వైఎస్‌ఆర్ సీపీ ప్రచార షెడ్యూల్ విడుదల | YSR Congress launched campaign schedule | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ ప్రచార షెడ్యూల్ విడుదల

Published Sun, Jun 21 2015 1:56 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

YSR Congress launched campaign schedule

 ఒంగోలు : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. పార్టీ అభ్యర్థి అట్లా చినవెంకటరెడ్డిని గెలిపించేందుకు ముమ్మరంగా ప్రచారం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి శనివారం స్థానికంగా బాలినేని నివాసంలో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు కలిగిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులను కలుసుకుని ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు తయారు చేసిన ప్రచార షెడ్యూల్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి విడుదల చేశారు. ఇప్పటికే కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి కావడంతో మిగిలిన పది నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార షెడ్యూలు విడుదల చేశారు. పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా ప్రచారానికి హాజరుకావాలని అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
 
 ఓటుకు నోటుతో ప్రజాస్వామ్యం ఖూనీ : ఎంపీ వైవీ
 ఓటుకు నోటుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీడీపీపై ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటుకి నోటు అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని, ఓటర్లు నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. బాలినేని నివాసంలో జరిగిన సమావేశంలో బాలినేని, వైవీ, ముత్తుములతో పాటు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అట్ల చినవెంకటరెడ్డి, సంతనూతలపాడు, అద్దంకి, కందుకూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా వారంతా చర్చించారు.
 
 ప్రచారం షెడ్యూలు ఇదీ...
 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అద్దంకి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పర్చూరు, సాయంత్రం 4.30 గంటల నుంచి చీరాల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి గిద్దలూరు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి యర్రగొండపాలెం, సాయంత్రం 5 గంటల నుంచి మార్కాపురం, 24వ తేదీ మధ్యాహ్నం 10 గంటల నుంచి ఒంగోలు, సంతనూతలపాడు, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొండపి, సాయంత్రం 3 గంటల నుంచి కనిగిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement