మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులడు, జెడ్పీ మాజీ చైర్మన్ కె.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వైఎస్సార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూసి అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. వైఎస్ మరణానంతరం విచ్ఛిన్నకర శక్తులు ఏకమై తెలంగాణవాదాన్ని తెరపైకి తెచ్చాయని చెప్పారు. నిజాం పాలకులకు దాసీలుగా పనిచేసినవారు నేడు తెలంగాణ వేర్పాటువాదాన్ని భుజాన వేసుకుని నాయకులుగా ఎదిగారన్నారు. తెలుగుభాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే నేటి పాలకులు కుట్రలు చేసి తెలుగుజాతిని విభజించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 1969లో తెలంగాణ, 1972లో జై ఆంధ్రా ఉద్యమాలు వచ్చినా.. అప్పటి పాలకులు వాటిని సమయస్ఫూర్తితో నిలువరించారన్నారు. ప్రస్తుత కేంద్ర పాలకులు మాత్రం సీడబ్ల్యూసీ నిర్ణయం పేరుతో రాష్ట్రాన్ని విభజించేందుకు స్వార్థపూరిత కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ అందరిదీ..
అప్పట్లో తెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాలు.. తెలుగుజాతి ఒకే రాష్ట్రంగా ఉండాలనే బలమైన ఆకాంక్ష వల్ల నీరుగారిపోవడంతో రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదును అప్పటి నుంచి అందరిదీ అని భావించి సీమాంధ్రవాసులు ఆస్తులు అమ్ముకుని అక్కడ కర్మాగారాలు స్థాపించారని కేఎన్నార్ చెప్పారు. హైదరాబాదు దేశంలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా, పారిశ్రామిక హబ్‌గా ఏర్పడిన అనంతరం తెలంగాణవాసులు హైదరాబాదు తమదేనంటూ వాదన చేయటం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాదును పరిపాలించిన నిజాం నవాబులకు సీమాంధ్ర నుంచే అధిక మొత్తంలో కప్పం చెల్లించేవారన్నారు. చల్లపల్లి రాజా నిజాం నవాబులకు అధిక మొత్తంలో కప్పం చెల్లించిన కారణంగానే శ్రీమంతురాజా అనే బిరుదును ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర రాజధానిగా ఉన్న భాగ్యనగరం కట్టడానికి బందరు పోర్టు ద్వారానే రంగూన్ టేకు దిగుమతి అయ్యిందన్నారు. హైదరాబాదుకు అత్యంత సమీపంలో బందరు పోర్టు ఉందని చెప్పారు.
నీటి తగవులు తప్పవు..
రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ, సీమాంధ్రల మధ్య నీటి తగవులు తప్పవని కేఎన్నార్ అన్నారు. రాష్ట్రం కలిసుంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండేవరకు కృష్ణాడెల్టాకు నీటి విడుదల చేయొద్దంటూ తెలంగాణవాదులు కోర్టులకెక్కిన విషయాన్ని గుర్తుచేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొత్తం నల్గొండ జిల్లాలోనే ఉందని, కృష్ణాడెల్టాకు తెలంగాణవాదులు చుక్కనీరు రానివ్వరని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందనే సూక్ష్మ విషయాన్ని కేంద్ర పాలకులు మరవటం బాధాకరమన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోరాటాలకు వేదికగా మారిందని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య, స్వాతంత్య్ర సమరయోధులు ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు, తోట నరసయ్య వంటి మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. ప్రస్తుతం సమైక్యాంధ్ర కోసం ఆ తరహా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంతో సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రులు చైతన్యవంతమయ్యారని చెప్పారు. కేంద్ర పాలకుల మెడలు వంచేవరకు ఉద్యమాన్ని స్వచ్ఛందంగా నడిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంకా పదవులను పట్టుకుని వేలాడుతూ సోనియాగాంధీ భజన చేస్తున్న సీమాంధ్ర నాయకులు ఇప్పటికైనా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల మనసెరిగిన జగన్..
ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తే నిజమైన నాయకుడని కేఎన్నార్ తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనిషిగా ప్రజాసంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విచ్ఛిన్నకర శక్తుల ఆటలు కట్టించారన్నారు. ఆయన వారసుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు కడతేర్చేందుకు జనం మధ్య తిరుగుతూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందితే.. ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారన్నారు.
అయినా మొక్కవోని ధైర్యంతో వైఎస్ జగన్ నిర్బంధంలో ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిరసన చేపట్టారని కొనియాడారు. ప్రజల బాగోగుల కోసం నిరంతరం పనిచేసేవారే నిజమైన నాయకులన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలంతా సంసిద్ధులుగా ఉన్నారని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజలు కష్టాల్లో ఉంటే అధికార, ప్రతిపక్ష నాయకులు ఇంకా తమ పదవులు పట్టుకుని వేలాడుతున్నారన్నారు.
వైఎస్సార్ బతికుంటే.. విభజన ఊసే ఉండేది కాదు
Published Wed, Aug 28 2013 3:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement