అమరావతి: త్వరలో ప్రారంభం కాబోయే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 15 న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడలో నిర్వహించే ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.