
మనసులోని మాటల్లో ఒకే బాటలో చంద్రబాబు, లోకేశ్
అమరావతి: మనసులోని మాటలను బయట పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఒకే బాటలో పయనిస్తున్నారు. భారత దేశం మొత్తంమీద చూస్తే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని చంద్రబాబు తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ మాటలన్నది మరెక్కడో కాదు... ఏకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఈ మాటలు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ మాటలను చంద్రబాబు బయటపెట్టారు.
"ఈ రోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలోగాని అభివృద్ధిలోగానీ మొదటి స్థానంలో ఉన్నాం" అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు చెప్పిన ఈ మాటలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంతకాలానికైనా చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారంటూ పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతి మయంగా మారిందని విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు "ఈ రోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలోగాని అభివృద్ధిలోగానీ మొదటి స్థానంలో ఉన్నాం" అని చాలా స్పష్టంగా అంగీకరించడం గమనార్హం.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం సృష్టించాయి. ఏడాది కిందట చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కూడా ఇదే విధంగా మనసులోని మాటను బయటపెట్టారు. "మీరొకటి గుర్తించండి... ఎలాంటి అవినీతి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అతి తెలుగుదేశం పార్టీ అని చెబుతూ, అవునా కాదా" అంటూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలే గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు సొంత చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. ఆ సందర్భంలోనే "మీరొకటి గుర్తించండి... ఎలాంటి అవినీతి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అతి తెలుగుదేశం పార్టీ అని చెబుతూ, అవునా కాదా" అని వ్యాఖ్యానించారు. అలా చెప్పిన సందర్భంలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా విస్మయం చెందారు.
అప్పట్లో లోకేశ్ వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు కూడా సరిగ్గా అదే ధోరణిలో అది కూడా అసెంబ్లీలో చెప్పడం టీడీపీని ఇరకాటంలో నెట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో బాబు వ్యాఖ్యలపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
నేడు అసెంబ్లీలో చంద్రబాబు.. నాడు కార్యకర్తల సమావేశంలో లోకేశ్.. ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..!