
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అనేది అబద్ధమని.. పంది కొవ్వు, చేప నూనె కలిసిందనేది.. జరగని పని అంటూ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూపై చంద్రబాబు చూపించిన రిపోర్టులు తప్పు.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు పరమ పవిత్రుడు కాదన్నారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ మాటలు తీవ్ర అభ్యంతరకరమన్నారు.
చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదు.. అమరావతిలో వేల కోట్లు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. కృష్ణా నదిలో రాజధానిని కట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా.. పోలవరంపై ఎవరు ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలి. పోలవరం రాజకీయ నాయకులకు వరంగా మారింది.. పోలవరం పెద్ద మోసం అంటూ చింతామోహన్ వ్యాఖ్యానించారు.