సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ‘సైకిల్’ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బరిలో దిగాలని భావిస్తున్న సింగిరెడ్డి ఒకట్రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం అధినాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో అతి త్వరలోనే పచ్చ కండువా కప్పుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. హరివర్ధన్‌రెడ్డి సోమవారం రాత్రి ముఖ్య అనుచరులతో రాజకీయ భవిష్యత్తుపై కీలక చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో ‘మీ వెంటే మేం నడుస్తాం’ అని సహచరుల నుంచి హామీ రావడంతో టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో వివిధ పార్టీల్లో కీలక నేతగా వ్యవహరించిన హరివర్ధన్‌రెడ్డి 2009లో మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టికెట్‌ను ఆశించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపుగా టికెట్ ఖరారు చేసినప్పటికీ, హఠాత్తుగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి సీటు దక్కింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ పదవిని కట్టబెడతాననే వైఎస్ భరోసాతో కార్పొరేటర్‌గా పోటీ చేసినప్పటికీ, అదే సమయంలో మహానేత మరణం హరివర్ధన్ రాజకీయ ఎదుగుదలపై ప్రభావం చూపింది.
ఈ క్రమంలోనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్నెల్ల క్రితం రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అంశంపై సహచరులతో కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. దీంట్లో భాగంగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న హరివర్ధన్‌రెడ్డి ఇటీవల రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌తో కూడా భేటీ అయ్యారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉండడం, సమర్థ నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థికి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి బలమైన ప్రత్యర్థి కాగలరనే అంచనాకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈయన చేరికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో అతి త్వరలోనే ఆయన టీడీపీ గూటికి చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హరి.. ‘దేశం’ వైపు గురి!
Published Tue, Mar 4 2014 11:29 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement