APLA
-
ఇది ఇంజనీర్ల వైఫల్యం
సాక్షి, అమరావతి : ఇంజనీర్ల వైఫల్యం వల్లనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ చాంబర్లోకి వర్షపు నీరు వచ్చిందని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలోని జగన్మోహన్రెడ్డి చాంబర్‌ను, అసెంబ్లీ పైభాగంలోని వర్షపు నీరు ప్రవేశించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి చాంబర్‌పైకి వెళ్ళే మెట్ల ప్రాంత గోడలు, పైశ్లాబు పూర్తిగా పనికి రాకుండా ఉందన్నారు. గోడలు నెర్రెలు బారటంతో పాటు శ్లాబు పై భాగంలో సిమెంటు పెచ్చులు ఊడాయని, ఇలా నిర్మిస్తే భవనం కారక ఏమవుతుందని ప్రశ్నించారు. ఉన్న వాస్తవాన్ని చెబితే విమర్శిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడికి దిగుతున్నారన్నారు. కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా ఎలా కారిందో పూర్తి స్థాయిలో వివరిస్తారన్నారు. శ్లాబు పై భాగం నుంచి కిందకు వెళ్ళే వర్షపు నీటి పైపులు కూడా చిన్నవిగా ఉండటం మరో కారణమన్నారు. పైపు కట్ కావడం వల్లనే నీరు లోపలికి వచ్చిందని ప్రభుత్వ నేతలు చెబుతున్నారని, ఇదంతా నిర్మాణలోపం అనే విషయాన్ని వారు గుర్తించాలన్నారు. ముందుగా నీరు కారిన ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలిస్తూ జేఎన్టీయూ నుంచి వచ్చిన ఇంజనీర్లతో మాట్లాడారు. నిర్మాణ లోపాలను పూర్తిస్థాయిలో గుర్తించాలని వారికి సూచించారు. గోడలు నెర్రెలు బారటాన్ని ఆయన మీడియా వారికి ఒక్కటొక్కటిగా చూపించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇంజనీర్లు, సీఐడీ అధికారుల తీరు కూడా కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెతలా ఉంటుందని ఎద్దేవా చేశారు. -
లీకేజీపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో వర్షం నీరు లీకేజీపై సీఐడీ విచారణ గురువారం కొనసాగింది. సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు నేతృత్వంలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైల బృందం ఆధారాలు సేకరిస్తోంది. అసెంబ్లీలో పనిచేసిన ఎలక్ట్రిషీయన్లు, టెక్నిషియన్స్‌ను సీఐడీ అధికారులు విచారించారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. సీఐడీ అధికారుల విచారణ సమయంలో మీడియాను అనుమతించలేదు. అసెంబ్లీ భవనంలోని సీసీ కెమెరా పూటేజీలను సేకరించినట్టు తెల్సింది. వైఎస్సార్ కాంగ్రెస్ లెజిస్టేటివ్ పార్టీ కార్యాలయంతోపాటు మిగిలిన ఛాంబర్లను కూడా పరిశీలించారు. నీరు ఎక్కడి నుంచి లీకు అయ్యింది, ఎందుకు లీకైంది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్సీఎల్పీ కార్యాలయం వద్ద లీకేజీకి కారణమైన పైపును పరిశీలించిన సీఐడీ అధికారులు అందుకు బాధ్యులు ఎవరు కోణంపైనే దృష్టిపెట్టారు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు పరిశీలించేలా చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఫోరెన్సికల్ నిపుణుల నిర్థారణపైనే ఆధారపడకుండా సివిల్ ఇంజినీరింగ్‌లో నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్లు (నిపుణులు)ను తీసుకొచ్చి అసెంబ్లీలో లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించే ఏర్పాట్లు చేశారు. ఒకటి రెండు రోజుల్లో నిపుణులు పరిశీలన అనంతరం సీఐడీ ఒక నిర్థారణకు రానున్నట్టు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేధిక ఇచ్చే అవకాశం ఉంది. పైపు కట్ చేయడం వల్లే నీరు : సీఐడీ డీజీ ద్వారకా తిరుమలరావు పైపు కట్ చేయడం వల్లే అసెంబ్లీ భవనంలో వర్షం నీరు లీకేజీకి కారణమని నిర్ధారించినట్టు సీఐడీ డీజీ ద్వారకా తిరుమల రావు సాక్షికి చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ శ్లాబ్ (రూఫ్) దిగువన పెట్టిన కమ్యూనికేషన్స్ కేబుల్స్ నడిపే పైపు కట్ చేసి ఉందని చెప్పారు. ఆ పైపు విరిగినట్టుగానీ, పగిలినట్టు గానీ లేదన్నారు. రంపం బ్లేడు, యాక్స్ బ్లేడ్‌తో కోసినట్టు ఉందని గుర్తించామన్నారు. కట్ చేసిన ఉన్న పైపును ఎంసీల్‌తో మూసివేశారన్నారు. దానికి ఎంసీల్ వేయకముందు పరిశీలిస్తే మరింత స్పష్టత వచ్చేందని చెప్పారు. లీకేజీకి కారణమైన పైపు ఎవరు కట్ చేశారు? ఎందుకు చేశారు? అనేది తమ దర్యాప్తులో తేలాల్సి ఉందని చెప్పారు. వర్షానికి ముందు అక్కడ ఎవరు పనిచేశారు. లోనికి ఎవరు వెళ్లారు అనే కోణాల్లో కూడా విచారణ నిర్వహిస్తున్నామని వివరించారు. అన్ని కోణాల్లోను నిస్పాక్షపాతంగా విచారణ పూర్తి చేసి వీలైనంత త్వరలోనే ప్రభుత్వానికి నివేధిస్తామని ఆయన తెలిపారు. సర్కారు సంకేతాలకు అనుగుణంగానే... అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాల్లో చోటు చేసుకున్న లోపాలే వర్షనీరు లీకేజీలకు కారణమని లోకం కోడై కూస్తోంది. అయిన్నప్పటికీ కుట్రకోణం సాకుతో అసలు విషయాన్ని మరుగునపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు రేగుతున్నాయి. సర్కారు సంకేతాలకు అనుగుణంగానే సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్సీఎల్పీ కార్యాలయం రూఫ్ వద్ద పైపు కట్ చేసి ఉందనే కారణం చూపుతున్న ప్రభుత్వం అందుకు నిర్మాణ సంస్థ వైఫల్యాన్ని గుర్తించకపోవడం గమనార్హం. బుధవారం విచారణ ప్రారంభించిన సీఐడీ అధికారులు తొలుత వైఎస్సార్ఎల్పీ కార్యాలయ సిబ్బందిని గద్దించి భయపెట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వర్షం నీరు ఎలా వచ్చింది? నీరు లీకేజీ ఫొటోలు, వీడియోలు ఎవరు తీసారు? మీడియాకు ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. గురువారం టెక్నిషీయన్స్, ఎలక్రి్టషీయన్ల విచారణలోను ఇదే తీరు కొనసాగింది. ఒకరో, ఇద్దరో సిబ్బందిని బలిపశువులను చేసి చర్యలు తీసుకున్నట్టు లీకేజీ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే అనుమానాలు పెరుగుతున్నాయి. -
అసెంబ్లీలో వ్యూహంపై వైఎస్ఆర్సీపీ సమావేశం
అమరావతి: త్వరలో ప్రారంభం కాబోయే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడలో నిర్వహించే ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
నీళ్లు తరలించి సముద్రంలో పోశారు
అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ నేత జగన్ ధ్వజం తెలంగాణకు 120 కోట్లు ఇస్తే పులిచింతలలో 45 టీఎంసీల నీళ్లుండేవి ఫ్లడ్ పో కెనాల్ పూర్తి చేసి ఉంటే ఈవేళ ఇబ్బంది ఉండేదా? గండికోటకు 2012లోనే కలెక్టర్ నీళ్లు తెచ్చారు? ఫ్లడ్ ఫ్లో కెనాల్‌ను ఎందుకు పూర్తి చేయలేదు? సాగునీటిపై గత 3 ఏళ్లలో కేటాయింపులు రూ.15213.83 కోట్లు వ్యయం రు.21,632.73 కోట్లు సాక్షి, అమరావతి: వందల కోట్ల ప్రజాధనాన్ని సముద్రం పాల్జేయడమేనా? ఈ ప్రభుత్వం చేసిన పని అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. కరెంటు చార్జీల కోసం రు. 136 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పట్టిసీమ నుంచి 110 రోజుల్లో 42 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తే అక్కడి నుంచి 55 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకం ఇలా ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యయంపై మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రసవత్తర చర్చ జరిగింది. తొలి వాయిదా అనంతరం తిరిగి సభ 9.21 గంటల సమయంలో ప్రారంభమవుతూనే మంత్రి దేవినేని సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం గత మూడేళ్లలో 15213.83 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేశామని, రు. 21632.73 కోట్లు వ్యయం చేశామన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ‘కృష్ణా నది పరివాహక ప్రాంతంలో 2016–17లో 40 శాతం నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) తగ్గింది. అదే మాదిరిగా తుంగభద్రలో 60 శాతం, పెన్నాలో 60 శాతం తగ్గింది. నాగార్జున సాగర్, తుంగభద్ర హైలెవెల్ కెనాల్ సహా చాలా చోట్ల ఇన్‌ఫ్లో తగ్గింది. మరోవైపున, పట్టిసీమ నుంచి 136 కోట్ల రూపాయలు కరెంట్ చార్జీలకు ఖర్చు పెట్టి 110 రోజుల్లో 42 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి 55 టీఎంసీలను సముద్రం పాలు చేశారు. అయినా అంత గొప్పగా ఉందని చెబుతున్నారు మంత్రిగారు. అధ్యక్షా.. అదే వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కట్టి ఉన్నట్టయితే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేది. అలా చేసి ఉంటే కృష్ణా డెల్టాలోనూ, మిగిలిన చోట్లా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఆ పని చేయలేదు. అదేకాదు అధ్యక్షా.. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల పైచిలుకు నీళ్లు 180 రోజులు నిల్వ ఉన్నా రాయలసీమకు నీళ్లు ఇవ్వలేని అధ్వాన్న స్థితి.. రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లే ఫ్లడ్ ఫ్లో కెనాల్ తయారు కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అదే తయారయి ఉంటే గండికోటలో 26 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేది‘ అని జగన్మోహన్రెడ్డి చెప్పారు. గండికోటతో పాటు చిత్రావతి, సర్వారాయ సాగర్ తదితర ప్రాజెక్టులకూ నీళ్లు వచ్చేవని వివరించారు. ఇవేవీ చేయకపోగా గండికోటకు 5,6 టీఎంసీల నీళ్లు ఇచ్చినట్టు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారని, వాస్తవానికి 2012లోనే కలెక్టర్ శశిధర్ వేరే రూట్లో గండికోటకు 4 టీఎంసీల నీళ్లు తీసుకువచ్చారని, ఫోటోలు కూడా దిగారని చెప్పారు. ఈ దశలో మంత్రి దేవినేని జోక్యం చేసుకుంటూ పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకువచ్చి సముద్రం పాల్జేశామంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర మాట్లాడుతూ బకింగ్‌హాం కెనాల్‌పై ఏమైనా పరిశీలన చేస్తున్నారా అని ప్రశ్నించగా పురుషోత్తపట్నం పథకాన్ని కూడా పట్టిసీమ తరహాలో వేగంగా పూర్తి చేయాలని వర్మ కోరారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. వైఎస్సార్సీపీ సభ్యుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుగంగకు వైఎస్ హయాంలో 12 టీఎంసీలు కేటాయించారని, ఇప్పుడు ఎన్ని టీఎంసీలు కేటాయించారో చెప్పాలన్నారు. కుందు నది మీద రాజోలు వద్ద రిజర్వాయర్ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడేందుకు పదేపదే అభ్యర్థించినప్పటికీ స్పీకర్ అనుమతించలేదు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ గోదావరి నదీ జలాలను పెన్నా నదితో కలిపేందుకు వ్యాప్కోస్‌తో సర్వే చేయిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వినిపిస్తామని, సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఏయే ప్రాజెక్టులకు ఎన్నెన్ని నీళ్లు ఇచ్చిందీ, ఎంతెంత వ్యయం చేసిందీ, ఎంతెంత ఆయకట్టు వచ్చిందీ మంత్రి రాతపూర్వకంగా వివరించారు. కొత్తగా 26 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందన్నారు. అనంతపురం జిల్లాలో 36 వేల బోరు బావులు రీచార్జ్ అయ్యాయన్నారు. -
మనసులోని మాటల్లో ఒకే బాటలో చంద్రబాబు, లోకేశ్
అమరావతి: మనసులోని మాటలను బయట పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఒకే బాటలో పయనిస్తున్నారు. భారత దేశం మొత్తంమీద చూస్తే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని చంద్రబాబు తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ మాటలన్నది మరెక్కడో కాదు... ఏకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఈ మాటలు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ మాటలను చంద్రబాబు బయటపెట్టారు. "ఈ రోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలోగాని అభివృద్ధిలోగానీ మొదటి స్థానంలో ఉన్నాం" అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు చెప్పిన ఈ మాటలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంతకాలానికైనా చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారంటూ పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతి మయంగా మారిందని విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు "ఈ రోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలోగాని అభివృద్ధిలోగానీ మొదటి స్థానంలో ఉన్నాం" అని చాలా స్పష్టంగా అంగీకరించడం గమనార్హం. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం సృష్టించాయి. ఏడాది కిందట చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కూడా ఇదే విధంగా మనసులోని మాటను బయటపెట్టారు. "మీరొకటి గుర్తించండి... ఎలాంటి అవినీతి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అతి తెలుగుదేశం పార్టీ అని చెబుతూ, అవునా కాదా" అంటూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలే గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు సొంత చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. ఆ సందర్భంలోనే "మీరొకటి గుర్తించండి... ఎలాంటి అవినీతి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అతి తెలుగుదేశం పార్టీ అని చెబుతూ, అవునా కాదా" అని వ్యాఖ్యానించారు. అలా చెప్పిన సందర్భంలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా విస్మయం చెందారు. అప్పట్లో లోకేశ్ వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు కూడా సరిగ్గా అదే ధోరణిలో అది కూడా అసెంబ్లీలో చెప్పడం టీడీపీని ఇరకాటంలో నెట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో బాబు వ్యాఖ్యలపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. నేడు అసెంబ్లీలో చంద్రబాబు.. నాడు కార్యకర్తల సమావేశంలో లోకేశ్.. ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..! -
లక్ష్మీ పార్వతి పుణ్యమా అని సీఎం అయ్యా
► ఎన్టీఆర్ బొమ్మతో ఎన్నికల్లో గెలవలేదు ► ఎన్టీఆర్ కు ఛరిష్మా ఉంటే 1989 లో ఎందుకు ఓడిపోయారు ► ఎన్టీఆర్ నన్ను వెన్నుపోటుదారుడని అంటారు ► వెన్నుపోటు పొడిచే తత్వం నా రక్తంలో లేదు ► అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మాటలివి హైదరాబాద్ ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు పేరును స్మరించకుండా ప్రచారం చేయరు. ఆయన పేరు చెప్పకోకుండా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయరు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రతి మహానాడులోనూ తీర్మానం చేయిస్తారు. (అయితే ఆ విషయంలో కేంద్రానికి మాత్రం లేఖ రాయరు అది వేరే విషయం) ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడు (సర్వసభ్య సమావేశం) నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా చేసే తంతులో భాగంగా ఈసారి కూడా తిరుపతిలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో (మే 28 ఎన్టీఆర్ జన్మదినం) ఎన్టీఆర్ ను మరోసారి స్మరించబోతున్నారు. అయితే ఇవన్నీ ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయ ప్రక్రియలు మాత్రమే. 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఆ తర్వాత కాలంలో అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో విన్నవారికి బాబు నైజమేంటో బాగా తెలుసు. ఇప్పటి తరానికి ఆ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చు... కానీ లక్ష్మీపార్వతి పుణ్యమా అని సీఎం అయ్యాననీ అసెంబ్లీ వేదికగా అంగీకరించారు, ఎన్టీఆర్ బొమ్మతో తామంతా ఎన్నికల్లో గెలవలేదని, వెన్నుపోటు పొడిచే తత్వం తన రక్తంలో లేదని ఆయన అన్నారు. 1995 డిసెంబర్ 5 న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమన్నారంటే... (ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దింపిన సందర్భంగా అసెంబ్లీలో, స్పీకర్ నివాసం వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన చర్చ సందర్భంగా...) ''(ఎన్టీఆర్) ప్రతిరోజూ వెన్నుపోటుదారుడని మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకుంటారో అని ప్రతిరోజూ టెన్షన్ గా ఉండేది. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారో మాకు తెలిసేది కాదు. 35 మంది మంత్రులను ఒక్కసారిగా రిమూవ్ చేయడం... (అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొత్తం కేబినెట్ ను రద్దు చేశారు) ఆ విధంగా ఆయన ఎన్ని డెసిషన్స్ వారు తీసుకున్నా మేము అందరం సహకరించి ఎప్పటికప్పుడు ఆ తప్పులను దిద్దుకుంటూ ముందుకు తీసుకుపోయాం.'' (పూర్తిపాఠం చదవండి... ఏ డెసిషన్ తీసుకుంటారో.. ) ''5 సంవత్సరాలు సుమారు 74 మంది ఎమ్మెల్యేలు ఇలా శ్రమపడ్డామో, ఏ విధంగా ఫైట్ చేసి తిరిగి అధికారంలోకి వచ్చామనేది అందరికీ తెలుసు. ఒక వ్యక్తి బొమ్మ పెట్టుకొని గెలిచామనే మాట కాదు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కార్యకర్తలు మొదలైన వారి కాంట్రిబ్యూషన్ ఉంది. రామారావు గారి కాంట్రిబ్యూషనూ ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. అందరూ కలిసి ఎన్నికల్లో గెలిచాం. ఎన్టీఆర్ కు చరిష్మా ఉంటే 1989లో ఆయన ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నా. 1983లో చూసినట్లయితే 200 సీట్లు గెలవడం జరిగింది. (1983లో చంద్రబాబు టీడీపీలో లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు) 84 ఆగస్టు నెల క్రైసిస్ లో మిత్రపక్షాలు అందరూ కలిసి బీజేపీతో సహా 240 మంది గెలిచాం. తిరిగి 1994 లో జరిగిందేంటో అందరికీ తెలుసు. కాంగ్రెస్ 26 అయితే మిత్రపక్షాలతో కలిసి మేం 254 సీట్లు గెలిచాం. ఆ విధంగా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ తో గెలిచాం. ఏ ఒక్కరితో కాదని తెలుపుతున్నాను.'' ''ఒక వ్యక్తి కోసం పార్టీని రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను విస్మరించి ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి నాయకుడు రావడం జరిగింది. మేమంతా చెప్పాం. ఎన్ని చెప్పినా వినలేదు. మా సీనియర్ కొలీగ్స్ చెప్పారు. వినలేదు. వారు ఏమీ వినకుండా ఏకపక్ష ధోరణిలో పోయారు. కాబట్టే మేం నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెబుతున్నా.'' (పూర్తిపాఠం చదవండి... మేం ఎన్ని చెప్పినా వినలేదు) ఈ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు కె. బాపిరాజు జోక్యం చేసుకుని... ''బాబు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆవిడ (లక్ష్మీపార్వతి) పుణ్యమా...'' అని ప్రశ్నించగా... చంద్రబాబు స్పందిస్తూ... ''మీరు తెలుసుకున్న వాస్తవం కూడా ఎన్టీ రామారావు ఇంకా తెలుసుకోలేదు. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకోలేదు. వాస్తవంగా చెబుతున్నాను. ఎన్టీఆర్ బతికున్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న వాడిని. మొన్నటి వరకు నా స్టాండ్ అదే. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీన్నాయో... పార్టీ మొత్తం పోయే పరిస్థితి వచ్చిందో ఎమ్మెల్యేలందరం కలిసి నా మీద ఒత్తిడి తెచ్చినప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. ఎన్ టీ రామారావు అంటుంటారు. వెన్నుపోటు పొడిచే తత్వం నా రక్తంలో లేదు. ఆరోజు మేము పోరాడి చెప్పి చెప్పి విసిగిపోయి తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని పార్టీని నిలబెట్టుకున్నాం. అంతేగానీ ఇంకొకటి కాదు. '' ''ప్రజాస్వామ్యం... ప్రజాస్వామ్యం... అని (ఎన్టీఆర్) మాట్లాడితే నాకే అర్థం కావడం లేదు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినిషన్ ఏంటని అడుగుతున్నాను. ఎన్ టి రామారావు గారు ఏం చేశారంటే పార్టీ కాన్ స్టిట్యూషన్ రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. శాశ్వతంగా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన రాసుకున్నారు. మన కాన్ స్టిట్యూషన్ పర్మిట్ చేస్తే ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునే వారేమో నాకు తెలియదు కానీ... ఆయన (ఎన్టీఆర్) ఎన్ని శాపనార్థాలు పెట్టినా వాటిని ఆశీర్వచనాలుగానే నేను తీసుకుంటా. నేను ఎప్పుడూ తొందరపడే పరిస్థితి లేదు. డెస్పరేట్ మూడ్ లో ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. (ఎన్టీఆర్‌ను గద్దె దించే రోజున అసెంబ్లీలో ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంపై) ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ చెబుతారు. అది కూడా తొందరలోనే చూస్తారు....'' (పూర్తిపాఠం చదవండి... ఆయన ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్నీ పెడుతున్నారు) ఇదీ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఆనాడు అసెంబ్లీ వేదికగా అన్న మాటలు. స్పీకర్‌ను శాసనసభకు రాకుండా ఎన్టీఆర్‌కు మద్దతిచ్చిన శాసనసభ్యులు అడ్డుకున్న తీరును గర్హిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది.