అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆందోళనే | Ysr congress Rights Committee to tour in AP new capital area | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆందోళనే

Published Thu, Nov 27 2014 4:15 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

Ysr congress Rights Committee to tour in AP new capital area

' రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ సీపీ హక్కుల కమిటీ పర్యటన
' శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు పర్యటనలో రైతులు, కూలీలు, కౌలు రైతులకు భరోసా ఇచ్చిన నేతలు
' రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు.. రైతులకు సర్కారు అన్యాయం చేస్తే సహించం
' రాజధాని పేరుతో భూ దందాను అంగీకరించం
' చివరి వరకు రైతులకు అండగా ఉంటాం
' అధికార పార్టీ నేతల అసత్య ప్రచారాలను నమ్మొద్దు
' ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి
' అన్నదాతను నట్టేట ముంచుతావా అంటూ చంద్రబాబుపై మండిపాటు

గుంటూరు: రాజధాని భూసేకరణ విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆందోళన తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ రైతులు, రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ నేత కొలుసు పార్థసారథి హెచ్చరించారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ నెపంతో ఆయూ ప్రాంతాల వారికి అన్యాయం చేయూలని చూస్తే సహించబోమని స్పష్టంచేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన ఈ కమిటీ సభ్యులు మూడో విడత పర్యటనలో భాగంగా బుధవారం తుళ్ళూరు మండలంలోని శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో రైతులు, కూలీలు, కౌలు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
 
 ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ రాజధాని పేరిట జరుగుతున్న భూ దందాను అంగీకరించబోమన్నారు. స్థానికులు బెంగ పడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దని చెప్పారు. భూములివ్వడానికి రైతులు సంతోషంగా ముందుకొస్తున్నారంటూ కొన్ని పత్రికలు రాస్తున్న కథనాలన్నీ వాస్తవ విరుద్ధమేనని తమ పర్యటన ద్వారా స్పష్టమైందని తెలిపారు. భూమికీ రైతుకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎవరూ డబ్బులతో తూచలేరని చెప్పారు. అనుభవజ్ఞుడివని నీకు ఓటేసిన పాపానికి అన్నదాతలను నట్టేట ముంచుతావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పచ్చటి పంటలతో అలరారే నేలను తీసుకుని.. నీరు, పైరు లేని సింగపూరులా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలకడమంత సిగ్గుచేటు ఇంకోటి లేదని అన్నారు. కేవలం రెండు బస్సుల్లో హైదరాబాద్ వెళ్ళిన రైతులు చెప్పిందే వేదం కాదని  వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రైతు భూమినే పెట్టుబడిగా పెట్టి రాజధాని నిర్మించే యత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు.
 
 అందరికీ న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని పార్థసారథి హెచ్చరించారు. పొలాలపై ఆధారపడే రైతులు, కూలీలు, కౌలు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందన్నదే తమ ఆవేదన అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో అందరి అభిప్రాయాలను తీసుకొని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. అవసరమైతే పార్లమెంట్ వరకు దీనిపై పోరుబాట పడతామన్నారు. చివరి వరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. రైతులందరి అభిప్రాయాలను క్రోడీకరించి, కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు.
 
 బాబు చెప్తున్న దానికి చట్టబద్ధత లేదు...
 రాజధాని విషయంలో చంద్రబాబు చెప్తున్న ఏ అంశానికీ చట్టబద్ధత లేదని వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర నేత నాగిరెడ్డి చెప్పారు. ప్రజలను తరలించాలంటే భూసేకరణ చట్టం ఒక్కటే సరిపోదని  చెప్పారు. పునరావాసం, పునర్నిర్మా ణం చట్టాన్ని కూడా అమలు చేయాలని తెలి పారు. బాబు మొండిపట్టు విడనాడాలనీ, జరీ బు భూముల జోలికి రాకూడదని హితవు పలి కారు. దీనిపై అసెంబ్లీలోనే కాక అన్ని రాజకీయ పార్టీలతో ప్రజల సమక్షంలో బహిరంగంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
 
 ముందు అనుమానాలు నివృత్తి చేయాలి..
 రాజధాని గ్రామాల రైతుల్లో ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేసిన తర్వాతే భూ సమీకరణ గురించి బాబు మాట్లాడాలని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర క్రిస్టీనా సూచించారు. ఈ పర్యటనలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా, జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, కొత్త చిన్నపరెడ్డి, సయ్యద్ మహబూబ్, మేరిగ విజయలక్ష్మి, సయ్యద్ హబీబుల్లా, కత్తెర సురేష్, సుద్దపల్లి నాగరాజు, పురుషోత్తం, తుమ్మూరు వరప్రసాద్‌రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement