
సాక్షి, అమరావతి: అత్యంత పారదర్శకంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ కురసాల కన్నబాబు తెలిపారు. ఇప్పటివరకూ 40 లక్షలమంది రైతులను అర్హులగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఇంకా అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని అన్నారు. మంత్రి కన్నబాబు సోమవారమిక్కడ మాట్లాడుతూ...‘గత ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకంలో భారీగా అనర్హులకు ఇచ్చారు. ఆర్టీజీఎస్ ద్వారా అమలు చేసిన పథకం జాబితాలో లక్షల్లో అనర్హులు ఉన్నారు. వారిని తొలగిస్తున్నాం.
ఇన్‌కం ట్యాక్స్ కట్టేవాళ్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులను జాబితా నుంచి తొలగిస్తున్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాం. ఆర్‌వోఆర్ పట్టాలున్న గిరిజన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం. ఈ నెల 15వ తేదీ తర్వాత రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రకటిస్తాం. చంద్రబాబు నాయుడు అప్పులతో రాష్ట్రాన్ని అప్పచెప్పినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతంగా హామీలు నెరవేరుస్తున్నారన్నారు.