మహానేత ఉంటే విభజన అసాధ్యమే! | According to surveys, If YS Rajasekhar Reddy alive, State bifurcation is impossible | Sakshi
Sakshi News home page

మహానేత ఉంటే విభజన అసాధ్యమే!

Published Fri, Feb 21 2014 2:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

మహానేత ఉంటే విభజన అసాధ్యమే! - Sakshi

మహానేత ఉంటే విభజన అసాధ్యమే!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన మధ్య ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసాధ్యమనే అభిప్రాయం అన్నివర్గాల నుంచి, ఇరు ప్రాంతాల నుంచి ఒకే భావన వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఇరు ప్రాంతాల అభివృద్దికి ఎనలేని కృషి చేశారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. పేద ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ది అంశాల్లో సమతూకం పాటించి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. అయితే మహానేత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తన పాలనతో ప్రజల దృష్టి నుంచి మరల్చడంలో సఫలమయ్యారు. అయితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత వేర్పాటువాదం ఊపందుకుంది. 
 
వైఎస్సార్ మరణానంతరం సీఎంలుగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని, తెలంగాణ ప్రాంతంలో మళ్లీ తెర మీదకు వచ్చిన రాజకీయ ఉద్యమాలను కట్టడి చేయలేక పోవడం వల్లే  ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. పైకి దీన్ని అంగీకరించలేని ఇతర రాజకీయ పక్షాల నేతలు సైతం ఆఫ్‌ది రికార్డ్‌గా వైఎస్సార్ బతికి ఉండింటే రాష్ట్రం చీలిపోయేది కాదని అంగీకరిస్తున్నారు. వైఎస్సార్ ఉన్నన్నాళ్లూ తెలంగాణ నేతలు ప్రత్యేక ఉద్యమం గురించి నోరెత్తలేక పోయారని, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీ ఆర్ సైతం తెరమరుగైన విషయం మరచిపోలేనిదని గుర్తు చేస్తున్నారు.
 
ఓట్ల కోసం, సీట్ల కోసమే కాకుండా.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక.. అత్యధిక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి అడ్డగోలుగా విభజించడానికి  నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంగ్ల టెలివిజన్ చానెల్ జరిపిన సర్వేలో పలు ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డినే ఉత్తమ ముఖ్యమంత్రి అని అత్యధిక ప్రజలు సర్వేలో తమ మనోగతాన్ని వెల్లడించారు. సీమాంధ్రలో 56 శాతం మంది, తెలంగాణ ప్రాంతంలో 60 శాతం మంది వైఎస్ఆర్ ఉత్తమ ముఖ్యమంత్రి అని సర్వేలో తెలిపారు. రాష్ట్రంలోని  కోస్తా, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల ప్రజల్లో మహానేత వైఎస్ఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని సర్వేలో తేటతెల్లమైంది. ప్రాంతాలకతీతంగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని సర్వేలో అత్యధికమంది స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కు దారిదాపుల్లో చంద్రబాబు, ఇతర ముఖ్యమంత్రులు కూడా లేకపోవడం గమనార్హం. 
 
దివంగత నేత వైఎస్ఆర్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అసాధ్యం అని సర్వేలో అడిగిన ఓ ప్రశ్నకు మూడు ప్రాంతాల్లో అత్యధిక మంది స్పందించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న సమైక్య ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ దే కీలక పాత్ర అని 44 శాతం మంది వెల్లడించారు. 
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో 1500 మందితో సీఓటర్ సర్వే నిర్వహించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement