విజయవాడ, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించిఉంటే తెలంగాణ ఉద్యమం ఊసే ఉండేది కాదని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిప్రత్యేకవాదాన్ని అణచివేసేవారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయన ప్రసంగించారు. వైఎస్ నూటికి నూరుపాళ్లు సమైక్యవాదని, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వలేదని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల ను అభివృద్ధి చేయడం ద్వారా విభజనవాదాన్ని తిప్పికొట్టాలని ఆయన భావించారని, ఆ ఉద్దేశంతోనే 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నారని భాను గుర్తుచేశారు. మహానేత మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోశయ్య టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిరాహారదీక్షను నిలువరించలేకపోవడం వల్లే తెలంగాణవాదం తెరపైకి వచ్చిందని ఉదయభాను చెప్పారు. రాజకీయ మనుగడ కోసం కొందరు నాయకులు చేపట్టిందే తెలంగాణ ఉద్యమమని, ప్రస్తుతం సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొచ్చిందని తెలిపారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ఒకే వైఖరి అవలంభిస్తోందని, రెండు ప్రాంతాలకు మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో పేర్కొందని భాను వివరించారు. అరుునా కేంద్రం రాష్ట్ర విభజనకు ఒడికట్టిందని, దీన్ని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలకంటే ముందుగా తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని గుర్తుచేశారు. ప్రజాప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీ లేకపోయినా ఫర్వాలేదని నిర్ణయం తీసుకుందన్నారు. వైఎస్ విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించి సమైక్య ఉద్యమానికి మద్దతు తెలియజేశారని చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు విజయమ్మ ప్రాణాలకు సైతం తెగించి సమర దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. మిగతా పార్టీలన్నీ ఇదే నిర్ణయం తీసుకుంటే విభజన ప్రకటన వెలువడేది కాదన్నారు. ఇప్పటికీ చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని, అసలా పార్టీ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నాయకుడు ఒకలా వ్యవహరిస్తుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందుకు భిన్నంగా నిరహారదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు కంటికి కనిపించడం లేదన్నారు. కావూరి సాంబశివరావు మంత్రి పదవి ఇవ్వగానే సోనియాగాంధీ భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి ఆ పౌరుషాన్ని చూపడం లేదన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులతోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుందని చెప్పారు.
విభజిస్తే అంధకారమే..
రాష్ట్రాన్ని విభజిస్తే సాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జలవివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జలవివాదం 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని గుర్తుచేశారు. విభజన జరిగితే కృష్ణా, గోదావరి నదులు కావేరీ నదిలా మారతాయన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ నీటిపై తెలంగాణవాదులు పెత్తనం చేస్తారన్నారు. పశ్చిమ కృష్ణా ప్రాంతానికి జలాధారమైన మునేరు, పాలేరు, కట్టలేరు తెలంగాణ ప్రాంతం నుంచి రావాలని, విభజన జరిగితే ఆ నీరు వచ్చే అవకాశం ఉండదన్నారు. తన కళ్లెదురుగానే ఆలమట్టి డ్యాం నిర్మాణం జరిగితే చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని గుర్తుచేశారు. థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గు దిగుమతి చేసుకునే స్థోమత లేక కోస్తా ప్రాంతం అంధకారంలోకి వెళుతుందన్నారు. విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో వచ్చిన ప్రజా ఉద్యమాన్ని చూసైనా పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని ఉదయభాను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు అంబటి ఆంజనేయులు, యూనియన్ అర్బన్ అధ్యక్షుడు ముత్యాల ప్రసాద్, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్ లేనందువల్లే తెలంగాణ ఉద్యమం
Published Fri, Aug 23 2013 5:38 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement