- అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ నేత జగన్ ధ్వజం
- తెలంగాణకు 120 కోట్లు ఇస్తే పులిచింతలలో 45 టీఎంసీల నీళ్లుండేవి
- ఫ్లడ్ పో కెనాల్ పూర్తి చేసి ఉంటే ఈవేళ ఇబ్బంది ఉండేదా?
- గండికోటకు 2012లోనే కలెక్టర్ నీళ్లు తెచ్చారు?
- ఫ్లడ్ ఫ్లో కెనాల్‌ను ఎందుకు పూర్తి చేయలేదు?
- సాగునీటిపై గత 3 ఏళ్లలో కేటాయింపులు రూ.15213.83 కోట్లు
- వ్యయం రు.21,632.73 కోట్లు
సాక్షి, అమరావతి:
వందల కోట్ల ప్రజాధనాన్ని సముద్రం పాల్జేయడమేనా? ఈ ప్రభుత్వం చేసిన పని అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. కరెంటు చార్జీల కోసం రు. 136 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పట్టిసీమ నుంచి 110 రోజుల్లో 42 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తే అక్కడి నుంచి 55 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకం ఇలా ఉందంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యయంపై మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రసవత్తర చర్చ జరిగింది. తొలి వాయిదా అనంతరం తిరిగి సభ 9.21 గంటల సమయంలో ప్రారంభమవుతూనే మంత్రి దేవినేని సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం గత మూడేళ్లలో 15213.83 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేశామని, రు. 21632.73 కోట్లు వ్యయం చేశామన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.
‘కృష్ణా నది పరివాహక ప్రాంతంలో 2016–17లో 40 శాతం నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) తగ్గింది. అదే మాదిరిగా తుంగభద్రలో 60 శాతం, పెన్నాలో 60 శాతం తగ్గింది. నాగార్జున సాగర్, తుంగభద్ర హైలెవెల్ కెనాల్ సహా చాలా చోట్ల ఇన్‌ఫ్లో తగ్గింది. మరోవైపున, పట్టిసీమ నుంచి 136 కోట్ల రూపాయలు కరెంట్ చార్జీలకు ఖర్చు పెట్టి 110 రోజుల్లో 42 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి 55 టీఎంసీలను సముద్రం పాలు చేశారు. అయినా అంత గొప్పగా ఉందని చెబుతున్నారు మంత్రిగారు.
అధ్యక్షా.. అదే వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కట్టి ఉన్నట్టయితే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేది. అలా చేసి ఉంటే కృష్ణా డెల్టాలోనూ, మిగిలిన చోట్లా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఆ పని చేయలేదు. అదేకాదు అధ్యక్షా.. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల పైచిలుకు నీళ్లు 180 రోజులు నిల్వ ఉన్నా రాయలసీమకు నీళ్లు ఇవ్వలేని అధ్వాన్న స్థితి.. రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లే ఫ్లడ్ ఫ్లో కెనాల్ తయారు కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అదే తయారయి ఉంటే గండికోటలో 26 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేది‘ అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గండికోటతో పాటు చిత్రావతి, సర్వారాయ సాగర్ తదితర ప్రాజెక్టులకూ నీళ్లు వచ్చేవని వివరించారు. ఇవేవీ చేయకపోగా గండికోటకు 5,6 టీఎంసీల నీళ్లు ఇచ్చినట్టు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారని, వాస్తవానికి 2012లోనే కలెక్టర్ శశిధర్ వేరే రూట్‌లో గండికోటకు 4 టీఎంసీల నీళ్లు తీసుకువచ్చారని, ఫోటోలు కూడా దిగారని చెప్పారు.
ఈ దశలో మంత్రి దేవినేని జోక్యం చేసుకుంటూ పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకువచ్చి సముద్రం పాల్జేశామంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర మాట్లాడుతూ బకింగ్‌హాం కెనాల్‌పై ఏమైనా పరిశీలన చేస్తున్నారా అని ప్రశ్నించగా పురుషోత్తపట్నం పథకాన్ని కూడా పట్టిసీమ తరహాలో వేగంగా పూర్తి చేయాలని వర్మ కోరారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
వైఎస్సార్సీపీ సభ్యుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుగంగకు వైఎస్ హయాంలో 12 టీఎంసీలు కేటాయించారని, ఇప్పుడు ఎన్ని టీఎంసీలు కేటాయించారో చెప్పాలన్నారు. కుందు నది మీద రాజోలు వద్ద రిజర్వాయర్ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడేందుకు పదేపదే అభ్యర్థించినప్పటికీ స్పీకర్ అనుమతించలేదు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ గోదావరి నదీ జలాలను పెన్నా నదితో కలిపేందుకు వ్యాప్కోస్‌తో సర్వే చేయిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వినిపిస్తామని, సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఏయే ప్రాజెక్టులకు ఎన్నెన్ని నీళ్లు ఇచ్చిందీ, ఎంతెంత వ్యయం చేసిందీ, ఎంతెంత ఆయకట్టు వచ్చిందీ మంత్రి రాతపూర్వకంగా వివరించారు. కొత్తగా 26 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందన్నారు. అనంతపురం జిల్లాలో 36 వేల బోరు బావులు రీచార్జ్ అయ్యాయన్నారు.