వెబ్‌డెస్క్ : అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకును పట్టి చూస్తే చాలు. అదే విధంగా సమాజంపై ఓ రాజకీయనేత ఎలాంటి ప్రభావం చూపాడనేది అంచనా వేయడానికి ఊరూరూ, ఇళ్లిళ్లు తిరగక్కర్లేదు. ఒక గ్రామం, ఒక ఇల్లు పరిశీలిస్తే చాలు ఆ నాయకుడి ముందుచూపు, సాటి మనిషి కష్టాల పట్ల స్పందించే గుణాలు ఇట్టే తెలిసిపోతాయి. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాజంపై ఎంతగానో ప్రభావం చూపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు పాదయాత్రలో ఎదురైన అనుభవాలు ఆయనను అంతకు ముందున్న నేతలకు భిన్నంగా మార్చాయి. అందుకు ఉదాహరణ శనిగపురం గ్రామం. అక్కడి ప్రజల అనుభవాలు.
కులమతాలకు అతీతం
మహబూబాబాద్ పట్టణాన్ని ఆనుకునే ఉంటుంది శనిగపురం గ్రామం. ఇటీవల మున్సిపాలిటీలో కూడా భాగం అయ్యింది. ఆ గ్రామంలో ఐదువేల మంది జనాభా నివసిస్తున్నారు. ఐదు వందల గడపల జనాభా. అన్ని కులాలు, మతాల వాళ్లు ఆ ఊళ్లో ఉన్నారు. మతాచారాలకు అనుగుణంగా ఎవరి దేవుడిని వారు పూజిస్తారు. కానీ కులమతాలకు అతీతంగా వారు దేవుడితో సమానంగా కొలిచే మరో వ్యక్తి ఉన్నారు.
ఊళ్లో సగం ఇళ్లల్లో ఆయన ఫోటోలే దర్శనం ఇస్తాయి. ఆయన మరెవరో కాదు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన్ని ఆ గ్రామం గుండెల్లో పెట్టుకుంది. ఎందుకంటే ఆగిపోయే గుండెలను డబ్బు అవసరం లేకుండానే కొట్టుకునేలా ఆయన చేశారు. అందుకే ఆయనంటే వారికి అంత అభిమానం. ఇక్కడ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కో రకంగా ఆ మహానేత గురించి చెబుతారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఓసారి ఆ మరువలేని జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం.
వైఎస్సార్ లేకుంటే ?
పొలంలో కొట్టేందుకు పురుగుల మందు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న రాములు నాయక్‌కి ఉన్నట్టుండి ఛాతీలో మంట మొదలైంది. చూస్తుండగానే నొప్పి పెద్దదైంది. కాళ్ల కింద భూమి కంపించిన ఫీలింగ్. భార్య, ఇద్దరు పిల్లలు కళ్ల ముందు కదలాడారు. కళ్లు తెరిస్తే ఆస్పత్రిలో ఉన్నాడు రాములు నాయక్. గుండె ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు, దానికి రూ. 5 లక్షల ఖర్చు అవుతుందన్నారు. రెండెకరాలు అమ్మినా అంత సొమ్ము రాదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో రాములు నాయక్‌కి ఆదుకుంది ఆరోగ్య శ్రీ పథకం. రాములు నాయక్‌కి ఉన్న రెండెకరాల పొలం అలాగే ఉంది. బయట నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు తేలేదు. అయినా సరే హైదరాబాద్‌లో అపోలో ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ జరిగింది. ఈ ఘటన జరిగింది 2008లో అప్పుడు ఆయన వయస్సు 27 ఏళ్లు. డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే కష్టంగా ఉందంటూ కన్నీటితో చెబుతాడు రాములు నాయక్. అందుకే తనింట్లో దేవుళ్ల ఫోటోల పక్కన వైస్సార్ ఫోటో ఉంటుంది.
మనలోనే ఉన్నాడు
రాములు నాయక్ ఆపరేషన్ తర్వాత అదే ఊళ్లో బానోతు బుజ్జి, నేలమారి కాటం రాజులకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా గుండె ఆపరేషన్ జరిగింది. అప్పటికే వ్యవసాయంలో ఆటుపోట్లు చూస్తున్న రైతన్నలకు రుణమాఫీ ద్వారా భారీ మేలు జరిగింది. అందుకే శనిగపురం గ్రామం వైఎస్సార్‌ను తమ గుండెల్లో పెట్టుకుంది. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి తమవాడే, తమ ఇంటి పెద్ద బిడ్డ అనుకునే ఇలాంటి శనగపురాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ మండలంలో నాలుగైదు ఉన్నాయి. ప్రతీ గడపకు ఆయన సేవలు అందాయి. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తులో, ఆసరా ఫించన్లు పొందుతున్న అవ్వా, తాతాల దీవెనల్లో, ఉచిత కరెంటు పొందుతున్న ప్రతీ రైతు కళ్లలో వెలుగై రాజన్న ఇంకా మన మధ్యే ఉన్నాడు. చిరకాలం అలాగే ఉంటాడు!
Comments
Please login to add a commentAdd a comment