభుత్వ ప్రోత్సాహంతో తిరుపతి అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. దీర్ఘకాలిక ప్రాజెక్టులను చేపట్టిన అధికారుల కృషితో తిరుపతికి జాతీయ గుర్తింపు లభించింది. దక్షిణ భారతదేశంలోని వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన నగరంగా తిరుపతి నిలవడం శుభపరిణామం. తిరుపతిని అన్ని విధాల అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తాం. –డాక్టర్ ఆర్.శిరీష, మేయర్, తిరుపతి జాతీయ గుర్తింపు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తొలిసారి వాటర్ ప్లస్ విభాగానికి పోటీలు నిర్వహించారు. మొత్తం 16 నగరాలు పోటీపడగా ఇండోర్, సూరత్, నార్త్ ఢిల్లీ, తిరుపతి నగరాలు మాత్రమే ఇప్పటివరకు వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన నగరాలుగా నిలిచాయి. దక్షిణ భారత దేశం నుంచి ఈ సర్టిఫికేషన్ పొందిన ఏకైక నగరం తిరుపతి కావడం విశేషం. -
ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
సాక్షి, అమరావతి/తిరుపతి క్రైం: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న ఎస్ఎం రఫీ రూ.9 వేలు లంచం తీసుకుంటూ శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. తిరుపతిలోని శ్రీపురం కాలనీలో నివాసముంటున్న రవీంద్రనాథ్ రెడ్డి వద్ద టి.నరసింహ అనే వ్యక్తి ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ఇంటి పన్నులు నరసింహ పేరుతో రాకపోవడంతో గత నెల 23న 6 వార్డు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఫీని నరసింహ కలిశాడు. ఇంటి పన్ను కాగితాలపై పేరు మార్చేందుకు గాను రూ.10 వేలు లంచం ఇవ్వాలని రఫీ డిమాండ్ చేశాడు. చివరకు రూ.9 వేలకు బేరం కుదిరింది. అనంతరం నరసింహ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం తిరుపతిలోని ఓ బట్టల దుకాణం వద్దకు డబ్బులు తీసుకొని రమ్మని నరసింహకు రఫీ చెప్పాడు. అక్కడ నరసింహ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రఫీని అరెస్ట్ చేశారు. నిందితుడిని నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. -
పారిశుద్ధ్య కార్మికులతో భూమన సహపంక్తి భోజనం
తిరుపతి తుడా : తిరుపతి స్వచ్ఛతకు నిత్యం పాటుపడుతూ కరోనా నియంత్రణలో విశేషంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆదివారం సహపంక్తి భోజనం చేశారు. ఫుట్‌పాత్‌పై కార్మికులతో పాటు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటానికి పారిశుద్ధ్య కార్మికులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కానీ మన సమాజంలో వారికి గౌరవం దక్కడం లేదన్నారు. వారి ప్రాణాలను, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా కరోనావైరస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని కొనియాడారు. వారితో కలిసి భోజనం చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందని చెప్పారు. తిరుపతిలోని 11 వార్డుల్లో రెడ్‌జోన్ ప్రకటించడం జరిగిందన్నారు. కార్మికులు అక్కడికి వెళ్లి కూడా రోడ్లపై బ్లీబింగ్ చల్లుతూ.. పరిసరాలను శుభ్రం చేస్తున్నారని తెలిపారు. వారి సేవలను తప్పకుండా అభినందించాల్సిందేనని అన్నారు. మార్కెట్ల విస్తరణకు స్థలపరిశీలన చేయండి తిరుపతిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా కూరగాయల మార్కెట్ల విస్తరణకు స్థల పరిశీలన చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కరంబాడిరోడ్డు బొంతాలమ్మ గుడి వద్ద తాత్కాలిక మార్కెట్‌ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. పట్టణంలో 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మార్కెట్లు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. -
ప్రతి పనికీ ఓ రేటు.. అంతా ఆయన ఇష్టం !
సాక్షి, తిరుపతి తుడా : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఓ అధికారి అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. ఆయన ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారి.. ఆయన చెప్పిన మాయ మాటలకే ఇన్నాళ్లు ప్రాధాన్యం లభించింది.. పూర్వ కమిషనర్ ఆ అధికారి మంచి పనోడని నమ్మి ఒకటికి రెండు ప్రధాన పోస్టుల్లో కుర్చోబెట్టారు.. ఆయన ప్రతి పనికి రేటు ఖరారు చేసి మంచిగా వెనకేసుకున్నారు.. అన్ని శాఖలను గుప్పెట్లో పెట్టుకున్నారు.. అక్కడున్న వారంతా బాబూ.. చిట్టీ ఇది నీకు తగునా అంటున్నా ఆయన ఏ మాత్రం లెక్కచేయకుండా గడచిన ఐదేళ్లుగా కార్పొరేషన్లో హల్చల్ చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా ఉన్న ఓ అధికారి పూర్వ కమిషనర్‌తో కొంత సన్నిహితంగా ఉన్నారు. ఇదే ఆయనకు వరంగా మారింది. అప్పటి ఎమ్మెల్యే అల్లుడుతో సన్నిహిత సంబంధాలు నెరిపిన ఆయన ఇప్పటికీ కార్పొరేషన్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేసిన అనుభవంతో ఆయన తిరుపతి టీడీపీ నేతలకు మరింత దగ్గరయ్యారు. వారిని మెప్పించేందుకు అడ్డంగా పనిచేశారు. తోటి అధికారులనే కాకుండా కింది స్థాయిలో కొంత మంది ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ముద్రవేసి అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ నేతల అండదండలు... ఉన్నతాధికారితో సాన్నిహిత్యం ఉండటంతో పాలన మొత్తం గుప్పెట్టో పెట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తెతిప్పించుకునే కుట్ర చేశారు. స్టేషనరీ విభాగం పని మొదలు గెజిటెడ్ హోదా కలిగిన అధికారుల నుంచి వచ్చే ఫైళ్లను తన వద్దకు తెప్పించుకునేవారు. స్టేషనరీ బిల్లులను జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారి చూసుకోవాలి. కానీ స్టేషనరీ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులన్నీ ఆ అధికారే చూస్తారు. ఇందులో ఏం మతలబు ఉందో మరి. టౌన్ ప్లానింగ్‌లో బీపీఎస్ ఫైళ్లను తన వద్దకు తెప్పించుకునేందుకు ఆయన విశ్వప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఈ శాఖలో ఆ స్థాయి అధికారి ఉంటారు. ఆయనతో పాటు ఇద్దరు డీపీఎస్లు, గెజిటెడ్ హోదా కలిగిన ఇద్దరు అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీసర్లు ఉంటారు. వీరు చూసిన ఫైళ్లను ఆపై అధికారులు పర్యవేక్షించాలి. కార్పొరేషన్ చరిత్రలో టౌన్ ప్లానింగ్ ఫైళ్లను ఓ మేనేజర్ చూసిన దాఖలాలు లేవు. అయితే సూపరింటెండెంట్ స్థాయి అధికారి మాత్రం పరిపాలన, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ ఇలా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తెప్పించుకున్నారు. ఈ అధికారి తీరుపై సహచర అధికారులు, కింది స్థాయి అధికారులు మండిపడుతున్నారు. అనర్హులకు అందలం పూర్వ కమిషనర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రక్షాళనకు నడుం బిగించారు. ఈ బదిలీల్లో కూడా ఆ అధికారి చక్రం తిప్పారు. అర్హత ఉన్నా వారికి తీరని అన్యాయం చేశారు. ఎలాంటి అర్హతలు లేకున్నా అందలమెక్కించారు. హెల్త్ విభాగంలో 17 మందికి అర్హత లేకున్నా శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పట్టం కట్టారు. డిగ్రీ,పీజీ, ఇంటర్ విద్యార్హతలు ఉన్నవారిని స్వచ్ఛమిత్రలుగా నియమించారు. అంతకన్నా తక్కువగా ఉన్న కొందరిని కార్యాలయం నుంచి బయటకు పంపకుండా చక్రం తిప్పారు. విలీన పంచాయతీల నుంచి వచ్చిన సిబ్బందిని స్థాయి, చేస్తున్న పనితో సంబంధం లేకుండా స్వచ్ఛమిత్రలుగా పంపించారు. అర్హత లేని వారిని వర్క్ ఇన్స్పెక్టర్లుగా అందలమెక్కించారు. ఇలా అన్ని శాఖల్లో ఆయన మాటే శాసనంగా మారింది. బదిలీలు నిజాయితీగా జరిగినా ఒకరిద్దరిని దగ్గర పెట్టుకోవడంతో కొన్ని పొరబాట్లు జరిగాయని ఆ తరువాత కమిషనర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరికి స్థాయికి మించి ప్రాధాన్యం అభించిందని గుర్తించిన ఆయన మరోసారి బదిలీలు చేపట్టాలని భావించారు. స్వచ్ఛ సర్వేక్షన్, సార్వత్రిక ఎన్నికలు రావడంతో బదిలీలకు వీలు కుదరలేదు. కారుణ్య నియామకాలకూ బేరాలు కారుణ్య నియామకాల భర్తీలో అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఉద్యోగుల పిల్లలకు అర్హత మేరకు పోస్టులు సకాలంలో ఇవ్వాలి. కారుణ్య నియామకాల ద్వారా ఐదుగురికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఆ అధికారి కరుణించకపోవడంతో నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఒక్కో ఉద్యోగానికి రెండు లక్షలు రూపాయల వరకు ఇస్తే గానీ ఫైలు ముందుకు కదలదని బేరసారాలు పెట్టారు. ఇచ్చే మామూళ్లను బట్టి పోస్టు ఉంటుంది. అడిగినంత ఇస్తే జూనియర్ అసిస్టెంట్ ఆపై పోస్టుల్లో తీసుకుంటాం. తక్కువ ఇచ్చుకుంటే బిల్ కలెక్టర్, అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తాం, ఎక్కువ మాట్లాడితే పోస్టులే ఖాళీ లేదని రాసేస్తామని బెదిరించి పంపుతున్నారు. అడిగింది ఇచ్చుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు ఫైళ్లు చేతబట్టుకుని కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. -
వదల బొమ్మాళీ!
తిరుపతి తుడా: తిరుపతి నగరపాలక సంస్థలో ఏళ్లతరబడి తిష్టవేసి.. అడ్డదిడ్డంగా దోచేస్తున్న అవినీతి తిమింగలాల్లో ఆందోళన మొదలయ్యింది. స్థానికంగా పనిచేసే డీఈఈ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి అడ్డంగా దొరికొపోయారు. ఆ కోవకు చెందిన కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏక్షణాన తమపై దాడిచేస్తారో.. ఎంత నగదు స్వాధీనం చేసుకుంటారోనని వణికిపోతున్నారు. అవినీతికి అడ్డా! తిరుపతి కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు వసూల్ రాజాలుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరి అండదండలతో ఉన్నతాధికారులనే మస్కా కొట్టిస్తూ తమదైన శైలిలో అవినీతికి పాల్పడుతున్నారు. ఓ ద్వితీయ శ్రేణి అధికారి అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు. ఏ పనిచేయాలన్నా మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ఇటీవల మున్సిపల్ పాఠశాలలకు డీఎస్సీ ద్వారా 36 మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది. వీరికి ఉద్యోగ నియామక పత్రాలు జారీకి నెలన్నర రోజులు పట్టింది. కేవలం వారు లంచం ఇవ్వలేదన్న సాకుతోనే వేధింపులకు గురిచేశారు. వారి జీతాల చెల్లింపులకు సంబంధించిన ఫైలు కదలికలోనూ చేతి వాటం ప్రదర్శించారు. ఇలా అన్ని విభాగాల్లో ముడుపులు ముట్టందే ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి. పాతుకుపోయారు! తిరుపతి కార్పొరేషన్లో కొంతమంది అధికారులు, ఉద్యోగులు చక్రం తిప్పుతూ తమకు కావాల్సిన విభాగాల్లోనే ఏళ్లతరబడి పాతుకుపోయారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండతో వారు ఆడిందే ఆటగా ముందుకుసాగుతున్నారు. ప్రమోషన్లు వచ్చినా వెళ్లడంలేదు. అధిక ఆదాయం వచ్చే కింది స్థాయి పోస్టులను వదలడంలేదు. కొందరు ఉద్యోగులు కింది స్థాయి పోస్టుతో పాటు పైస్థాయి పదవిని అనుభవిస్తున్నారు. ఇది వింతగా ఉన్నా నగ్నసత్యం. పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సూపరింటెండెంట్‌గా ఉంటూనే క్లర్క్–1గా కొనసాగుతున్నారు. కిందిస్థాయి సి బ్బందికి ఆ పోస్టును ఇవ్వకుండా అంటిపెట్టుకోవడం గమనార్హం. రెవె న్యూ విభాగంలోనూ ఇద్దరు వ్యక్తులు ఆర్ఐలుగా పదోన్నతులు పొందినా బిల్ కలెక్టర్ పోస్టులను వదులడంలేదు. ఇదే విభాగంలో ఓ మహిళా ఉద్యోగిని సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది జూనియర్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ జాబితాలో ఉన్నా వారికి పదవులు ఇవ్వడం లేదు. ప్రమోషన్ వస్తే రాబడి తగ్గుతుందనే భయంతో ౖపైరవీలు చేస్తూ రెండు పదవులు అనుభవిస్తున్నారు. పరిపాలన, రెవెన్యూ, హెల్త్, టౌన్ ప్లానింగ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఇదే తంతు. మాట వినకపోతే అంతే! మాట వినని, ముడుపులు ఇవ్వని వారికి ప్రాధాన్యతలేని పోస్టుల్లోకి పంపుతున్నారు. అవసరం లేకపోయినా అవసరానికి మించి మెప్మాలో ఉద్యోగులు ఉండడానికి ఇదే కారణం. ఇక్కడ అవసరానికి మించి ఉద్యోగులు కొనసాగుతున్నారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్, పరిపాలన, హెల్త్ విభాగాల్లో అవినీతి అధికమవుతోంది. రెవెన్యూలో ఇంటి పన్నులపై కనికట్టు చేస్తున్నారు. ఖరీదైన ఇళ్లకు కూడా సాధారణ ఇంటి పన్నులు వేసే ప్రబుద్ధులు ఈ విభాగంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. టౌన్ ప్లానింగ్ విభాగం సెటిల్మెంట్ల విభాగంగా మారింది. -
జూన్‌లో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు
ఆస్తి పన్ను చెల్లించకపోతే ఏ ఒక్కరినీ వదలం మున్సిపల్ శాఖమంత్రి నారాయణ వెల్లడి తిరుపతి కార్పొరేషన్: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి న మంత్రి కమిషనర్ వినయ్‌చంద్ ఆధ్వర్యంలో వివిధవిభాగాల అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఏర్పాటుకు అనుసరించాల్సిన పద్ధతులు, స్వచ్ఛ తిరుపతి, కార్పొరేషన్లో అమలుచేస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జపాన్ తరహాలో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పారు. పుంగనూరులో ఆస్తి పన్ను చెల్లింపులో అపశ్రుతి చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. మున్సిపాల్టిల్లో ఏమేరకు సేవలు అందిస్తున్నామో అదే స్థాయిలో పన్నులు కూడా వసూలు చేస్తామన్నారు. పన్నులు చెల్లించకపోతే ఏ ఒక్కరినీ వదిలేది లేదన్నారు. అవసరమైతే బకాయిదారుల వివరాలను వెబ్సైట్లలో పెడతామన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉందని, ఈనేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకుంటామన్నారు .మంత్రితో పాటు తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, కమిషనర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు. రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధం రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములను అందించిన రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 7వేల చదరపు అడుగుల స్థలం అవసరమైందన్నారు. జూన్ చివరకుడిజైన్ పూర్తిచేస్తామన్నారు. ఢిల్లీ కన్నా మంచి రాజధాని కట్టాలన్నది లక్ష్యం అన్నారు. రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారిని పిలిపించి సర్వే చేసిన ఆధారంగా పరిహారం ఇస్తామన్నారు. ఇప్పటికే 5వేల ఎకరాలకు సంబంధించి డీడీలను సిద్ధం చేశామని స్పష్టంచేశారు. -
తిరుపతిలో రచ్చబండ రచ్చరచ్చ
సాక్షి, తిరుపతి : తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అధికారులు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. కార్యక్రమం ప్రారంభం కాగానే కార్పొరేషన్ కమిషనర్ గత రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలిపి, ఎంపీ చింతామోహన్ మాట్లాడతారని ప్రకటించారు. ముందుగా తమ సమస్యలు విని, తరువాత ఎంపీ మాట్లాడాలని వైఎస్ఆర్ సీపీ నాయకులు కోరారు. దీనికి ఆయన అంగీకరించకుండా మాట్లాడే ప్రయత్నం చేయడంతో ‘చింతా మోహన్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నగర నాయకురాలు శ్రీదేవి, వేదికపై ఉన్న టేబుల్పెకైక్కి ఎంపీని ప్రశ్నిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకునే యత్నం చేశారు. ఈ నేపథ్యంలో చింతా మోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ‘సమైక్య ఉద్యమంలో కనిపించని చింతా’ అంటూ నినాదాలు చేస్తూ, గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై వాటర్ బాటిల్ విసిరాడు. ఈలోపు అధికారులు కూడా నిష్ర్కమించడంతో రచ్చబండ నిలిచిపోయింది. ఎమ్మెల్యే అరెస్టు : మరోవైపు అధికారులు రచ్చబండను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు రాకపోవడంతో అక్కడినుంచి వెళ్లి ఎదురుగా రోడ్డుపై పడుకుని గంటపాటు ఆందోళన చేశారు. పోలీసులు ఎమ్మెల్యేని, కార్యకర్తలను అరెస్టు చేశారు. సొంత పూచీకత్తుపై భూమనను విడుదల చేయగా, కార్యకర్తలపై కేసు నమోదుచేశారు.