నెల్లూరు(సెంట్రల్), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండువద్ద ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి, నెల్లూరురూరల్, వెంకటగిరి నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు.
వెంకటాచలం మండలం కాకుటూరులో ఉన్న బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్ష టయోటా షోరూంను విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించి, ధర్నా నిర్వహించారు. నెల్లూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండులో ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపక బృందం, విద్యార్థులు వీఆర్ కళాశాల నుంచి గాంధీబొమ్మ వరకు కేంద్ర మంత్రుల వేషధారణలు వేయించి ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రుల వేషధారణలోని వారిని మహిళలు చీపుర్లు, చెప్పులతో కొట్టారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు వీఆర్ కళాశాల నుంచి గాంధీబొమ్మ వరకు భిక్షాటన చేశారు. అనంతరం మోకాళ్లపై నిలబడి మానవహారంగా ఏర్పడ్డారు. ఎన్‌జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని విధులను బహిష్కరింపజేశారు. వెంకటగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు కోర్టు ప్రాంగణం నుంచి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు సోనియా, కేసీఆర్, పనబాక లక్ష్మి, దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి, చింతా మోహన్, పురందరేశ్వరి బొమ్మలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేశారు. స్థానిక ఆర్‌టీసీ బస్టాండు నుంచి అడ్డ రోడ్డు సెంటర్ వరకు ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సీమాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో కాశీపేట సెంటర్లో ప్రజలు క్రికెట్ ఆడుతూ నిరసనను వ్యక్తం చేశారు. ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తుండగా, వరికుంటపాడు మండలం రామాపురం, తిమ్మారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన వారు పామూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆత్మకూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు.
ముత్తుకూరులో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. బ్రహ్మదేవిలో విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తోటపల్లిగూడూరు, పేడూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాఠశాలలు, బ్యాంకులను మూతవేయించారు. గూడూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు న్యాయవాదులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాశం సునీల్ కుమార్, సీహెచ్.బాలచెన్నయ్య మద్దతు ప్రకటించారు.
గూడూరు క్లాక్ టవర్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద ఎంప్లాయీస్ యూనియన్ రిలే నిరాహార దీక్ష ద్వారా నిరసన తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం రేబాల వద్ద విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కావలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. కడనూతలలోని ఆర్‌ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బృందావనం కాలనీ నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్దతు తెలిపారు. కావలిలో ఎస్టీయూఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఉద్యమం ఉధృతం
Published Fri, Aug 9 2013 3:37 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement