ప్రజలతో మా అనుబంధం పెరిగింది: విజయమ్మ
శ్రీకాకుళం: ప్రజలతో తమ అనుబంధం పెరిగిందని ని వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఉద్ఘాటించారు. ప్రజలకు తోడునీడగా తమ కుటుంబం ఉంటుందన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఇచ్చాపురం ముగింపు సభకు హాజరైన విజయమ్మ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల చల్లని దీవెనలను షర్మిల కోరుతోందని ఆమె తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి , జగన్మోహనరెడ్డిల పాదయాత్రను ప్రజలు ఆదరించారని, ఇప్పుడు షర్మిల మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను కూడా ప్రజలు అక్కున చేర్చుకున్నారని విజయమ్మ తెలిపారు.
షర్మిల పాదయాత్రతో తమ అనుబంధం పెరిగిందన్నారు. రికార్డుల కోసం చేసిన యాత్ర కాదని.. మంచి రోజులు వస్తాయని ప్రజలకు భరోసా కల్పించే యాత్ర,కాంగ్రెస్-టీడీపీ పార్టీలు కుతంత్రాలను ఎండగట్టడానికి చేసిన యాత్ర, జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్న కుట్రలపై నిరసనగా చేసిన యాత్రని విజయమ్మ తెలిపారు.
ఓ దశలో ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైయ్యారు. ‘బిడ్డను వైఎస్‌ఆర్ అపురూపంగా పెంచకున్నారని, అన్నకు ఇచ్చిన మాటకు నిలబడి కష్టాలను ఓర్చుకుంటూ యాత్రను పూర్తి చేసిందన్నారు. గత రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఘట్టాలను ఆమె గుర్తు చేసుకున్నారు. షర్మిలను పులి బిడ్డ అంటుంటే కష్టాలను మర్చిపోయానన్నారు.
వైఎస్ అనే ఒక పదం ఈ రాష్ట్రాన్ని మలుపు తిప్పిందని, వైఎస్ అనే పదం రాజకీయాలకు కొత్త అర్ధం చెప్పిందని, వైఎస్ అనే పదం రైతులు గర్వంగా తలెత్తుకునేలా చేసిందని, వైఎస్ అనే పదం బీసీ, ఎస్సీ, మైనార్టీలను రుణ విముక్తులను చేసిందని విజయమ్మ తెలిపారు. జగన్‌ను ప్రజలు దగ్గరగా రాకుండా ఏ జైలు గోడలు అడ్డుకోలేవని ఆమె ఆన్నారు. ఈ ప్రజాభిమానం చూస్తుంటే ప్రభుత్వానికి, ప్రతి పక్షానికి కాలం దగ్గర పడినట్లేనన్నారు.