సాక్షి, యలమంచిలి : ఐదేళ్లుగా వరి సేద్యం గిట్టుబాటు కావడం లేదు. నష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టించినా.. చేసిన అప్పులు తీరడం లేదు. ఫలితంగా అన్నదాతలు బక్కచిక్కిపోతున్నారు. కొందరు ఆక్వా రంగం వైపు తరలిపోతున్నారు. దీంతో లక్షలాది ఎకరాల పచ్చని పంట భూములు మాయమైపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సర్కారు తీరే. గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల అన్నదాతలు కోలుకోలేకపోతున్నారు.
దీనికితోడు పెరిగిన ఎరువులు, కూలి ధరలు, సకాలంలో అందని పెట్టుబడి రైతును కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగు ప్రారంభంలో రైతులు పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ దయనీయ స్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. నవరత్నాల్లో భాగమైన ఈ పథకం రైతులకు ఆశా దీపంగా మారింది.
ఇదీ రైతు భరోసా స్వరూపం
- ప్రతి రైతు కుటుంబానికీ ఐదేళ్లలో రూ.50 వేలు
- ప్రతి ఏడాదీ రూ.12,500 చొప్పున సాయం
- నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ
- వడ్డీ లేని పంట రుణాలు
- ఉచితంగా బోర్లు
- పగటి సమయంలో 9 గంటల ఉచిత విద్యుత్
- ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే.
- రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
- రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయక నిధి
- శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటు
- అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
- సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 సబ్సిడీ
- వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు రద్దు
- ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు
- ఈ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం
తండ్రి బాటలోనే జగన్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం పండగలా ఉండేది. ఆయన మరణానంతరం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో తండ్రి మాదిరిగానే జగన్ కూడా నవ రత్నాలలో మొదటి అంశంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ భరోసా రైతులపాలిట ఆశాదీపంలా కనిపిస్తోంది.
– గంధం సత్యకీర్తి, రైతు, మేడపాడు
Comments
Please login to add a commentAdd a comment