
కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీ కన్వీనర్ల రాజకీయ శిక్షణ తరగతులు నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్నాయి. నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయి. మొదటి రోజు కర్నూలు పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ లెవల్ కమిటీల కన్వీనర్లకు శిక్షణ తరగతులు ఉంటాయి. రెండో రోజు నంద్యాల పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణకారరెడ్డితోపాటు పలువురు రాష్ట్రస్థాయి నేతలు హాజరుకానున్నారు.
ఎన్నికల నిర్వహణపై కమిటీలకు సమాయత్తం
ఎన్నికల నిర్వహణలో బూత్ లెవల్ కమిటీలదే కీలకపాత్ర. ఒక్కో బూత్ లెవల్ కమిటీలో 10 మంది సభ్యులు, ఒక్కరూ కన్వీనర్‌గా ఉంటారు. వీరు తమ పరిధిలోని బూత్‌ల్లో ఎన్నికల సమయంలో ఎలా మసలుకోవాలి, ఏమి చర్యలు తీసుకోవాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలి తదితర అంశాలపై రాష్ట్ర నాయకులు కన్వీనర్లకు దిశా నిర్దేశం చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే శిక్షణ తరగతులకు హాజరయ్యే కన్వీనర్లు, సభ్యులకు మధ్యాహ్న సమయంలో భోజనం సదుపాయంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. ఈమేరకు శిక్షణ తరగతులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తి చేశారు.