
సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది.
అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్‌లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు.
తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment