వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నేతల అరెస్ట్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారుల దిగ్భంధంపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. సీమాంధ్రలో బుధవారం రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నపార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని అరెస్ట్ చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సహా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. అనంతపురంలో ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి సహా 500 మందిని అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కల్యాణదుర్గంలో మోహన్ రెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా గరికపాడు వద్ద వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో 9వ నంబర్ హైవేను దిగ్బంధించారు. ఉదయభాను సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్న పార్టీ నేత గౌతంరెడ్డిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రవిబాబు సహా 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో హైవేను దిగ్బంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులను అరెస్ట్ చేశారు.