తిరుపతిలో రచ్చబండ రచ్చరచ్చ
సాక్షి, తిరుపతి : తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అధికారులు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. కార్యక్రమం ప్రారంభం కాగానే కార్పొరేషన్ కమిషనర్ గత రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలిపి, ఎంపీ చింతామోహన్ మాట్లాడతారని ప్రకటించారు. ముందుగా తమ సమస్యలు విని, తరువాత ఎంపీ మాట్లాడాలని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కోరారు. దీనికి ఆయన అంగీకరించకుండా మాట్లాడే ప్రయత్నం చేయడంతో ‘చింతా మోహన్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నగర నాయకురాలు శ్రీదేవి, వేదికపై ఉన్న టేబుల్‌పెకైక్కి ఎంపీని ప్రశ్నిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు. వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకునే యత్నం చేశారు. ఈ నేపథ్యంలో చింతా మోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ‘సమైక్య ఉద్యమంలో కనిపించని చింతా’ అంటూ నినాదాలు చేస్తూ, గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై వాటర్ బాటిల్ విసిరాడు. ఈలోపు అధికారులు కూడా నిష్ర్కమించడంతో రచ్చబండ నిలిచిపోయింది.
ఎమ్మెల్యే అరెస్టు : మరోవైపు అధికారులు రచ్చబండను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు రాకపోవడంతో అక్కడినుంచి వెళ్లి ఎదురుగా రోడ్డుపై పడుకుని గంటపాటు ఆందోళన చేశారు. పోలీసులు ఎమ్మెల్యేని, కార్యకర్తలను అరెస్టు చేశారు. సొంత పూచీకత్తుపై భూమనను విడుదల చేయగా, కార్యకర్తలపై కేసు నమోదుచేశారు.