జూన్‌లో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు
ఆస్తి పన్ను చెల్లించకపోతే ఏ ఒక్కరినీ వదలం
మున్సిపల్ శాఖమంత్రి నారాయణ వెల్లడి
తిరుపతి కార్పొరేషన్: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి న మంత్రి కమిషనర్ వినయ్‌చంద్ ఆధ్వర్యంలో వివిధవిభాగాల అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఏర్పాటుకు అనుసరించాల్సిన పద్ధతులు, స్వచ్ఛ తిరుపతి, కార్పొరేషన్‌లో అమలుచేస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జపాన్ తరహాలో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లను ఏర్పాటుచేస్తున్నామన్నారు.
ఇందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పారు. పుంగనూరులో ఆస్తి పన్ను చెల్లింపులో అపశ్రుతి చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. మున్సిపాల్టిల్లో ఏమేరకు సేవలు అందిస్తున్నామో అదే స్థాయిలో పన్నులు కూడా వసూలు చేస్తామన్నారు. పన్నులు చెల్లించకపోతే ఏ ఒక్కరినీ వదిలేది లేదన్నారు. అవసరమైతే బకాయిదారుల వివరాలను వెబ్‌సైట్‌లలో పెడతామన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉందని, ఈనేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకుంటామన్నారు .మంత్రితో పాటు తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, కమిషనర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు.
రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధం
రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములను అందించిన రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 7వేల చదరపు అడుగుల స్థలం అవసరమైందన్నారు. జూన్ చివరకుడిజైన్ పూర్తిచేస్తామన్నారు. ఢిల్లీ కన్నా మంచి రాజధాని కట్టాలన్నది లక్ష్యం అన్నారు. రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారిని పిలిపించి సర్వే చేసిన ఆధారంగా పరిహారం ఇస్తామన్నారు. ఇప్పటికే 5వేల ఎకరాలకు సంబంధించి డీడీలను సిద్ధం చేశామని స్పష్టంచేశారు.