పెనుకొండలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి శంకరనారాయణ
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: మహానేత, రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో, దేశ, విదేశాల్లో సోమవారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జయంతిని ‘వైఎస్సార్ రైతు దినోత్సవం’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరులో సోమవారం జరిగిన రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు, పేదలు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, తదితర వర్గాలకు లబ్ధి చేకూర్చే నవరత్నాలకు కడప గడప నుంచే శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రంలో ఊరూవాడా అనే తేడా లేకుండా ప్రజలు వైఎస్సార్‌ను స్మరించుకుంటూ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహించాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, జిల్లా ముఖ్య నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.
సంక్షేమ పథకాల సృష్టికర్త.. వైఎస్సార్
సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్సార్ అని మంత్రి శంకర్ నారాయణ కొనియాడారు. రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, మడకశిర, కల్యాణదుర్గం, తాడిపత్రి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకటరామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఉషశ్రీ చరణ్, పెద్దారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, హిందూపురంలో పార్టీ నేత, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అనంతపురం జిల్లా చిలమత్తూరులో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.హరీష్ కుమార్ యాదవ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆలూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, చంద్రగిరి, మదనపల్లె, నగరి, పలమనేరు, పీలేరు, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. ఆదర్శ రైతులను సన్మానించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతులకు రుణాలు, విత్తనాలు, అర్హులకు పింఛన్లు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
సిడ్నీ, దుబాయ్‌ల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వైఎస్సార్‌సీపీ సిడ్నీ విభాగం ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు వైఎస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిచారు. తొలుత రెడ్‌క్రాస్ సంస్థలో పలువురు రక్తదానం చేసి తర్వాత కేక్ కట్ చేశారు. పార్టీ సిడ్నీ విభాగం గౌరవాధ్యక్షుడు రంగారెడ్డి, సభ్యులు గోవిందరెడ్డి, దామోదర్, భారతి, మను, సుజాత, అరవింద, లత, స్రవంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దుబాయ్‌లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్‌ఆర్‌ఐ యూఏఈ వింగ్ టీమ్‌లీడర్ సోమిరెడ్డి, మహితరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, కార్తీక్, సుదర్శన్‌రెడ్డి, దిలీప్, కర్ణ, నరసింహ, నాగేంద్ర, ప్రతాప్, వెంకటరామిరెడ్డి, ఆచిరెడ్డి, శివానంద్, జగదీశ్, విజయ్‌రెడ్డి, విజయ, సునంద తదితరులు పాల్గొన్నారు.
రైతు చాంపియన్ వైఎస్ రాజశేఖరరెడ్డి
వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శిశాజీ కొనియాడారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైఎస్సార్ జయంతి, రైతు దినోత్సవం సందర్భంగా రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ రైతులకు సోమవారం వైఎస్సార్ రైతు నేస్తం పురస్కారాలను అందించారు. ఈ సభకు పత్రిక సంపాదకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించారని గుర్తు చేశారు. వైఎస్సార్ నిజమైన రైతు చాంపియన్ అని అభివర్ణించారు.
రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఉత్తమ రైతులు ఎం.శ్రీదేవి, టి.శివరామిరెడ్డి, పి.భరత్, బి.శశిధర్, టి.మురళీరెడ్డి, ఎల్.అచ్చింనాయుడు, కె.క్రాంతికుమార్‌రెడ్డి, ఎం.రాంబాబు, కె.సంధ్య, పి.చిట్టిబాబు, టి.సాయినాథ్‌రెడ్డి, ఎ.బాలయ్య, ఆర్.జ్యోతి, డి.హన్మంతరాజు, కైలాష్‌సాహుకు వైఎస్సార్ రైతునేస్తం పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి, ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మల్లంపాటి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి వేడుకలను గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు రుణాలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, విత్తనాలు, అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు.
మాట తప్పని మహనీయుడు ఏపీ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్
మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఏపీ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కె.వెంకటేశులు, రాష్ట్ర అధ్యక్షుడు సారికి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తెలుగు తల్లి విగ్రహం సమీపంలో ఆంధ్రప్రదేశ్ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా తన పాలనను దేశానికే ఆదర్శంగా నిలిపారని, తండ్రి ఆదర్శాలను తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అధిగమించగలరని చెప్పారు. గోపాలమిత్ర సమస్యలను సీఎం జగన్ తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment