శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో గడచిన ఏడాదిలో పాలన అస్తవ్యస్తంగా తయారైందనీ, రైతులకిచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని నట్టేట ముంచారనీ, మహిళా సంఘాలను మోసగించారనీ, ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడి కలెక్టరేట్ ఎదుట గురువారం భారీ ఎత్తున ధర్నా చేపట్టారు.
ఇందులో పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి కూడా తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతూ ఇంతవరకూ లేని సెక్షన్-8ను తెరపైకి తెస్తున్నారన్నారు. గత 20రోజులుగా రాష్ట్రంలో పాలన స్తంభించిందని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు విత్తనాలు అందించలేకపోయారనీ, ఖరీఫ్‌ప్లాన్‌పై బ్యాంకర్ల సమావేశం ఇంతవరకూ నిర్వహించలేదని, కొత్తరుణాలు లేకపోవడంతో బీమా సదుపాయాన్ని కూడా రైతాంగం నష్టపోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు.
గతంలో అభియోగం వచ్చినపుడు నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు వంటి నాయకులు స్వతహాగా రాజీనామా చేసి వారి నిజాయితీ నిరూపించుకున్నారని, ఇపుడు చంద్రబాబు కూడా అదేరీతిలో తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే తమ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. కృష్ణాజలా ల్లో మనవాటా సాధించడంలో విఫల మయ్యారని దుయ్యబట్టారు. పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పాలవలస విక్రాంత్‌లు మాట్లాడుతూ సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేయడం, అంగన్‌వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం, గ్రామస్థాయిలో తమకు అనుకూలం కానివారిపై వేధింపులకు పాల్పడడం వంటివి ఈ ఏడాదిలో పెచ్చుమీరాయన్నారు. అనంతరం ఏడాది పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైన, రైతాంగ సమస్యలపైన జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు.
ధర్నాలో పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, జిల్లా నాయకులు పిరియా సాయిరాజ్, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, నర్తు రామారావు, వై.వి.సూర్యనారాయణ, చల్లా రవికుమార్ శిమ్మ రాజశేఖర్, జె.జె.మోహనరావు, అంధవరపు సూరిబాబు, ధర్మాన పద్మప్రియ, ఎం.వి.పద్మావతి, గొండు కృష్ణమూర్తి, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, గేదెల రామారావు, మార్పు ధర్మారావు, చిట్టి జనార్దన, టి.కామేశ్వరి, పీస శ్రీహరి, బీఎల్ నాయుడు, శిమ్మ వెంకటరావు, ధర్మాన రామలింగంనాయుడు, చల్లా అలివేలు మంగ, బరాటం నాగేశ్వరరావు, కిల్లి వెంకట సత్యనారాయణ, దుంపల శ్యాం, పేరాడ తిలక్, సనపల నారాయణరావు, బల్లాడ జనార్దనరావు, అబ్దుల్ రెహమాన్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ఏడాది రుణప్రణాళిక ఏదీ?
రైతులకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఈ ఏడాది రైతులకు సంబంధించిన రుణప్రణాళిక ఇంతవరకూ తయారు కాలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా పాత రుణాలు తీరక, కొత్తరుణాలు అందక ఆర్థిక ఇబ్బందుల్లో పడి ప్రైవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు చేయకపోవడంతో బ్యాంకులకు, రైతులకు మధ్య సత్సంబందాలు తెగిపోయాయి. జిల్లా మంత్రి హైదరాబాదుకే పరిమితమయ్యారు.
- ధర్మాన ప్రసాదరావు
రాజ్యాంగ వ్యవస్థ అభాసుపాలు
రాష్ట్రంలో ప్రభుత్వం లేకుండా పోయింది. రాజ్యాంగ అధినేతకు కూడా దుర్బాషలాడిన నీచ సంస్కృతి టీడీపీ మంత్రులు, శాసనసభ్యుల్లో చోటుచేసుకుంది. రాష్ట్రాన్ని దొంగలు పాలిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొంగలే... దొంగా దొంగా అని అరిచినట్టుంది. రైతులకు, మహిళలకు, చేనేత కార్మికులకు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. 20రోజులుగా పాలన విడిచిపెట్టి సీఎం ఆత్మరక్షణలో పడ్డారు.
- తమ్మినేని సీతారాం
అడుగడుగునా మోసం
రుణమాఫీ పేరుతో రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న సీఎం దానినుంచి తప్పించుకునేందుకు సెక్షన్-8 తెరపైకి తెస్తున్నారు. టీడీపీ అవినీతిని ప్రజలకు వివరిద్దాం. అదే మన తక్షణ కర్తవ్యం.
- రెడ్డి శాంతి
పాలన అస్తవ్యస్తం
Published Fri, Jun 26 2015 2:03 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement