సాక్షి, అమరావతి : ఇంజనీర్ల వైఫల్యం వల్లనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ చాంబర్‌లోకి వర్షపు నీరు వచ్చిందని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలోని జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌ను, అసెంబ్లీ పైభాగంలోని వర్షపు నీరు ప్రవేశించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌పైకి వెళ్ళే మెట్ల ప్రాంత గోడలు, పైశ్లాబు పూర్తిగా పనికి రాకుండా ఉందన్నారు. గోడలు నెర్రెలు బారటంతో పాటు శ్లాబు పై భాగంలో సిమెంటు పెచ్చులు ఊడాయని, ఇలా నిర్మిస్తే భవనం కారక ఏమవుతుందని ప్రశ్నించారు. ఉన్న వాస్తవాన్ని చెబితే విమర్శిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడికి దిగుతున్నారన్నారు. కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా ఎలా కారిందో పూర్తి స్థాయిలో వివరిస్తారన్నారు.
శ్లాబు పై భాగం నుంచి కిందకు వెళ్ళే వర్షపు నీటి పైపులు కూడా చిన్నవిగా ఉండటం మరో కారణమన్నారు. పైపు కట్ కావడం వల్లనే నీరు లోపలికి వచ్చిందని ప్రభుత్వ నేతలు చెబుతున్నారని, ఇదంతా నిర్మాణలోపం అనే విషయాన్ని వారు గుర్తించాలన్నారు. ముందుగా నీరు కారిన ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలిస్తూ జేఎన్‌టీయూ నుంచి వచ్చిన ఇంజనీర్లతో మాట్లాడారు. నిర్మాణ లోపాలను పూర్తిస్థాయిలో గుర్తించాలని వారికి సూచించారు. గోడలు నెర్రెలు బారటాన్ని ఆయన మీడియా వారికి ఒక్కటొక్కటిగా చూపించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇంజనీర్లు, సీఐడీ అధికారుల తీరు కూడా కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెతలా ఉంటుందని ఎద్దేవా చేశారు.
ఇది ఇంజనీర్ల వైఫల్యం
Published Sat, Jun 10 2017 12:19 AM | Last Updated on Tue, May 29 2018 3:48 PM
Advertisement
Advertisement