శ్రీశైలం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(55) హత్యతో శ్రీశైలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరైన ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాపు కాచి గొడ్డళ్లు, గడ్డపారలతో పొడిచి చంపడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలివి.. వసంతరావు శుక్రవారం ఉదయం సున్నిపెంట నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ కారు(ఏపీ28 సీఎల్ 2830)లో బయలుదేరారు. 5.30 గంటల ప్రాంతంలో రెండో పవర్‌హౌస్ దాటి రెండు మలుపులు తిరగ్గానే ఎదురుగా వచ్చిన వాహనం వేగంగా ఢీకొంది.
ఆ తర్వాత దుండగులు ఒక్కసారిగా వాహనాన్ని చుట్టుముట్టి వసంతరావును బయటకు లాగి గడ్డపార, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారని కారు డ్రైవర్ శివ తెలిపారు. నిమిషాల వ్యవధిలో పరారైన దండగులు తమ వాహనాన్ని వజ్రాలగుట్ట సమీపంలో వదిలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని శ్రీశైలం సీఐ వెంకటచక్రవర్తి, ఈగలపెంట ఎస్‌ఐ శ్రీనివాస్, ఆమ్రాబాద్ ఎస్‌ఐ ఆదిరెడ్డి పరిశీలించారు.
కార్డు డ్రైవర్ ప్రమేయంపై పోలీసుల అనుమానం
ఒక్కసారిగా చుట్టుముట్టిన దుండగులు కారు డ్రైవర్‌ను వదిలిపెట్టడం అనుమానాల కు తావిస్తోంది. ఆ దిశగా పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10 మంది వ్యక్తులు ముఖానికి కర్చీప్‌లు, టవళ్లు కట్టుకున్నారని.. కత్తులు, కొడవళ్లు, తుపాకులతో వచ్చిన వీరు వసంతరావు పక్కనే ఉన్న బ్రీఫ్‌కేస్‌లోని రూ.50వేలు తమకిచ్చి పారిపోవాలని చెప్పారని డ్రైవర్ శివ పోలీసులకు వివరించాడు. ఘటనకు ముందు లింగాలగట్టు ప్రాంతంలో ఓ దుకాణం వద్ద 15 నిమిషాలు కారు ఆపి సిగరెట్లు తీసుకున్నట్లు కూడా చెబుతున్నాడు.
ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వసంతరావు రాకపోకలు డ్రైవర్‌తో పాటు ఆయన సన్నిహిత అనుచరుడు చెన్నయ్యకు మాత్రమే తెలుస్తుంది. ముందు రోజు రాత్రి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు వసంతరావు చెప్పారని చెబుతున్న శివ.. ఈ విషయం చెన్నయ్యకు కూడా తెలియదంటున్నాడు. అలాంటప్పుడు సమాచారం ప్రత్యర్థులకు ఎలా పొక్కిందనే ప్రశ్న తలెత్తుతోంది.
గన్ లెసైన్స్ కోసం దరఖాస్తు?
ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని గతంలో అప్పటి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి దృష్టికి వసంతరావు తీసుకెళ్లగా.. ఆ మేరకు ఎస్పీకి అందజేసిన దరఖాస్తుపై ఆయన సిఫారసు కూడా చేసినట్లు తెలుస్తోంది. గన్‌మెన్లు కూడా కావాలని కోరగా.. భారం అధికమవుతుందని ఏరాసు సూచించడంతో లెసైన్స్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏరాసు పాణ్యం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం.. వసంతరావు వైఎస్‌ఆర్‌సీపీలో చేరి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వెంట నడవటం జరిగింది. సున్నిపెంటతో పాటు శ్రీశైలంలోని ఎస్సీ వర్గీయులను ఏకతాటిపై నడిపించడంలో వసంతరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నేత మరణంతో శ్రీశైలం మూగబోయింది.
ముమ్మాటికీ రాజకీయ హత్యే - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
వసంతరావు హత్య రాజకీయంతో ముడిపడి ఉందని శ్రీశైలం నియోజకవర్గ ఎంఎల్‌ఏ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శ్రీశైలం మండల పరిధిలో హత్య జరిగితే ఆ నింద టీడీపీపైనే పడుతుందనే భావనతోనే ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దును ఎంచుకున్నారన్నారు. హత్య వెనుక ఎవరున్నారో స్థానికులందరికీ తెలుసని, తెలంగాణ పోలీసులు కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు.
ఇటీవల వెన్నెముకకు ఆపరేషన్ చేయించుకున్న వసంతరావును అమానుషంగా దాడి చేసి హత్య చేయడం బాధాకరమన్నారు. హత్యా రాజకీయాలతో ఎదగాలనుకోవడం నీచమైన చర్యగా అభివర్ణించారు. కొన్ని నెలల క్రితమే సున్నిపెంటలో భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు వసంతరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని.. ఇది జీర్ణించుకోలేకనే హత్యకు పాల్పడ్డారన్నారు.
హత్యా రాజకీయాలు సిగ్గుచేటు: ఎమ్మెల్యే ఐజయ్య
మిడుతూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా హత్యలు అధికమయ్యాయని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని 49 బన్నూరులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావును అధికార పార్టీ వర్గీయులే హత్య చేయించారన్నారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలతో సాంధిచేదేమీ ఉండదన్నారు.
కాపు కాచి హతమార్చారు
Published Sat, May 16 2015 5:02 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement