నిర్వాసితులకు అండగా వైఎస్సార్‌సీపీ
ఎమ్మెల్యే రామిరెడ్డి
ప్రతాప్‌కుమార్‌రెడ్డి
దామవరంలో ఎయిర్‌పోర్టు భూముల పరిశీలన
కావలి అర్బన్ : దామవరంలో విమానాశ్రయం ఏర్పాటుతో భూములు కోల్పోతున్నవారికి న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దగదర్తి మండలంలోని దామవరంలోని భూములతో పాటు డీఆర్, డీఎం చానళ్లను మంగళవారం ఆయన రైతులతో కలసి పరిశీలించారు. దామవరం పొలిమేరలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం 1,400 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అయితే 1933లో శాశ్వత పథకం కింద 700 ఎకరాలను పేదలకు పంపిణీ చేశారన్నారు. భూములన్నీ ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతున్నాయన్నారు. అయితే ఈ 700 ఎకరాలకు పరిహారం ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రైతులు నలభై, యాభై ఏళ్లు కష్టపడి భూములను తీర్చిదిద్దుకుని ప్రస్తుతం రెండు పంటలు పండించుకుంటున్నారన్నారు. చుట్టుపక్కల భూములు ఎకరా రూ.40 లక్షల వరకు పలుకుతోందని వెల్లడించారు.
మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు నిర్వాసితుల కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులకు అప్పటి మార్కెట్ ధర ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గూడూరు డివిజన్ అభివృద్ధిపై దృష్టిపెట్టిన అధికార పార్టీ నేతలు కావలిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు పన్ను రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు నారాయణ, వెంకయ్యనాయుడు సహకరించాలని కోరారు. డీఎం, డీఆర్ చానళ్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించి రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
ఫ్యాషన్‌గా మారినఅసత్య ప్రచారం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం చేయడం టీడీపీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణాలో ఆ పార్టీని కేసీఆర్ ఖాళీ చేయిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ ప్రజల దృష్టిని మళ్లించేందుకే వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. టీడీపీ మునిగిపోయే నావ అని ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్ రెడ్డి, దగదర్తి మండల కన్వీనర్ గోగుల వెంకయ్య, బోడిగుడిపాడు సర్పంచ్ తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, విష్ణు, గిరి నాయుడు, జి.హరికిశోర్‌రెడ్డి, చిన్న రమణయ్య, వరదారెడ్డి, రైతులు పాల్గొన్నారు.