రాజన్నా..నీ మేలు మరువలేం.. | YSR Memories In Vizianagaram District | Sakshi
Sakshi News home page

రాజన్నా..నీ మేలు మరువలేం..

Published Mon, Sep 2 2019 9:35 AM | Last Updated on Mon, Sep 2 2019 9:36 AM

YSR Memories In Vizianagaram District - Sakshi

కరువుకోరల్లో చిక్కుకున్న జనానికి ఆపన్న హస్తం అందించావు.. ప్రకృతి కరుణించక.. సాగునీరు లేక.. బీడువారిన భూములను జలయజ్ఞంతో సస్యశ్యామలం చేశావు.. రుణాలు మాఫీ చేశావు.. విద్యుత్‌ చార్జీలు మాఫీ చేసి ఉచిత విద్యుత్‌ అందించావు... వేలకువేలు ఖర్చుచేయలేక... అనారోగ్యం పాలైన రోగులకు ఆరోగ్యశ్రీతో అండగా నిలిచావు.. ఆర్థిక స్థోమత సహకరించక.. చదువులు సాగించలేని విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఊతమిచ్చావు.. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నావు... విజయనగరం జిల్లా అభివృద్ధికి బాటలు వేశావు... రాజన్నా... నిను మరువలేము... మా గుండెల్లో నీ గుడి కట్టుకున్నాం... ప్రతిరోజూ నిను తలచుకుంటున్నాం... సోమవారం జరిగే నీ వర్ధంతికి మనసారా అంజలి ఘటిస్తాం. 

సాక్షి, విజయనగరం: డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా జిల్లాకు ఎనలేని అభివృద్ధి చేశారు. రైతులకు సాయం చేశారు. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు సాగునీరు అందించారు. సోమవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జిల్లాకు చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ  తోటపల్లి నుంచి సాగునీటి కాలువ ప్రారంభించి  అన్నదాతల్లో కళ్లల్లో వెలుగులు నింపారు.  చీపురుపల్లి నియోజకవర్గంలో  2004 నుంచి 2009 వరకు నియోజకవర్గంలో అభివద్ధి పరుగులు పెట్టించారు. రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని బొబ్బిలి నియోజకవర్గానికి మంజూరు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు మంజూరు చేశారు. ఎస్‌కోట నియోజకవర్గంలోని వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దామంటూ హామీ ఇచ్చిన వైఎస్సార్‌ అతని హయాంలోనే నిధులు కొంతమేర మంజూరు చేశారు.  తరువాత సాగర్‌ అభివృద్ధిని పట్టించుకున్న నాథుడు లేడు. ఖాయిలా పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు.

సుజలస్రవంతితో విశాఖ ప్రజల దాహార్తిని తీర్చి తాటిపూడి, రైవాడ రిజర్వాయర్‌ నీటిని పూర్తిగా సాగుకు విడిచిపెడతామంటూ హామీ ఇచ్చారు. ఆయన మరణంతో సుజలస్రవంతికి మోక్షం లేక, తాటిపూడి, రైవాడ రిజర్వాయర్‌ నీటిని తాగునీటి అవసరాల పేరుతో తరలిస్తూ కోట్ల రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ హయాంలోనే మెంటాడ, పాచిపెంట, సాలూరు మండలాల్లో అభివద్ధి ఎక్కువగా జరిగింది. గ్రామాలకు రహదారులు, వంతెనల నిర్మాణాలు జరిగాయి. మక్కువ  మండలంలో మాత్రం సూరాపాడు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అలాగే, వెంగళరాయ సాగర్‌ రిజర్వాయర్‌ సంబంధించిన కాలువలు అభివద్ధి పనులు జరిగాయి. కురుపాం నియోజకవర్గంలో తోటపల్లి రిజర్వాయర్‌కు వైఎస్సార్‌ నాంది పలికారు. దీంతో లక్షలాది ఎకరాలకు సాగునీరుకు అస్కార లభ్యమైంది. దీంతో రైతులు కూడా ఎంతో ఊరటచెందారు. కొమరాడ మండలంలో జంఝావతి రబ్బర్‌ డ్యామ్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే నిర్మాణానికి నాంది పలికారు. జంఝావతి ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి రబ్బర్‌డ్యామ్‌గా పేరుంది.

కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టు రబ్బర్‌ డ్యామ్‌కు రూ.6 కోట్లు విడుదల చేశారు. నిరూపయోగంగా ఉన్న డ్యామ్‌కు రబ్బర్‌ డ్యామ్‌ను నిర్మించడం వల్ల 3వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అప్పట్లో గిరి నియోజకవర్గంలో వేల మంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేయించి వేలాది మంది ప్రాణాలు నిలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 90 శాతం పనులు పూర్తిచేయించారు. గజపతినగరం నియోజకవర్గానికి తోటపల్లి చానల్‌ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు పైలాన్‌ ప్రారంభోత్సవం చేశారు. పేదలకు లక్షలాది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.  అర్హులైన ప్రతీ ఒక్కరికీ కుల, మతాల తేడా లేకుండా పింఛన్లు మంజురు చేశారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో  యూత్‌ హస్టల్‌ ప్రారంభించి  వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో  వైఎస్‌ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. ఇక్కడి నాలుగు మండలాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తారకరామతీర్థసాగర్‌ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారు.  దీని కోసం 2007లోనే సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. అయితే ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేయించి సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు.

‘కోట’తో మహానేత బంధం మరువలేనిది..
శృంగవరపుకోట: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డికి ఎస్‌.కోట నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉంది. ఎన్నో దఫాలు ప్రతిపక్ష నేతగా, సీఎంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించారు.  తొలుత 1998లో పీసీసీ అధ్యక్షుని హోదాలో, 1999 ఎన్నికల ప్రచారం, 2001 నాటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్‌.కోట వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేశారు. 2003 నాటి పాదయాత్రలో భాగంగా జిల్లాలో మొదటిగా శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని వేపాడ మండలంలోని నీలకంఠరాజపురం గ్రామంలో అడుగుపెట్టారు. మా కన్నీళ్లు తుడిచి, మాకింత కూడు పెట్టిన మహానుభావుడు రాజన్న అంటూ  భీమసింగి సహకార చక్కెర కర్మాగార కార్మికులు దివంగత రాజన్నను జ్ఞాపకం చేసుకుంటారు. అధికారంలోకి వస్తే  కర్మాగారాన్ని తెరిపిస్తానని ఇచ్చిన మాట ప్రకారం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2004 సంవత్సరం నవంబర్‌ 15న చక్కెర కర్మాగారంలో క్రషింగ్‌ ప్రారంభించారని, కర్మాగారానికి ఆప్కాబ్‌ నుంచి రూ.36కోట్లు రుణం ఇచ్చి, ఖాయిలా పడ్డ కర్మాగారం తెరిపించారని, 300 కార్మికులు జీవితాల్లో, వేలమంది రైతన్నల బతుకుల్లో  వెలుగు నింపారని గుర్తుచేసుకుంటున్నారు. 

మహానేతా మనసాస్మరామి..
బాడంగి: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2007లో ఇందిరమ్మ చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలంలోని బొత్సవానివలసలలో మల్లునాయుడు చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చెరువును బాగుచేసేందుకు కృషిచేశారు. వాసిరెడ్డి వరదరామారావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈ ప్రాంతాభివృద్ధికి కృషిచేశారని ఈ ప్రాంతీయులు చెబుతున్నారు. ఆయన వర్ధంతిని జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

రైతుల మదిలో చెరగని ముద్ర..
దత్తిరాజేరు: నిత్యం రైతుల కోసం ఆలోచించి వారి అభ్యున్నతి గురించి పాటుపడిన వ్యక్తులు కొంత మందే ఉంటారు. అలాంటి వ్యక్తులలో రైతుల మదిలో చెరగని ముద్ర వేసుకన్న వ్యక్తి స్వర్గీయ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి. ప్రజా సమస్యలను తెలసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలో దత్తిరాజేరు రైతుల సాగు కష్టాలను గుర్తించారు. వర్షాధారంతో పంటలు సాగుచేసి ప్రకృతి అనుకూలించక రైతులు అప్పులపాలవుతున్న వైనాన్ని కళ్లారా చూశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి ప్రాజెక్టు నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. అంతే... 2004లో గద్దెనెక్కిన వెంటనే తోటపల్లి నీటిని అందించేందుకు వీలుగా కాలువ తవ్వకాల పనులకు 2006లో పెదమానాపురం సంత వద్ద శంకుస్థాపన చేశారు. మండలంలోని చినకాదలో 785.08 ఎకరాలకు, పెదకాదలో 734.08 ఎకరాలకు, వంగరలో 627.47, గొభ్యాంలో 435.86, దాసపేటలో 233.75, కన్నాంలో 285.31, విజయ రామగజపతిపురానికి 58.23, వింద్యవాసిలో 118.42, వి.కృష్ణాపురంలో 203.54, పెదమానాపురంలో 643.12 ఎకరాలకు సాగునీటినందించేందుకు కాలువ తవ్వకాలకు అవసరమైన భూమిని సేకరించారు. అయితే, ఆయన మరణానంతరం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో రైతుల సాగునీటి కష్టాలు యథావిధిగా మిగిలాయి.

జలయజ్ఞ ప్రదాత..
గరుగుబిల్లి: జలయజ్ఞం పథకంలో భాగంగా నాగావళి నదిపై రూ.450.23 కోట్ల వ్యయంతో తోటపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పంటపొలాలకు సాగునీరు అందించారు. పాత ఆయకట్టు 64 ఎకరాలతో పాటు అదనంగా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల గుండెల్లో గుడికట్టుకున్నారు. ఆయన కృషివల్లే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందంటూ రైతులు నిత్యం రాజన్నను తలచుకుంటారు. 

సంక్షేమ పథకాల రూపకర్త..
విజయనగరం ఫోర్ట్‌: ప్రకృతి కరుణించక.. పంటలు పండక.. ప్రభుత్వ సాయం అందక..   కరువుతో తినడానికి తిండలేక రైతులు వలస వెళ్లేపోయే పరిస్థితులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని కదిలించాయి. పాదయాత్ర పూర్తిచేసి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమపథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. కరువు పరిస్థితులను రూపుమాపేందుకు కృషిచేశారు. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువు చేసి ఆర్థిక పుష్టికలిగించారు. విద్య, వైద్య సదుపాయాలతో పాటు రైతుల కష్టాలు తీర్చారు. విద్యుత్‌ చార్జీలు, పంట రుణాలు మాఫీ చేశారు. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పించారు. రూ.2కే కిలో బియ్యం అందించారు. 108, 104 వాహనాలతో వైద్యాన్ని అక్కరకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో రూపాయి ఖర్చులేకుండా శస్త్రచికిత్సలు చేయించారు. ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించారు.

రుణం మాఫీ చేశారు... 
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కరువు పరిస్థితులతో బ్యాంకులో తీసుకున్న రూ.50 వేల రుణం తీర్చలేకపోయాను. వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత అసలు రూ.50 వేలు వడ్డీ రూ.30 వేలు మొత్తం రూ.80 వేలు రుణమాఫీ చేశారు. మళ్లీ బ్యాంకులో రుణం కూడా ఇప్పించారు. సాగుకు ఊతమిచ్చారు.  
 – ఎస్‌.సర్వదేముడు, రైతు

ఆరోగ్యశ్రీ ఆదుకుంది.. 
నాకు కడుపులో నొప్పి రావడంతో కేంద్రాస్పత్రిలో చేరాను. పైసా తీసుకోకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేశారు. నాకు వైద్యం చేయించిన వైఎస్సార్‌ను మరువలేను. 
 – ఎస్‌.రాము, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు, పెదవేమలి గ్రామం  

అపర భగీరథుడు..
కొమరాడ: కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మిపురం గ్రామం వద్ద 1976లో జంఝావతి రిజర్వాయర్‌ నిర్మించారు. ఒడిశాతో చిన్నపాటి వివాదంతో రిజర్వాయర్‌ అక్కరకు రాకుండా పోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఫలితం లేకపోయింది. దిగవంత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆస్ట్రియా టెక్నాలజీతో రూ.6 కోట్ల వ్యయంతో రబ్బర్‌డ్యాంను ఏర్పాటుచేశారు. సుమారు 12వేల ఎకరాలను సస్యశ్యామలం చేశారు. ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చి అపరభగీరథుడిగా పేరుపొందారు. ఆయన మేలును మరచిపోలేమని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. 

వైఎస్సార్‌ రైతుల పాలిటి దేవుడు.. 
మహానేత వైస్సార్‌ రైతుల పాటిట దేవుడు. ఎన్నోదశాబ్దాల కళను నిజం చేశారు. జంఝావతి నీటిని పొలాలకు మళ్లించారు. ఆయన చేసిన మేలు నా జీవితాంతం మరవలేను. 
– దాసరి నారయణరావు, రైతు, విక్రంపురంగ్రామం, కొమరాడ మండలం

రాజన్న దయే... 
ఈ రోజు పంటలు పండి నాలుగు మెతుకులు తింటున్నామంటే అది వైఎస్సార్‌ దయే. బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసిన ఘతన వైఎస్సార్‌దే. జంఝావతి నీరు గంగారేగువలస పరిసర పాంతాలకు అందుతుందంటే ఆయన ఏర్పాటుచేసిన రబ్బరుడ్యామ్‌ వల్లే. 
– ద్వారపురెడ్డి జనార్దననాయుడు, గంగారేగువలస గ్రామం, కొమరాడ మండలం

ఆయనుంటే మరింత మేలు జరిగేది.. 
మహానేత బతికుంటే జంఝావతి ప్రాజెక్టనుంచి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందేది. ఒడిశాతో వివాదం పరిష్కరించేవారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 
 – కెంగువ పోలినాయుడు, మాజీ సర్పంచ్, కొత్త కంబవలస, కొమరాడ 

విద్యా వెలుగులు..
సీతానగరం: సీతానగరం మండలంలో  మహానేత వైఎస్సార్‌ విద్యావెలుగులు ప్రసరింపజేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత చేపట్టిన రాజీవ్‌ పల్లెబాటలో భాగంగా సీతానగరంలో పర్యటించిన ఆయన మండలంలోని ఆహ్లాదకర వాతావరణానికి ఆకర్షితులయ్యారు. జోగింపేట వద్ద పట్టు పరిశ్రమకేంద్రాన్ని ఏర్పాటుచేయించారు. అలాగే, గిరిజన ప్రతిభావిద్యాలయాన్ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్ల వ్యయంతో గిరిజన ప్రతిభ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 6 జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులకు విద్యా బోధన జరుగుతోంది. గిరిజన ప్రతిభా విద్యాలయాన్ని ఆనుకుని ఎస్సీకులాలకు చెందిన కుటుంబాల్లో విద్యాకుసుమాలు విలసిల్లాలనే ఉద్దేశ్యంతో 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.16 కోట్ల వ్యయంతో సాంఘిక సంక్షేమగురుకుల బాలుర విద్యాలయాన్ని ఏర్పాటు శ్రీకారం చుట్టారు. రెండు విద్యాలయాలకు ఆనుకుని ఉన్న 2 ఎకరాల విస్తీర్ణంలో కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చారు. రాజన్న మండలానికి రాకతోనే  జోగింపేట గ్రామం విద్యలయాలకు నిలయమైందని ఈ ప్రాంతీయులు గుర్తుచేసుకుంటున్నారు.

ఆరోగ్యశ్రీతో ఆదుకున్నారు.. 
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా కుటుంబాన్ని కాపాడింది. ముగ్గురు ఆడపిల్లలకు తండ్రినైన నాకు పైసా ఖర్చులేకుండా గుండె ఆపరేషన్‌ చేశారు. నిజంగా వైఎస్సార్‌ దేవుడు. గతంలో షర్మిల, జగన్‌ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని కలిసి ఇదే విషయాన్ని చెప్పాను. 
– అడబాల కృష్ణారావు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారు, మెట్టవలస

ఎంబీఏ చదివా....
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను గజపతినగరం సెయింట్‌ థెరీసా కళాశాలలో ఎంబీఏ చేశాను. నాకు రెండేళ్లకు రూ.60వేలు ఫీజురీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. లేకుంటే నేను చదవలేకపోయేవాడిని. రాజశేఖర్‌రెడ్డి నాలాంటి ఎందరికో ఉన్నత విద్యావకాశాలను కల్పించి అమరులయ్యారు.
– అరసాడ శంకరరావు, ఎంబీఏ పట్టభద్రుడు, మెట్టవలస 

బీసీల్లో చేర్చడంతో... 
ఓసిలో ఉన్న అయ్యరకలను బీసీలో చేర్చిన మహనీయుడు వైఎస్సార్‌ రాజశేఖరరెడ్డే. ఆయన దయతో మా కులంలో ఉన్న చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. బీసీ రిజర్వేషన్‌తో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. మా కులస్తులందరూ రాజశేఖరుడికి రుణపడి ఉన్నాం.
– లెంక కనక తాతారావు, ఏఆర్‌ కానిస్టేబుల్, సుందరయ్యపేట

గూడు గోడు తీర్చారు... 
ఇల్లులేక ఇబ్బంది పడుతున్న మా కుటుంబానికి  ఇల్లు మంజూరు చేశారు. రాజన్న అందించిన నిధులు రూ.50వేలతో ఇల్లు కట్టుకున్నాం. మాలాంటి ఎంతోమంది పేదలకు పక్కా ఇంటి భాగ్యం కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. 
– బల్లంకి శ్యామల, బొద్దాం, వేపాడ మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement