
పదవి నిలుపుకోవడానికే జగన్‌పై విమర్శలు
మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం
అనంతపురం : ‘వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శిస్తే మంత్రి పదవి ఉంటుందనుకుంటున్నారు.. పల్లె సారూ...మీరు ఎన్ని విమర్శలు చేసినా మీ పదవి ఊడడం ఖాయం’ వైఎస్సార్‌సీపీ నాయకులు మంత్రి రఘునాథరెడ్డిపై ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలే జయరాంనాయక్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, క్రిష్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు కొంకిర జయపాల్ విలేకరులతో మాట్లాడారు.
తన విద్యా సంస్థల్లోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులను బినామీ పేర్లతో కాజేసిన చరిత్ర పల్లె రఘునాథరెడ్డిదని వారు విమర్శించారు. గౌరీ థియేటర్ సమీప ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆయన తన కళాశాలను విస్తరించుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మంత్రి స్థాయిలో ఉన్నా పుట్టపర్తి మండలం పెడబల్లితండాలో తాగునీరు ఇవ్వలేకపోవడంతో తండావాసులే సొంత ఖర్చుతో బోర్లు వేయించుకున్నారన్నారు.
వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేశారన్నారు. దమ్ముంటే వారితో రాజీనామాలు చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలన్నారు. అప్పుడు వైఎస్సార్‌సీపీని ఖాళీ చేస్తారో...మీ పార్టీని ఖాళీ అవుతుందో ప్రజలే తేలుస్తారన్నారు. మీ అసత్య ప్రచారాలకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి తగిన చెబుతారన్నారు.