వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు
Published Mon, Mar 10 2014 1:40 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
రామచంద్రపురం అభ్యర్థిగా జగన్నాథ వర్మ
రామచంద్రపురం,న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త అడ్డూరి జగన్నాథవర్మ పోటీ చేయనున్నట్టు మాజీ మంత్రి, ఆపార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రకటించారు. పట్టణంలోని జగన్నాథ వర్మ స్వగృహం వద్ద ఆదివారం కార్యకర్తల సమావేశంలో బోస్ మాట్లాడుతూ అంకిత భావంతో ప్రజాసేవ చేసే కుటుంబం నుంచి వచ్చిన జగన్నాథవర్మ మచ్చలేని మనిషన్నారు.
అవినీతికి పాల్పడితే నిలదీయండి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అందించేందుకు, పట్టణంలో అవినీతి రహిత పాలన అందించేందుకు తాను చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు అడ్డూరి జగన్నాథవర్మ తెలిపారు. తాను ఎప్పుడైనా అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే రోడ్డుపై చొక్కా పట్టుకుని నిలదీయండని ప్రజలకు సూచించారు. పట్టణంలో ఇంటి పన్నులను దారుణంగా పెంచేశారని, తాము దాన్ని పునః పరిశీలిస్తామన్నారు. పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, తొగరు మూర్తి, జి. శ్రీధర్, సీహెచ్ ఏసయ్య పాల్గొన్నారు.
తుని చైర్‌పర్సన్ అభ్యర్థిగా శోభారాణి
తుని, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుని మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కుసుమంచి శోభారాణిని పార్టీ తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో 2005 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 30 వార్డుల్లో విజయం సాధించడంలో కుసుమంచి శోభారాణి పాత్ర కీలకమైనదని అన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాల ఫలాలను శోభారాణి అందరికీ అందజేశారని రాజా అన్నారు. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, పురపాలక ఎన్నికల్లో ప్రజల మద్దతును కోరుతున్నామన్నారు. ప్రజలకు నిస్వార్ధమైన సేవలు అందించే నాయకుడు వెంట జనం ఉంటారని రాజశేఖరరెడ్డి నిరూపించారన్నారు. అదే పరిస్థితి జగన్మోహన్‌రెడ్డికి ఉందని శోభారాణి అన్నారు. తనకు చైర్‌పర్సన్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన వైఎస్సార్ సీపీకి రుణపడి ఉంటానని శోభారాణి అన్నారు. తుని పట్టణాభివృద్దికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. అనంతరం 28వ వార్డులో దాడిశెట్టి రాజా, శోభారాణితో కలసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
Advertisement