నమ్మించి దగాచేసిన చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్ సీపీ శ్రేణులు కన్నెర్రజేశాయి. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కి ఆనక గాలికొదిలేసిన వైనాన్ని వివరించిన నేతలు పార్టీ శ్రేణులకు ఉత్తేజాన్నిచ్చారు. రుణాలు రద్దుకాక, కొత్త రుణాలు అందక, మద్దతు ధర లభించక, నకిలీ విత్తనాలతో సమస్యల వలయంలో చిక్కుకున్న రైతులకు, ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి పోరాడతామనే భరోసానిచ్చారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపె వెన్నుచూపని పోరాటం సాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఎలుగెత్తారుు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి నేతలు, పార్టీ శ్రేణులు కాపెద్ద ఎత్తున తరలివచ్చారు. గద్దెనెక్కేందుకు ప్రజలను నమ్మించి, తర్వాత దగా చేసిన చంద్రబాబును ఎండగట్టిన నేతలు ‘నోటుకు ఓటు’ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు ఖాయమంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. నేతలు చంద్రబాబు తీరును ఎండగట్టే సందర్భంలో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ‘విజన్ 2020-చంద్రబాబు 420’ ‘పాత ఇనుప సామాన్లు కొంటాం -ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తాం’ అంటూ చంద్రబాబు నిజస్వరూపాన్ని ఎండగట్టేలా కార్యకర్తల చేతుల్లో ఉన్న స్లకార్డులు ఆకట్టుకున్నాయి.
చంద్రబాబు ఏ స్థాయి ప్రజాప్రతినిధులకు ఎంత రేటు నిర్ణయించారో తెలియచేసేలా ప్లకార్డులలో పట్టిక రూపంలో ఉంచారు. నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన వైనాన్ని జ్యోతుల నెహ్రూ ఎండగట్టారు. పుష్కరాల పనుల్లో వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ సరిదిద్దుకోలేకపోతే తప్పుకోవాలని, తమ పార్టీ తరఫున ప్రతి భక్తుడికీ సేవలందించేందకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తానిచ్చిన లేఖతో విభజనకు కారణమైన బాబు విలీన మండలాల్లో అమాయకులైన గిరిజన విద్యార్థులకు కనీస విద్య కూడా అందించ డం లేదని విమర్శించారు. సర్కార్ స్పందించకుంటే ఆ బాధ్యతను భుజానకెత్తుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని విసిరిన సవాల్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఇందుకు ఆయన సర్కార్‌కు 15 రోజులు గడువు ఇచ్చారు. లేదంటే దశలవారీ ఉద్యమం తప్పదని జారీ చేసిన హెచ్చరికలతో ఏడు విలీన మండలాల్లో గిరిజనుల వెంట ఉంటామని భరోసా కల్పించారు.
రైతుల నుంచి ప్రతిఘటన తప్పదు..
దివంగత మహానేత వైఎస్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర 81.8 శాతం పెరగ్గా, బాబు హయూంలో 3.81 శాతం మాత్రమే పెరిగిందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఎత్తిచూపారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామని సంబరపడుతున్న చంద్రబాబు ఏదో ఒక రోజు రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ఇప్పుడు ముఖం చాటేసిన వైనాన్ని ఎత్తిచూపారు. చిన్నపాటి అభియోగాలకే వైఎస్ హయాంలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాచేసి ఎన్నికలను ఎదుర్కొన్న ధైర్యాన్ని గుర్తుకు తెస్తూ నోటుకు ఓటు కుంభకోణంలో కూరుకుపోయిన బాబు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏమి చేస్తారో చెప్పాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నిలదీయడంతో కార్యకర్తలు కేరింతలుకొట్టారు. పవనిజమంటూ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నావన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సూటి ప్రశ్నకు యువత నుంచి అనూహ్య స్పందన లభించింది.
భూసేకరణ మాటున రియల్ ఎస్టేట్ దందా
పుష్కరాల్లో అవినీతి, భూ సేకరణ చట్టంలో లొసుగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు తీరును పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఎండగట్టారు. టీడీపీ వైఫల్యాలను పార్టీ ప్రచార సెల్ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తనదైన శైలిలో ఎత్తిచూపారు. రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరు వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తోట సత్య, అధికారప్రతినిధి దొంగ రామసత్యనారాయణ, ప్రచార సెల్ అధ్యక్షుడు సిరిపురపు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ధర్నా అనంతరం పార్టీ నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లే సమయంలో పోలీసులకు, నెహ్రూకు మధ్య కొద్దిసేపు సంవాదం జరిగింది. డీఆర్వో యాదగిరికి పలు అంశాలతో పాటు జిల్లాలోని నాలుగు ప్రధాన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. ఇటీవల తుపాన్‌లో మృతి చెందిన మత్య్యకారులకు సర్కార్ ప్రకటించిన నాలుగున్నర లక్షలు కాకుండా ఐదు లక్షలు పరిహారంగా అందచేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, జడ్పీ ప్రతిపక్ష నాయకుడు తోట నవీన్, రాజమండ్రి కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కో ఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామి నాయుడు, తోట సుబ్బారావునాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర రైతు కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శి కురుమళ్ళ రాంబాబు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, మట్టపర్తి మురళీకృష్ణ, మండపాక అప్పన్నదొర, అబ్దుల్‌బషీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, మట్టా సుజాత, మానే దొరబాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు కర్రి పాపారాయుడు, గుండా వెంకటరమణ, సంగిశెట్టి అశోక్, కర్రి నారాయణరావు, మోతుకూరి వెంకటేష్, బొబ్బిలి గోవిందు, దంగేటి రాంబాబు, పెంకే వెంకట్రావు, రావు చిన్నారావు, ఎన్‌ఎస్ రాజు, మంచాల బాబ్జీ, పోలు కిరణ్‌కుమార్‌రెడ్డి, మీసాల దుర్గాప్రసాద్, గట్టి రవి, సత్తి వీర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఆదిత్యకుమార్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జోగా రాజు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి అల్లి రాజబాబు, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులు పెద్దిరెడ్డి రామలక్ష్మి, సత్యవతి, నేతలు విప్పర్తి వేణుగోపాలరావు, గుర్రం గౌతమ్, ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు.
దగాకోరు సర్కారుపై మడమ తిప్పని పోరు
Published Fri, Jun 26 2015 2:38 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement