
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే మరో కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ను గుంటూరు జనరల్ ఆస్పత్రిలో సోమవారం సీఎం ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలను ఈ పథకంలో అందచేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు.
సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగే కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు అందుకుంటారు. డిసెంబర్ 1 నుంచే పథకం అమల్లోకి వచ్చినా సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించేలా ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే మార్గదర్శకాలు జారీచేసింది. రోగి డిశ్చార్జి సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమచేస్తారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రోగి ఆర్థికంగా ఇబ్బందిపడకూడదనే..
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకానికి ఏటా రూ.270 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ పథకంలో ప్రభుత్వం సాయం అందిస్తుంది.
–డాక్టర్ మల్లిఖార్జున, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ
వైఎస్సార్ ఆసరా వివరాలు
మొత్తం స్పెషాలిటీ విభాగాలు 26
ఎన్నిరకాల శస్త్ర చికిత్సలు 836
రోజుకు ఇచ్చే మొత్తం రూ.225
నెల రోజుల విశ్రాంతికి రూ.5000
లబ్ధిదారుల సంఖ్య 4.50 లక్షలు
ఏటా వ్యయం దాదాపు రూ.300 కోట్లు